మ్యూచువల్‌ ఫండ్‌ మదుపర్లకు గుడ్‌న్యూస్‌.. కేవైసీ నిబంధనల్లో సడలింపు

స్టాక్‌ మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ కేవైసీ నిబంధనల్ని సడలించింది. ఈమేరకు తాజా సర్క్యులర్‌ జారీ చేసింది.

Published : 15 May 2024 19:12 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: మ్యూచువల్‌ ఫండ్‌లో మదుపు చేస్తున్నారా? అయితే మీకో గుడ్‌న్యూస్‌. కేవైసీ (KYC) నిబంధనల్ని స్టాక్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ.. సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా (SEBI) సులభతరం చేసింది. కేవైసీ రిజిస్టర్డ్‌ స్టేటస్‌ కోసం ఆధార్‌- పాన్‌ (PAN) లింక్‌ చేయడం తప్పనిసరి చేస్తూ తీసుకొచ్చిన నిబంధనల్ని సడలించింది. ఈమేరకు తాజా సర్క్యులర్‌ని జారీ చేసింది.

బ్యాంకులు, ఫండ్‌ హౌస్‌లు, స్టాక్‌ బ్రోకర్లు పెట్టుబడి ప్రారంభించే ముందు గుర్తింపును ధ్రువీకరించే ప్రక్రియే కేవైసీ. పారదర్శక వాతావరణంలో మదుపరులు తమ పెట్టుబడులను నిర్వహించేందుకు వీలు కల్పించడంతోపాటు, మోసపూరిత కార్యకలాపాలను నిరోధించడమే దీని లక్ష్యం. అయితే ఇంతకుముందు మీ పాన్‌, ఆధార్‌ లింక్‌ చేయకపోతే మీ కేవైసీ హోల్డ్‌లో ఉండేది. అంటే తిరిగి పెట్టుబడులు చేయడానికి అనుమతి ఉండదు. ఈ కేవైసీ ప్రక్రియను 2024 మార్చి 31లోపు కచ్చితంగా పూర్తి చేయాలని గతేడాది అక్టోబర్‌లోనే సెబీ ఆదేశించింది. లేదంటే మార్చి 31 నుంచి కొత్త పెట్టుబడులను అనుమతించబోమని స్పష్టం చేసింది. ఈ మార్పు కారణంగా అనేక మ్యూచువల్‌ ఫండ్‌ ఖాతాలు తాత్కాలిక సస్పెన్షన్‌కు గురయ్యాయి. కేవైసీ అసంపూర్తిగా ఉన్న 13 మిలియన్‌ ఖాతాలు ఈ చిక్కుల్లో పడ్డాయి.

ప్రాజెక్ట్‌ అస్త్ర.. జీమెయిల్‌లో జెమినీ.. లెక్కల్లో సాయం.. గూగుల్‌ కొత్త అప్‌డేట్స్!

మే 14న జారీ చేసిన సర్క్యులర్‌లో సెబీ ఈ నిబంధనల్ని సడలించింది. ఇంతకుముందు కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలంటే పాన్‌ను ఆధార్‌తో లింక్‌ చేయడం తప్పనిసరి. కానీ ఇకపై ఆధార్‌, పాస్‌పోర్ట్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఓటర్‌ ఐడీ కార్డ్‌ వంటి.. ఇతర పత్రాలతోనూ కేవైసీ రిజిస్టర్డ్‌ స్టేటస్‌ పొందొచ్చని తాజా నిబంధనల్లో సెబీ పేర్కొంది. కేవైసీ రిజిస్టర్డ్‌ స్టేటస్‌ పొందిన మదుపరులు ఇప్పటికే పెట్టుబడులు కలిగిఉన్న ఫండ్‌ హౌస్‌లతో మాత్రమే లావాదేవీలు చేయగలరు. కానీ కేవైసీ వ్యాలిడేట్‌ స్టేటస్‌ పొందాలంటే మాత్రం పాన్‌-ఆధార్‌ లింక్‌ చేయాలని తెలిపింది. ఈ స్టేటస్‌ పొందినవారు పెట్టుబడిదారుల లావాదేవీలపై ఎటువంటి పరిమితులూ ఉండవు. కేవైసీ స్టేటస్‌ కోసం  సీడీఎస్‌ఎల్‌ వెబ్‌సైట్‌కు వెళ్లి.. KYC inquiry పై క్లిక్‌ చేసి స్టేటస్‌ తెలుసుకోవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని