SEBI: ఐసీఐసీఐ బ్యాంక్‌కు సెబీ హెచ్చరిక

ఐసీఐసీఐ బ్యాంక్‌కు మార్కెట్‌ నియంత్రణాధికార సంస్థ సెబీ హెచ్చరిక జారీ చేసింది. బ్యాంకు అనుబంధ సంస్థ అయిన ఐసీఐసీఐ సెక్యూరిటీస్, తన డీలిస్టింగ్‌కు వాటాదార్ల ఆమోదాన్ని మార్చిలో పొందింది.

Published : 07 Jun 2024 03:29 IST

ముంబయి: ఐసీఐసీఐ బ్యాంక్‌కు మార్కెట్‌ నియంత్రణాధికార సంస్థ సెబీ హెచ్చరిక జారీ చేసింది. బ్యాంకు అనుబంధ సంస్థ అయిన ఐసీఐసీఐ సెక్యూరిటీస్, తన డీలిస్టింగ్‌కు వాటాదార్ల ఆమోదాన్ని మార్చిలో పొందింది. ఇందుకోసం బ్యాంక్‌ తన ఉద్యోగుల ద్వారా, వాటాదార్లను పలుసార్లు సంప్రదించి డీలిస్టింగ్‌కు అనుకూలంగా ఓటు వేయించడానికి ప్రయత్నాలు చేసిందని తమకు ఫిర్యాదులు అందాయంటూ, ఒక హెచ్చరిక లేఖను ఐసీఐసీఐ బ్యాంక్‌కు సెబీ జారీ చేసింది. లావాదేవీకి సంబంధించిన నిజానిజాలను మాత్రమే ఉద్యోగుల ద్వారా వాటాదార్లకు తెలియచేశామని బ్యాంకు సమాధానమిచ్చింది. అయితే లావాదేవీలో ఐసీఐసీఐ బ్యాంక్‌ కూడా ఒక భాగం కావడం వల్ల, దానికీ ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది కాబట్టి.. వాటాదార్లను అలా సంప్రదించడం సరికాదని సెబీ పేర్కొంది. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు సెబీ స్పష్టం చేసింది.


వేదాంతా విభజనకు రుణదాతల అనుమతులు!

దిల్లీ: అగ్రగామి మైనింగ్‌ సంస్థ వేదాంతాను 6 స్వతంత్ర నమోదిత సంస్థలుగా విభజించాలన్న ప్రతిపాదనకు, మెజారిటీ రుణదాతల ఆమోదం లభించిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. మొత్తం రుణదాతల్లో 75% మంది నుంచి అనుమతులు లభించాల్సి ఉండగా.. 52% మంది అంగీకరించారని, ఇంకో వారం లేదా 10 రోజుల్లో మిగిలిన వారి అనుమతులు పొందుతామని వేదాంతా సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఒకరు తెలిపారు. ఆ తర్వాత ఎన్‌సీఎల్‌టీలో దరఖాస్తు చేసుకుంటామన్నారు. వేదాంతాకు ప్రధాన రుణదాత అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) ఇప్పటికే అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. 


ఏప్రిల్‌ 20 నుంచి దిల్లీ-లండన్‌ విమాన సర్వీసు

బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌

దిల్లీ: వచ్చే ఏడాది ఏప్రిల్‌ 20 నుంచి దిల్లీ-లండన్‌కు రోజువారీ విమాన సర్వీసులు నడపనున్నట్లు బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌ వెల్లడించింది. ఈ కొత్త విమాన సర్వీసు కోసం బోయింగ్‌ 787-8 విమానాన్ని సంస్థ వాడనుంది. ‘కొత్త విమాన సర్వీసుతో, భారత్‌లో మేం ఒక వారంలో 5 నగరాలకు నడుపుతున్న విమాన సర్వీసుల సంఖ్య 63కు చేరుతుంద’ని బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌ వెల్లడించింది. ప్రస్తుతం వారంలో 56 విమాన సర్వీసులను ఈ సంస్థ నడిపిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్, చెన్నై, బెంగళూరు  నగరాల నుంచి రోజువారీ విమాన సర్వీసులు ఇందులో ఉన్నాయి. 


ఐరోపా-భారత్‌ నగరాలకు విజ్‌ ఎయిర్‌ విమానాలు

దిల్లీ: హంగేరీకి చెందిన విజ్‌ ఎయిర్‌ భారత్, ఐరోపా నగరాల మధ్య విమాన సేవలు ప్రారంభించాలని చూస్తోంది. సగటున ఒకవైపు ఛార్జీ 200 యూరోలు (సుమారు రూ.18,000) ఉండొచ్చని, కనిష్ఠంగా అయితే 100 యూరోల లోపే ఉండొచ్చనీ కంపెనీ సీఈఓ జోసెఫ్‌ వరాది పేర్కొన్నారు. 20 ఏళ్లుగా విమానయాన రంగంలో ఉన్న ఈ కంపెనీ, భారత్‌కు సేవలు ప్రారంభించేందుకు కేంద్రం, నియంత్రణ సంస్థలతో చర్చలు జరుపుతోంది. ప్రస్తుతం ఐరోపా నుంచి భారత్‌కు విమాన టికెట్లు అధికంగా ఉంటున్నాయని జోసెఫ్‌ తెలిపారు. ‘వచ్చే ఏడాది ప్రారంభంలో ఏ321 ఎక్స్‌ఎల్‌ఆర్‌ విమానాలు మాకు అందుబాటులోకి రానున్నాయి. నాన్‌-స్టాప్‌గా 8 - 8.50 గంటలు ప్రయాణించేందుకు ఈ విమానాలు ఉపయోగపడతాయ’ని ఆయన అన్నారు.

కంపెనీ వెబ్‌సైట్‌ ప్రకారం.. ఒక్కో ప్రయాణికుడు 10 కిలోల వరకు క్యాబిన్‌ బ్యాగేజీని ఉచితంగా తీసుకెళ్లొచ్చు. ఐరోపాలో 6 లేదా 7 నగరాలను భారత్‌లోని ప్రధాన విమానాశ్రయాలతో అనుసంధానం చేయాలని కంపెనీ భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. నీ విజ్‌ ఎయిర్‌ లండన్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీలో నమోదైన కంపెనీ. దీనికి నాలుగు సంస్థలున్నాయి. అవి విజ్‌ ఎయిర్‌ హంగేరీ, విజ్‌ ఎయిర్‌ యూకే, విజ్‌ ఎయిర్‌ మాల్టా, విజ్‌ ఎయిర్‌ అబుదాబీ ఎల్‌ఎల్‌సీ. నీ అబుదాబీ నుంచి భారత్‌కు సేవలందించడానికీ ఆసక్తి ఉన్నట్లు కంపెనీ తెలిపింది.


ఐపీఓకు బజాజ్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌

దిల్లీ: బజాజ్‌ గ్రూప్‌ నుంచి చాలా ఏళ్ల తర్వాత ఒక సంస్థ పబ్లిక్‌ ఇష్యూకు రానుంది. తొలి పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీఓ) ద్వారా నిధులు సమీకరించేందుకు బజాజ్‌ ఫైనాన్స్‌ అనుబంధ సంస్థ బజాజ్‌ హౌసింగ్‌ ఫైనాన్స్, మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ వద్ద ముసాయిదా పత్రాలు దాఖలు చేసినట్లు సంబంధిత వర్గాల సమాచారం. ఇష్యూలో భాగంగా రూ.4000 కోట్ల విలువైన తాజా షేర్లను, ఆఫర్‌ ఫర్‌ సేల్‌లో ప్రస్తుత వాటాదార్లు మరికొన్ని షేర్లను విక్రయించనున్నారు. ఈ ఐపీఓను కోటక్‌ మహీంద్రా క్యాపిటల్, యాక్సిస్‌ క్యాపిటల్, బోఫా సెక్యూరిటీస్, జేఎం ఫైనాన్షియల్, ఎస్‌బీఐ క్యాపిటల్‌ నిర్వహించనున్నాయి. ప్రస్తుతం ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం.. బజాజ్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ 2025 సెప్టెంబరు లోపు స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో నమోదు కావాల్సి ఉంటుంది.


అంకురాల కోసం ఐఓబీ ప్రత్యేక శాఖ

చెన్నై: ప్రభుత్వ రంగ ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌ (ఐఓబీ) అంకుర సంస్థలు, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల కోసం చెన్నైలో ప్రత్యేకంగా ఒక శాఖను ఏర్పాటు చేసింది. దేశ వ్యాప్తంగా ఇలాంటి మరో 5 శాఖలను ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు తెలిపింది. ‘ఐఓబీ స్టార్టప్‌ కరెంట్‌ ఖాతా’తో పాటు రుణ పథకమైన ‘ఐఓబీ ప్రగతి’ని ఈ శాఖలో ప్రారంభించింది. ‘మన ఆర్థిక వ్యవస్థలో వినూత్నత, ఉద్యోగాల సృష్టికి అంకురాలు మూలస్తంభాలు. ఈ ప్రత్యేక శాఖ ద్వారా, అంకుర సంస్థలు ఎదుర్కొంటున్న ఆర్థిక అవరోధాలను అధిగమించేలా చేస్తామ’ని ఐఓబీ ఎండీ, సీఈఓ అజయ్‌ కుమార్‌ శ్రీవాస్తవ తెలిపారు. అంకురాల వ్యవస్థ వృద్ధి చెందేందుకు తమవంతు మద్దతు ఇస్తామని ఆయన పేర్కొన్నారు.


మేలో శాకాహారం 9% ప్రియం: క్రిసిల్‌  

ముంబయి: గత నెలలో వెజిటేరియన్‌ (శాకాహార) థాలీ సగటు ధర 9% పెరిగిందని నెలవారీ ‘రోటీ రైస్‌ రేట్‌’ నివేదికలో క్రిసిల్‌ తెలిపింది. ఉల్లి, బంగాళాదుంపల ధరలు పెరగడం ఇందుకు కారణమని పేర్కొంది. ఇదే సమయంలో బ్రాయిలర్‌ ధరలు తగ్గడంతో మాంసాహార భోజనం సగటు ధర తగ్గిందని వెల్లడించింది. రోటీ, కూరగాయలు (ఉల్లి, టమోటా, బంగాళాదుంపలు), అన్నం, పప్పు, సలాడ్‌తో కూడిన వెజ్‌ థాలీ ధర, 2023 మేలో రూ.25.5 కాగా, గత నెలలో రూ.27.8కు చేరింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఇది రూ.27.4గా ఉంది. టమోటా ధరలు 39%, బంగాళాదుంపలు 41%, ఉల్లి ధర 43% పెరిగాయి. బియ్యం, పప్పుల ధరలు కూడా వరుసగా 13%, 21% పెరిగాయి. జీలకర్ర, మిరప, వంటనూనె వరుసగా 37%, 25%, 8% చొప్పున తగ్గాయి. నాన్‌-వెజ్‌ థాలీలో పప్పు స్థానంలో చికెన్‌ ఉంటుంది. ఈ థాలీ సగటు ధర 2023 మేలో రూ.59.9 కాగా, గత నెలలో రూ.55.9కు తగ్గింది. 2024 ఏప్రిల్‌లో ఇది రూ.56.3గా ఉంది. బ్రాయిలర్‌ ధరలు 16% తగ్గడం, నాన్‌-వెజ్‌ థాలీలో దీనికి 50% వెయిటేజీ ఉండటమే ధర తగ్గడానికి కారణం.


మనదేశం నుంచి జపాన్‌కు ఏటా 2 లక్షల టన్నుల గ్రీన్‌ అమ్మోనియా!  

ప్లాంటు ఏర్పాటు చేయనున్న సింగపూర్‌ కంపెనీ

సింగపూర్‌: మనదేశంలో గ్రీన్‌ అమ్మోనియా ప్లాంటును ఏర్పాటు చేసి, అక్కడ తయారైన  2 లక్షల టన్నుల అమ్మోనియాను జపాన్‌కు ఎగుమతి చేసేందుకు సింగపూర్‌ సంస్థ ముందుకొచ్చింది. సింగపూర్‌కు చెందిన సెంబ్‌కార్ప్‌ ఇండస్ట్రీస్‌ పూర్తి స్థాయి అనుబంధ కంపెనీ అయిన సెంబ్‌కార్ప్‌ గ్రీన్‌ హైడ్రోజన్, జపాన్‌కు చెందిన కొనుగోలుదార్లు సోజిత్జ్‌ కార్పొరేషన్, క్యుషు ఎలక్ట్రిక్‌ పవర్‌ కో ఇంక్‌తో ఈ మేరకు ఒప్పందం చేసుకుంది. సాధ్యాసాధ్యాల నివేదికకు అనుగుణంగా, భారత్‌లో ఫ్రంట్‌ ఎండ్‌ ఇంజినీరింగ్‌ డిజైన్‌ జరుగుతోందని, భూమిని కొనుగోలు చేసినట్లు సెంబ్‌కార్ప్‌ వెల్లడించింది. ప్రాథమికంగా 2 లక్షల మెట్రిక్‌ టన్నుల వార్షిక సామర్థ్యంతో గ్రీన్‌ అమ్మోనియాను తయారు చేయడానికి పునరుత్పాదక ఇంధనాన్నే ఉపయోగించనున్నట్లు తెలిపింది. గురువారమిక్కడ జరిగిన ఇండో పసిఫిక్‌ ఎకనామిక్‌ ఫ్రేమ్‌వర్క్‌ (ఐపీఈఎఫ్‌) క్లీన్‌ ఎకానమీ ఇన్వెస్టర్‌ ఫోరమ్‌లో జపాన్‌ ఆర్థిక, వాణిజ్య మంత్రి కెన్‌ సైతో, సింగపూర్‌ మంత్రి డాక్టర్‌ టాన్‌ సీ లెంగ్, భారత వాణిజ్య కార్యదర్శి సునీల్‌ బర్తవాల్‌ సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది.


స్థిరాస్తి సాంకేతిక సేవల సంస్థల్లోకి రూ.5,500 కోట్లు

2023-24లో 4% తగ్గాయ్‌
హౌసింగ్‌.కామ్‌ నివేదిక

దిల్లీ: గత ఆర్థిక సంవత్సరంలో స్థిరాస్తి సాంకేతిక సేవల (ప్రోప్‌టెక్‌) సంస్థల్లోకి 657 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ.5,500 కోట్ల) పెట్టుబడులు వచ్చాయి. 2022-23లో వచ్చిన 683 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ.5,700 కోట్ల)తో పోలిస్తే, ఇవి 4% తక్కువ. అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితులు ఉన్నప్పటికీ.. ప్రోప్‌టెక్‌ సంస్థలు ఈ స్థాయిలో నిధులు సమీకరించడం విశేషమేనని హౌసింగ్‌.కామ్‌ తన నివేదికలో వెల్లడించింది. దేశీయంగా ఈ రంగం బలంగా పుంజుకుంటున్న విషయాన్ని ఇది తెలియజేస్తోందని పేర్కొంది. 2010-11 నుంచి 2023-24 ఆర్థిక సంవత్సరాల మధ్య 4.6 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.38,000 కోట్ల) నిధులు ప్రోప్‌టెక్‌ సంస్థల్లోకి వచ్చాయని, 40% సమ్మిళిత వార్షిక వృద్ధి నమోదైందని హౌసింగ్‌.కామ్, ప్రోప్‌టైగర్‌.కామ్‌ గ్రూపు సీఈఓ ధ్రువ్‌ అగర్వాలా తెలిపారు. 2021-22లో రికార్డు స్థాయిలో 840 మిలియన్‌ డాలర్ల పెట్టుబడిని ప్రోప్‌టెక్‌ సంస్థలు సమీకరించాయి. ఈ విలువలో 90 శాతాన్ని 2022-23, 2023-24 ఆర్థిక సంవత్సరాల్లోనూ ఇవి సమీకరించగలిగాయని ఆయన తెలిపారు. 2023-24లో నిధుల సమీకరణ సగటు పరిమాణం 27 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ.225 కోట్లు) అని పేర్కొన్నారు. డిజిటల్‌ స్థిరాస్తి సంస్థలపై వినియోగదారుల విశ్వాసానికి ఇది నిదర్శనమని అన్నారు. ‘గత దశాబ్దకాలంలో ముఖ్యంగా గత మూడేళ్లలో స్థిరాస్తి రంగం వినూత్న సాంకేతికతలను ఉపయోగించుకోవడం గణనీయంగా పెరిగింది. ఈ సానుకూల ధోరణి మున్ముందూ కొనసాగే అవకాశం ఉంది. స్థిరాస్తి విపణి సామర్థ్యం మరింతగా పెరిగేందుకు ఇది ఉపకరిస్తుంద’ని అగర్వాలా వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు