Salary Hike: సీనియర్‌ ఉద్యోగులకు ఈ ఏడాది 20 శాతం వేతన పెంపు: పేజ్‌ గ్రూప్‌ నివేదిక

Salary Hike: కంపెనీలు ఉద్యోగుల నైపుణ్యం, నూతన ఆవిష్కరణలపై దృష్టి సారించాయని ప్రముఖ గ్రూప్‌ ఓ నివేదికలో పేర్కొంది. ఈక్రమంలో ఈ ఏడాది ఉద్యోగుల వేతనాలు గణనీయంగా పెరిగే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది.

Published : 04 Apr 2024 15:31 IST

దిల్లీ: కంపెనీల్లో సీనియర్‌ లెవెల్‌లో ఉన్న ఉద్యోగులకు ఈ ఏడాది సగటున 20 శాతం వరకు వేతన పెంపు (Salary Hike) ఉండొచ్చని ‘మైకేల్‌ పేజ్‌ ఇండియా శాలరీ గైడ్‌ 2024’ నివేదిక వెల్లడించింది. దేశ ఆర్థిక వృద్ధి బలంగా ఉన్న నేపథ్యంలో నైపుణ్యం, నూతన ఆవిష్కరణలపైనే కంపెనీలు ప్రధానంగా దృష్టి సారించాయని పేర్కొంది. సంప్రదాయ పరిశ్రమలలో నియామకాలు పుంజుకుంటున్నాయని.. ముఖ్యంగా తయారీ, ఆపరేషన్స్‌ ఉద్యోగాలకు అధిక గిరాకీ ఉన్నట్లు తెలిపింది.

వివిధ రంగాల్లో డేటా అనలిటిక్స్, జెనరేటివ్ ఏఐ, మెషీన్ లెర్నింగ్‌లో నైపుణ్యం ఉన్నవారి అవసరం గణనీయంగా పెరిగినట్లు నివేదిక వెల్లడించింది. BFSI, ఇంజినీరింగ్ & తయారీ, ఫైనాన్స్ & అకౌంటింగ్, హెల్త్‌కేర్ & లైఫ్ సైన్సెస్, మానవ వనరులు సహా పలు కీలకరంగాలను పరిగణనలోకి తీసుకొని దీన్ని అంచనా వేసింది. దేశీయ పెట్టుబడులు, బహిర్గత అంశాల ప్రభావం లేకపోవడంపైనే దేశం ఆరుశాతం వృద్ధిరేటు ఆధారపడి ఉందని పేర్కొంది.

భారత ఆర్థిక వ్యవస్థకు ఆధారంగా ఉన్న ఐటీ సేవల పరిశ్రమ కొత్తరూపు సంతరించుకుంటోందని పేజ్‌ గ్రూప్‌ ఎండీ అంకిత్ అగర్వాలా వెల్లడించారు. ఈ రంగంలోని కంపెనీలు దాదాపు 8-10 శాతం వరకు వేతనాలను పెంచే (Salary Hike) యోచనలో ఉన్నట్లు తెలిపారు. కన్జ్యూమర్‌, పునరుత్పాదక, ఆర్థిక, ఆరోగ్య సంరక్షణ పరిశ్రమల్లోకి దేశీయ పెట్టుబడులు వెల్లువెత్తుతున్నట్లు చెప్పారు.

ఐటీ అండ్‌ టెక్‌ రంగంలో జూనియర్‌ ఉద్యోగులకు 35-45 శాతం, మధ్యశ్రేణి వారికి 30-40 శాతం, సీనియర్‌ ఉద్యోగులకు 20-30 శాతం వరకు వేతన పెంపు ఉంటుందని నివేదిక తెలిపింది. స్థిరాస్తి, నిర్మాణ రంగంలో ఈ పెంపు (Salary Hike) వరుసగా 20-30 శాతం, 25-45 శాతం, 20-30 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. ఒక్క వేతనం విషయంలోనే కాకుండా పని విధానం, వృద్ధి అవకాశాల్లోనూ కంపెనీలు తమ ఉద్యోగులకు మెరుగైన సదుపాయాలు కల్పించే అవకాశం ఉందని పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని