Stock market: మూడో రోజూ నష్టాలే.. 22,200 దిగువకు నిఫ్టీ

దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 456 పాయింట్లు, నిఫ్టీ 124 పాయింట్లు చొప్పున నష్టపోయాయి.

Published : 16 Apr 2024 16:12 IST

Stock market | ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. వరుసగా మూడోరోజూ నష్టాలను మూటగట్టుకున్నాయి. ‘పశ్చిమాసియా’ భయాలే ఇందుక్కారణం. ఇరాన్‌- ఇజ్రాయెల్‌ మధ్య మళ్లీ ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళనలతో పాటు ఫెడ్‌ వడ్డీ రేట్లపై అనిశ్చితి కొనసాగుతోంది. దీంతో నిన్నటి అమెరికా మార్కెట్లు, నేడు ఆసియా మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. మన మార్కెట్లూ అదే తోవలో నడిచాయి. ముఖ్యంగా ఇన్ఫోసిస్‌, ఐసీఐసీఐ, టీసీఎస్‌, ఎల్‌అండ్‌టీ స్టాక్స్‌లో అమ్మకాలు మన సూచీలను పడేశాయి.

ఉదయం 72,892.14 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమైన సెన్సెక్స్‌.. రోజంతా అదే బాటలో పయనించింది. ఇంట్రాడేలో 72,685.03 - 73,135.43 మధ్య చలించిన సూచీ.. చివరికి 456.10 పాయింట్ల నష్టంతో 72,943.68 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 124.60 పాయింట్ల నష్టంతో 22,147.90 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్‌లో ఇన్ఫోసిస్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, విప్రో, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి. టైటాన్‌, హిందుస్థాన్‌ యూనిలీవర్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, మారుతీ సుజుకీ, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ లాభపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్‌ బ్యారెల్ 89.84 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

  • జియో ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ షేరు ఇవాళ రాణించింది. వెల్త్‌ మేనేజ్‌మెంట్‌, బ్రోకింగ్‌ కంపెనీల ఏర్పాటు నిమిత్తం బ్లాక్‌రాక్‌తో జియో ఫైనాన్షియల్‌ జాయింట్ వెంచర్‌ను ప్రకటించడం ఇందుకు నేపథ్యం. ఓ దశలో 5 శాతం మేర రాణించిన ఈ షేరు.. 2.47 శాతం లాభంతో రూ.362.70 వద్ద ముగిసింది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని