Stock market: మోదీ 3.0 లోడింగ్‌.. సూచీలు ఫుల్‌ స్వింగ్‌..!

Stock market: దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 2,500 పాయింట్లు, నిఫ్టీ 733 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి.

Published : 03 Jun 2024 16:19 IST

Stock market | ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. సోమవారం నాటి ట్రేడింగ్‌లో సరికొత్త రికార్డులను నమోదు చేశాయి. కేంద్రంలో భాజపా నేతృత్వంలోని ఎన్డీయే కూటమి మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోందన్న ఎగ్జిట్ పోల్స్‌ అంచనాలతో దలాల్‌ స్ట్రీట్‌లో బుల్‌ రంకెలేసింది. దీనికి జీడీపీ గణాంకాలు, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు తోడవ్వడం మరింత బూస్ట్‌ ఇచ్చింది. దీంతో ఆరంభం నుంచి మార్కెట్లు ముగిసేవరకు అదే దూకుడు కొనసాగింది. సూచీల లాభాల పరుగుకు రికార్డులు బద్ధలయ్యాయి. మునుపెన్నడూ చూడని సరికొత్త గరిష్ఠాలను సూచీలు నమోదు చేశాయి. సెన్సెక్స్‌ తొలిసారి 76,400 మార్కును అందుకోగా.. నిఫ్టీ సైతం 23,200 ఎగువన ముగిసింది. మదుపరుల సంపదగా భావించే బీఎస్‌ఈలో నమోదిత కంపెనీల మొత్తం విలువ రూ.12.50 లక్షల కోట్ల మేర పెరిగింది.

సెన్సెక్స్ ఉదయం 76,583.29 పాయింట్ల వద్ద భారీ లాభాల్లో ప్రారంభమైంది. ఆరంభంలోనే దాదాపు 2,700 పాయింట్లు లాభంతో ప్రారంభమవడంతో ఈ ఉత్సాహం కాసేపే అనుకున్నారు. కానీ ఎక్కడా తగ్గేదేలా అన్నట్లుగా దూకుడు సాగింది. ఇంట్రాడేలో 76738.89 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరికి 2,507 పాయింట్ల లాభంతో 76,468.78 వద్ద ముగిసింది. నిఫ్టీ 733.20 పాయింట్ల లాభంతో 24,263.90 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.14గా ఉంది.

సెన్సెక్స్‌లో హెచ్‌సీఎల్‌ టెక్‌, సన్‌ఫార్మా, ఏషియన్‌ పెయింట్స్, నెస్లే ఇండియా, ఇన్ఫోసిస్‌ షేర్లు మినహా అన్ని షేర్లూ లాభాల్లో ముగిశాయి. ముఖ్యంగా ఎన్టీపీసీ, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌, ఎల్‌ అండ్‌టీ, యాక్సిస్‌ బ్యాంక్‌ భారీ లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 80.71 డాలర్ల వద్ద కొనసాగుతుండగా.. బంగారం ఔన్సు ధర 2,349 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

  • భారీ లాభాల్లో అదానీ స్టాక్స్‌: సోమవారం నాటి ట్రేడింగ్‌లో అదానీ గ్రూప్‌ స్టాక్స్‌ పరుగులు తీశాయి. ఆ గ్రూప్‌నకు చెందిన 10 లిస్టెడ్‌ కంపెనీలూ లాభాల్లో ముగిశాయి. అదానీ పవర్‌ అత్యధికంగా 16 శాతం మేర లాభపడింది. అదానీ పోర్ట్స్‌ అండ్‌ సెజ్‌ 10.61, అదానీ ఎనర్జీ సొల్యూషనస్‌ 9.15 శాతం చొప్పున లాభపడ్డాయి. మిగిలిన స్టాక్స్‌ కూడా 3-8 శాతం మధ్య లాభపడ్డాయి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని