మదుపర్ల సంపద రూ.410 లక్షల కోట్లకు

వరుసగా రెండో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ లాభపడ్డాయి. ఎం అండ్‌ ఎం, రిలయన్స్‌ ఇండస్ట్రీస్, ఐటీసీ షేర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. అయితే విదేశీ మదుపర్ల అమ్మకాలు కొనసాగడంతో లాభాలు పరిమితమయ్యాయి.

Published : 18 May 2024 01:17 IST

సమీక్ష

రుసగా రెండో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ లాభపడ్డాయి. ఎం అండ్‌ ఎం, రిలయన్స్‌ ఇండస్ట్రీస్, ఐటీసీ షేర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. అయితే విదేశీ మదుపర్ల అమ్మకాలు కొనసాగడంతో లాభాలు పరిమితమయ్యాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 13 పైసలు బలపడి  83.37 వద్ద ముగిసింది. బ్యారెల్‌ ముడిచమురు  0.25% పెరిగి 83.48 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మదుపర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలోని నమోదిత సంస్థల మొత్తం మార్కెట్‌ విలువ రూ.3 లక్షల కోట్లు పెరిగి, రికార్డు గరిష్ఠమైన రూ. 410.24 లక్షల కోట్లకు పెరిగింది.

సెన్సెక్స్‌ ఉదయం 73,711.31 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. ఆరంభంలో తడబడిన సూచీ, 73,459.80 వద్ద కనిష్ఠానికి చేరింది. అనంతరం పుంజుకుని ఇంట్రాడేలో 74,070.84 వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరకు 253.31 పాయింట్ల లాభంతో 73,917.03 వద్ద ముగిసింది. నిఫ్టీ 62.25 పాయింట్లు పెరిగి 22,466.10 దగ్గర స్థిరపడింది. 

  • ఆకర్షణీయ త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో ఎం అండ్‌ ఎం షేరు 8% లాభపడి రూ.2,557.95 వద్ద 52 వారాల గరిష్ఠాన్ని తాకింది. చివరకు 5.97% లాభంతో రూ.2,514.95 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్‌ విలువ రూ.3.12 లక్షల కోట్లుగా నమోదైంది.
  • సెన్సెక్స్‌ 30 షేర్లలో 16 రాణించాయి. ఎం అండ్‌ ఎం 5.97%, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ 2.36%, అల్ట్రాటెక్‌ 1.89%, కోటక్‌ బ్యాంక్‌ 1.50%, ఐటీసీ 1.24%, మారుతీ 1.19%, ఎన్‌టీపీసీ 1.11%, టాటా మోటార్స్‌ 1%, టాటా స్టీల్‌ 0.81%, రిలయన్స్‌ 0.72% లాభపడ్డాయి. టీసీఎస్, హెచ్‌సీఎల్‌ టెక్, హెచ్‌యూఎల్, నెస్లే, బజాజ్‌ ఫిన్‌సర్వ్, విప్రో  1.70% వరకు నష్టపోయాయి. 
  • నేడు ప్రత్యేక ట్రేడింగ్‌ సెషన్‌: విపత్తులు సంభవించినప్పుడు, నిర్వహణ సన్నద్ధతను పరీక్షించేందుకు ఈనెల 18న (శనివారం) ప్రత్యేక ట్రేడింగ్‌ సెషన్‌ను స్టాక్‌ ఎక్స్ఛేంజీలు నిర్వహించనున్నాయి. మొదటి సెషన్‌ ఉదయం 9.15 గంటలకు ప్రారంభమై 10.15 గంటలకు ముగియనుంది. రెండో సెషన్‌ 11.45 గంటలకు ప్రారంభమై 12.30 గంటలకు ముగుస్తుంది. ఈ సమయంలో అన్ని సెక్యూరిటీస్, డెరివేటివ్‌ ఉత్పత్తుల ట్రేడింగ్‌ చేసుకోవచ్చు. గరిష్ఠ పరిమితిని 5 శాతంగా నిర్ణయించారు.
  • ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ పూర్తి స్థాయి డైరెక్టర్‌గా ప్రదీప్‌ నటరాజన్‌ నియామకానికి రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) ఆమోదం తెలిపింది.
  • గ్లకోమా చికిత్సలో వినియోగించే జనరిక్‌ ఔషధానికి అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ యూఎస్‌ఎఫ్‌డీఏ తుది అనుమతి లభించినట్లు గ్లెన్‌మార్క్‌ ఫార్మా తెలిపింది.
  • స్పైస్‌జెట్‌కు ఊరట: చౌకధరల విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌కు సుప్రీంకోర్టులో ఉపశమనం లభించింది. కళానిధి మారన్‌కు మధ్యవర్తిత్వ పరిహారంగా రూ.579 కోట్లతో పాటు వడ్డీ కూడా చెల్లించాలంటూ సింగిల్‌ జడ్జి బెంచ్‌ ఇచ్చిన ఆదేశాలను దిల్లీ హైకోర్టు శుక్రవారం పక్కన పెట్టింది. మధ్యవర్తిత్వ పరిహారాన్ని నిలిపి వేసేందుకు 2023 జులై 31న సింగిల్‌ జడ్జి బెంచ్‌ నిరాకరించింది. దీనిపై దిల్లీ హైకోర్టులో స్పైస్‌జెట్‌తో పాటు సంస్థ అధిపతి అజయ్‌ సింగ్‌ అప్పీలు చేశారు.
  • గో డిజిట్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ ఐపీఓ చివరి రోజు ముగిసేసరికి 9.6 రెట్ల స్పందన లభించింది. ఇష్యూలో భాగంగా 5,28,69,677 షేర్లను ఆఫర్‌ చేయగా, 50,76,21,455 షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. క్యూఐబీ విభాగంలో 12.56 రెట్లు, రిటైల్‌ విభాగంలో 4.27 రెట్లు, ఎన్‌ఐఐల నుంచి 7.24 రెట్లు స్పందన లభించింది.
  • ఎంపిక చేసిన నగరాల్లో 6 నెలల్లోగా 5జీ సేవలను ప్రారంభించేందుకు వొడాఫోన్‌ ఐడియా సన్నాహాలు చేస్తోంది. 4జీ కవరేజీ పెంచేందుకు వచ్చే మూడేళ్లలో రూ.50000- 55000 కోట్ల పెట్టుబడులు పెట్టాలని భావిస్తున్నట్లు కంపెనీ సీఈఓ అక్షయ మూంద్రా పేర్కొన్నారు. 

644 బి.డాలర్లకు ఫారెక్స్‌ నిల్వలు

 మే 10తో ముగిసిన వారానికి మన విదేశీ మారకపు (ఫారెక్స్‌) నిల్వలు 2.56 బి.డాలర్లు (దాదాపు రూ.21,300 కోట్లు) పెరిగి 644.151 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.53.46 లక్షల కోట్ల)కు చేరాయని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) పేర్కొంది. అంతక్రితం వారం ఫారెక్స్‌ నిల్వలు 641.59 బి.డాలర్లుగా ఉన్నాయి. సమీక్షిస్తున్న వారంలో విదేశీ కరెన్సీ ఆస్తులు 1.488 బి.డాలర్లు పెరిగి 565.648 బి.డాలర్లుగా నమోదయ్యాయి. పసిడి నిల్వలు 1.072 బి.డాలర్లు అధికమై 55.952 బిలియన్‌ డాలర్లకు చేరాయి. దేశ ప్రత్యేక ఉపసంహరణ హక్కులు (ఎస్‌డీఆర్‌లు) 5 మిలియన్‌ డాలర్లు పెరిగి 18.056 బిలియన్‌ డాలర్లకు చేరగా, ఐఎంఎఫ్‌ వద్ద దేశ నిల్వల స్థానం 4 మిలియన్‌ డాలర్లు తగ్గి 4.495 బిలియన్‌ డాలర్లుగా నమోదైనట్లు ఆర్‌బీఐ గణాంకాలు వెల్లడించాయి.


సోమవారం మార్కెట్లకు సెలవు

ముంబయిలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ కారణంగా సోమవారం బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలకు సెలవు ప్రకటించారు. బులియన్, ఫారెక్స్‌ మార్కెట్లు కూడా పని చేయవు. కమొడిటీ మార్కెట్లు సాయంత్రం 5 గంటల నుంచి పనిచేయనున్నాయి.

నేటి బోర్డు సమావేశాలు: దొడ్ల డెయిరీ, కృష్ణ డయాగ్నోస్టిక్స్, మధుకాన్, ట్రైడెంట్, ఉజ్జీవన్‌ స్మాల్‌ బ్యాంక్, విమ్టా ల్యాబ్స్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు