Stock market: భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్‌ 655, నిఫ్టీ 203

Stock market: దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 655 పాయింట్లు, నిఫ్టీ 203 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి.

Published : 28 Mar 2024 16:02 IST

Stock market | ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు (Stock market) భారీ లాభాల్లో ముగిశాయి. వరుసగా రెండో రోజూ సూచీలు రాణించాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు.. ఐటీ, బ్యాంకింగ్‌ రంగ షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో సూచీలు దూసుకెళ్లాయి. ఓ దశలో సరికొత్త రికార్డులను తిరగరాస్తాయనుకున్న సూచీలు.. ఆఖర్లో అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 1100 పాయింట్ల లాభాల్లోకి వెళ్లినప్పటికీ.. తర్వాత 655 పాయింట్లతో సరిపెట్టుకుంది.

సెన్సెక్స్‌ ఉదయం 73,149.34 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. రోజంతా అదే ఒరవడి కొనసాగింది. ఓ దశలో 74,190 పాయింట్లకు చేరుకున్న సెన్సెక్స్‌.. చివరికి 655 పాయింట్ల లాభంతో 73,651.35 వద్ద ముగిసింది. నిఫ్టీ 203.25 పాయింట్ల లాభంతో 22,326.90 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.40గా ఉంది. సెన్సెక్స్‌ 30 సూచీలో బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, మహీంద్రా అండ్‌ మహీంద్రా, పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ షేర్లు ప్రధానంగా రాణించాయి. టెక్ మహీంద్రా, రిలయన్స్‌, టెక్‌ మహీంద్రా, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీ, ఐటీసీ షేర్లు స్వల్ప నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 86.70 డాలర్లు, బంగారం ఔన్సు 2,218 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి.

లాభాల పరుగుకు కారణమిదే..

  • నిన్నటి అమెరికా మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. డౌజోన్స్‌ 1.22 శాతం, ఎస్‌అండ్‌పీ 500.. 0.86 శాతం, నాస్‌డాక్‌ 0.51 శాతం చొప్పున లాభపడ్డాయి. ఇవాళ ఆసియా-పసిఫిక్‌ మార్కెట్లలో సానుకూలత కనిపించింది. హాంకాంగ్‌, ఆస్ట్రేలియా మార్కెట్లు భారీ లాభాల్లో ముగియడంతో మన మార్కెట్లలోనూ అదే ఉత్సాహం కనిపించింది. యూరోపియన్‌ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి.
  • విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లూ సూచీలకు కలిసొచ్చాయి. బుధవారం రూ.2,170 కోట్ల విలువైన షేర్లను వీరు కొనుగోలు చేసినట్లు డేటా చెబుతోంది. దేశీయ మదుపరులు రూ.1198 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశారు. గడిచిన రెండు నెలలుగా అమ్మకాలు చేపట్టిన విదేశీ మదుపరులు.. మార్చిలో కొనుగోళ్లకు ముందుకు రావడం గమనార్హం. దేశీయంగా స్థూల ఆర్థిక పరిస్థితులు, ద్రవ్యోల్బణం అదుపులోకి రావడం, ఈక్విటీ మార్కెట్లు రాణిస్తుండడం వంటివి విదేశీ మదుపరులను ఆకర్షిస్తున్నాయి.
  • బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌ స్టాక్స్‌లో కొనుగోళ్లూ సూచీల పరుగుకు కారణమయ్యాయి. ఆల్టర్‌నేటివ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టిన బ్యాంకులు/ ఆర్థిక సంస్థలు అధిక మొత్తంలో ప్రొవిజన్లు పక్కన పెట్టాలని డిసెంబర్‌లో ఆర్‌బీఐ నిబంధనలు తీసుకొచ్చింది. తాజాగా ఆ నిబంధనలను సడలించడంతో పాజిటివ్‌ సెంటిమెంట్‌కు కారణమైంది. బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, బజాజ్‌ ఫైనాన్స్‌ షేర్లు రాణించాయి. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 2 శాతం మేర లాభపడింది.

కోటక్‌ చేతికి సొనాటా ఫైనాన్స్‌: ప్రముఖ ప్రైవేటు రంగ బ్యాంక్‌ కోటక్‌ మహీంద్రా ఎన్‌బీఎఫ్‌సీ కంపెనీ సొనాటా ఫైనాన్స్‌ను కొనుగోలు చేసింది. రూ.537 కోట్లకు కొనుగోలు చేసినట్లు కోటక్‌ బ్యాంక్‌ తన రెగ్యులేటరీలో పేర్కొంది. సొనాటాకు 10 రాష్ట్రాల్లో 549 బ్రాంచిలు ఉన్నాయి. ఈ కొనుగోలుతో సొనాటా పూర్తిగా కోటక్‌ మహీంద్రా అనుబంధ సంస్థగా కొనసాగనుంది.

మార్కెట్లకు రేపు సెలవు: గుడ్‌ఫ్రైడే కారణంగా రేపు మార్కెట్లకు సెలవు. సోమవారం హోలీ సందర్భంగా మార్కెట్లు పనిచేయలేదు. దీంతో ఈ వారం మూడు రోజులే ట్రేడింగ్‌ జరిగింది. ఈ ఆర్థిక సంవత్సరానికి ఇవాళే చివరి ట్రేడింగ్‌ సెషన్‌ కావడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని