Stock market: మూడో రోజూ లాభాల జోరు.. సెన్సెక్స్‌ 1600 పాయింట్లు జంప్‌

Stock market: దేశీయ స్టాక్‌ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 1618 పాయింట్లు, నిఫ్టీ 468 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి.

Published : 07 Jun 2024 16:09 IST

Stock market | ముంబయి: ఎన్నికల ఫలితాల రోజు నాటి భారీ నష్టాల నుంచి స్టాక్‌ మార్కెట్‌ సూచీలు కోలుకున్నాయి. మూడోసారి ప్రధాని మోదీ అధికార పగ్గాలు చేపడుతుండడం, మరోవైపు ద్రవ్యోల్బణం కట్టడికి ఆర్‌బీఐ మరోసారి యథాతథ వైఖరి అనుసరించడంతో సూచీలు వరుసగా మూడో రోజూ దూసుకెళ్లాయి. ప్రధానంగా రిలయన్స్‌, ఇన్ఫోసిస్‌, మహీంద్రా అండ్ మహీంద్రా, భారతీ ఎయిర్‌టెల్‌ వంటి షేర్లలో కొనుగోళ్ల మద్దతు సూచీలకు కలిసొచ్చింది. ఈ క్రమంలో సెన్సెక్స్‌ సరికొత్త గరిష్ఠాలను నమోదు చేసింది. నిఫ్టీ 23వేల ఎగువన ముగిసింది.

సెన్సెక్స్‌ 75,031.79 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. ఆద్యంతం అదే ఒరవడి కొనసాగింది. ఇంట్రాడేలో 76,795.31 పాయింట్ల వద్ద జీవనకాల గరిష్ఠాలను సూచీ నమోదు చేసింది. చివరికి 1618.85 పాయింట్ల లాభంతో 76,693.36 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 468.75 పాయింట్ల లాభంతో 23,290.15 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 
83.38గా ఉంది. 

సెన్సెక్స్‌లోని 30 కంపెనీలూ లాభాల్లో ముగిశాయి. మహీంద్రా అండ్‌ మహీంద్రా, విప్రో, టెక్‌ మహీంద్రా, ఇన్ఫోసిస్‌, టాటా స్టీల్‌ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ 79.92 డాలర్లు, బంగారం ఔన్సు 2,355 డాలర్ల వద్ద ట్రేడవుతువుతున్నాయి. హెరిటేజ్‌ ఫుడ్స్‌ షేర్లు శుక్రవారం మరో 10 శాతం లాభపడి 661.25 వద్ద, అమరరాజా బ్యాటరీస్‌ 9.75 శాతం పెరిగి 1402 వద్ద ముగిశాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని