Stock market: ‘ఫెడ్‌’ జోష్‌.. 500 పైగా పాయింట్ల లాభంలో సెన్సెక్స్‌

Stock market: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 539 పాయింట్లు, నిఫ్టీ 175 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి.

Published : 21 Mar 2024 16:03 IST

Stock market | ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో సూచీలు రాణించాయి. కీలక వడ్డీ రేట్లను స్థిరంగా కొనసాగిస్తూనే.. ఈ ఏడాదిలోనే మూడుసార్లు వడ్డీ రేట్ల తగ్గింపు ఉంటుందని ఫెడ్‌ చీఫ్‌ సంకేతాలు ఇవ్వడం సెంటిమెంట్‌ను బలపరిచింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లతో పాటు మన మార్కెట్లూ రాణించాయి. సెన్సెక్స్‌ 500 పాయింట్లకు పైగా లాభపడగా.. నిఫ్టీ 22వేల పాయింట్ల ఎగువన ముగిసింది.

సెన్సెక్స్‌ ఉదయం 72,507.36 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమై ఆద్యంతం లాభాల్లోనే కొనసాగింది. ఇంట్రాడేలో 72,416.03 - 72,882.46 చలించిన సూచీ, చివరికి 539.50 పాయింట్ల లాభంతో 72,641.19 వద్ద ముగిసింది. నిఫ్టీ 175.70 పాయింట్ల లాభంతో 22,014.80 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.15గా ఉంది. సెన్సెక్స్‌ 30 సూచీలో భారతీ ఎయిర్‌టెల్, మారుతీ సుజుకీ, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఏషియన్‌ పెయింట్స్‌ షేర్లు మినహా అన్ని షేర్లూ లాభాల్లో ముగిశాయి. ఎన్టీపీసీ, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, టాటా స్టీల్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, టాటా మోటార్స్‌ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 85.73 డాలర్ల ఎగువన ట్రేడవుతుండగా.. బంగారం గరిష్ఠ స్థాయికి చేరింది. ఔన్సు ధర 2,207 డాలర్ల ఎగువన కొనసాగుతోంది.

ఫెడ్‌ ఏం చెప్పింది..?

అమెరికా కేంద్ర బ్యాంకు తన ప్రామాణిక వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పూ చేయలేదు. 23 ఏళ్ల గరిష్ఠ స్థాయి అయిన 5.25-5.50 శాతంగానే కొనసాగించింది. అయితే, ప్రతికూల పరిస్థితులేవీ లేకపోతే జూన్‌ నుంచి వడ్డీ రేట్లలో కోత ఉంటుందని ఫెడ్‌ చీఫ్‌ సంకేతం ఇచ్చారు. దీంతో ఈ ఏడాది మూడుసార్లు వడ్డీ రేట్లలో కోత ఉండొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో నిన్నటి అమెరికా మార్కెట్లు లాభపడ్డాయి. నేడు ఒక్క షాంఘై మినహా అన్ని ఆసియా మార్కెట్లూ లాభాల్లోనే ముగిశాయి. యూరోపియన్‌ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని