Stock Market: స్టాక్‌ మార్కెట్లలో జీడీపీ జోరు.. ఆల్‌టైం గరిష్ఠాలకు సూచీలు

Stock Market: మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో సెన్సెక్స్ 1,021 పాయింట్లు పెరిగి 73,521 వద్ద, నిఫ్టీ 301 పాయింట్లు ఎగబాకి 22,284 దగ్గర కొనసాగుతున్నాయి.

Updated : 01 Mar 2024 12:53 IST

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్ (Stock Market) సూచీలు శుక్రవారం ట్రేడింగ్‌లో దూసుకెళ్తున్నాయి. ఇంట్రాడేలో రెండు ప్రధాన సూచీలు జీవనకాల గరిష్ఠాలను తాకాయి. సెన్సెక్స్‌ 1,000 పాయింట్లకు పైగా పెరిగి 73,574.02 వద్ద, నిఫ్టీ 300 పాయింట్లు పుంజుకొని 22,304 దగ్గర ఆల్‌టైం రికార్డును నమోదు చేశాయి. దేశీయంగా ఆర్థిక వ్యవస్థలో ఉన్న సానుకూల వాతావరణంతో పాటు కీలక షేర్లు రాణించడం సూచీలకు దన్నుగా నిలుస్తోంది. మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో సెన్సెక్స్ 1,021 పాయింట్లు పెరిగి 73,521 వద్ద, నిఫ్టీ 301 పాయింట్లు ఎగబాకి 22,284 దగ్గర కొనసాగుతున్నాయి.

సెన్సెక్స్‌-30 సూచీలో హెచ్‌సీఎల్‌ టెక్‌, ఇన్ఫోసిస్‌, సన్‌ఫార్మా, విప్రో షేర్లు మాత్రమే నష్టాల్లో ఉన్నాయి. టాటా స్టీల్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఎల్‌ అండ్‌ టీ, టైటన్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, టాటా మోటార్స్‌, మారుతీ, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, పవర్‌గ్రిడ్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ షేర్లు అత్యధికంగా లాభపడుతున్న జాబితాలో ఉన్నాయి.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబరు-డిసెంబరు త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ అంచనాలకు మించి రాణించింది. వ్యవసాయ రంగం నెమ్మదించినా, తయారీ రంగంలో రెండంకెల వృద్ధి నమోదవ్వడం, గనుల తవ్వకం, నిర్మాణ రంగాలు మెరుగైన పనితీరును ప్రదర్శించడంతో మూడో త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) 8.4% వృద్ధి చెందింది. మరోవైపు 2023-24 మొత్తం మీద వృద్ధి రేటు 7.3 శాతంగా నమోదు కావొచ్చని ఎన్‌ఎస్‌ఓ అంచనా వేసింది. ఈ గణాంకాలు సూచీల్లో ఉత్సాహం నింపాయి.

మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాలూ దేశీయ సూచీలకు అండగా నిలుస్తున్నాయి. త్వరలో అమెరికాలో వడ్డీరేట్ల కోతపై ఫెడరల్‌ రిజర్వ్‌ స్పష్టతనిచ్చే అవకాశం ఉందనే ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. అలాగే ద్రవ్యోల్బణం సైతం దిగొచ్చే సూచనలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం అక్కడి మార్కెట్లు రాణించాయి. నేడు ఆసియా- పసిఫిక్‌ సూచీలు పాజిటివ్‌గా ట్రేడవుతున్నాయి. జపాన్‌, ఆస్ట్రేలియా మార్కెట్లు రికార్డు గరిష్ఠాలకు చేరాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని