Stock Maket today: సెన్సెక్స్‌ 77,000 తాకి, వెనక్కి

చరిత్రలోనే తొలిసారి 77,000 పాయింట్ల శిఖరాన్ని అధిరోహించిన సెన్సెక్స్, ఆ లాభాలను నిలబెట్టుకోవడంలో విఫలమైంది. ఐటీ కంపెనీలతో పాటు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేరుకు అమ్మకాలు వెల్లువెత్తడంతో సూచీలు నష్టాల్లో ముగిశాయి.

Published : 11 Jun 2024 01:59 IST

గరిష్ఠాల్లో మదుపర్ల లాభాల స్వీకరణ

చరిత్రలోనే తొలిసారి 77,000 పాయింట్ల శిఖరాన్ని అధిరోహించిన సెన్సెక్స్, ఆ లాభాలను నిలబెట్టుకోవడంలో విఫలమైంది. ఐటీ కంపెనీలతో పాటు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేరుకు అమ్మకాలు వెల్లువెత్తడంతో సూచీలు నష్టాల్లో ముగిశాయి. బలహీన అంతర్జాతీయ సంకేతాలు ఇందుకు తోడయ్యాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 10 పైసలు తగ్గి 83.50 వద్ద ముగిసింది. బ్యారెల్‌ ముడిచమురు 79.76 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఆసియా మార్కెట్లలో టోక్యో లాభపడగా, సియోల్‌ నష్టపోయింది. ఐరోపా సూచీలు నష్టాల్లో ట్రేడయ్యాయి.

సెన్సెక్స్‌ ఉదయం 76,935.41 పాయింట్ల వద్ద దూకుడుగా ప్రారంభమైంది. అదే జోరులో 77,079.04 వద్ద జీవనకాల గరిష్ఠాన్ని నమోదుచేసింది. గరిష్ఠాల్లో లాభాల స్వీకరణతో నష్టాల్లోకి జారుకున్న సూచీ, ఒకదశలో 76,379.73 పాయింట్లకు పడిపోయింది. చివరకు 203.28 పాయింట్ల నష్టంతో 76,490.08 వద్ద ముగిసింది. నిఫ్టీ 30.95 పాయింట్లు తగ్గి 23,259.20 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో 23,227.15- 23,411.90 పాయింట్ల మధ్య కదలాడింది.

  •  సెన్సెక్స్‌ 30 షేర్లలో 15 నష్టపోయాయి. టెక్‌ మహీంద్రా 2.72%, ఇన్ఫోసిస్‌ 2.20%, విప్రో 1.95%, ఎం అండ్‌ ఎం 1.73%, బజాజ్‌ ఫైనాన్స్‌ 1.42%, టీసీఎస్‌ 0.94%, హెచ్‌సీఎల్‌ టెక్‌ 0.88% డీలాపడ్డాయి. అల్ట్రాటెక్‌ 3.52%, పవర్‌గ్రిడ్‌ 2.07%, నెస్లే 1.74%, యాక్సిస్‌ బ్యాంక్‌ 1.16%, ఎన్‌టీపీసీ 1.07%, టాటా స్టీల్‌ 0.70% లాభపడ్డాయి. రంగాల వారీ సూచీల్లో సేవలు 1.61%, స్థిరాస్తి 1.34%, కమొడిటీస్‌ 1.28%, యుటిలిటీస్‌ 1.11%, ఆరోగ్య సంరక్షణ    0.77%, పరిశ్రమలు 0.49% నీరసపడ్డాయి. ఐటీ, వాహన, లోహ, టెక్‌ మెప్పించాయి. బీఎస్‌ఈలో 1416 షేర్లు నష్టాల్లో ముగియగా, 2590 స్క్రిప్‌లు లాభపడ్డాయి. 123 షేర్లలో ఎటువంటి మార్పు లేదు.
  •  క్రోనాక్స్‌ ల్యాబ్‌ సైన్సెస్‌ షేరు అరంగేట్రంలో రాణించింది. ఇష్యూ ధర రూ.136తో పోలిస్తే బీఎస్‌ఈలో షేరు ట్రేడింగ్‌ 21.32% లాభంతో రూ.165 వద్ద ప్రారంభమైంది. అదే గరిష్ఠస్థాయి కూడా. చివరకు 17.17% లాభంతో రూ.159.35 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్‌ విలువ రూ.591.25 కోట్లుగా నమోదైంది.
  •  సంస్థలకు కృత్రిమే మేధ (ఏఐ) సేవలను సులభతరం చేసేందుకు ‘ఎంటర్‌ప్రైజ్‌ ఏఐ ఫౌండ్రీ’ని తీసుకొచ్చినట్లు హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ వెల్లడించింది. 
  •  బహిరంగ మార్కెట్‌ లావాదేవీల ద్వారా ఎంఫసిస్‌లో 15.08% వాటాను రూ.6,735 కోట్లకు ప్రమోటర్‌ సంస్థ బ్లాక్‌స్టోన్‌ విక్రయించింది. బ్లాక్‌స్టోన్‌కు చెందిన బీసీపీ టాప్కో ఈ షేర్లను ఎన్‌ఎస్‌ఈలో విక్రయించింది. ఈ లావాదేవీ తర్వాత కంపెనీలో బీసీపీ టాప్కో వాటా 55.45% నుంచి 40.37 శాతానికి పరిమితమైంది. ఈ వార్తలతో షేరు 3% నష్టపోయి రూ.2,398 వద్ద ముగిసింది. 
  •  రుణదాతలకు బకాయిలు పూర్తిగా చెల్లించడంతో, స్టాండలోన్‌ ప్రాతిపదికన రుణ రహిత సంస్థగా రిలయన్స్‌ పవర్‌ మారిందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. కంపెనీకి దాదాపు రూ.800 కోట్ల అప్పులు ఉండగా, బ్యాంకులకు తిరిగి చెల్లించినట్లు సమాచారం. 
  •  ఇక్సిగో ఐపీఓ మొదటి రోజు 1.95 రెట్ల స్పందన లభించింది. ఇష్యూలో భాగంగా 4,37,69,494 షేర్లను ఆఫర్‌ చేయగా, 8,51,54,349 షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. రిటైల్‌ విభాగంలో 6.17 రెట్ల స్పందన కనిపించింది.

రూ.425.22 లక్షల కోట్లకు మదుపర్ల సంపద

మార్కెట్లు నష్టపోయినప్పటికీ.. మదుపర్ల సంపదగా భావించే బీఎస్‌ఈలోని నమోదిత సంస్థల మొత్తం మార్కెట్‌ విలువ సోమవారం రూ.1.73 లక్షల కోట్లు పెరిగి, జీవనకాల గరిష్ఠమైన రూ.425.22 లక్షల కోట్లకు చేరింది.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని