stock market: హమ్మయ్యా.. మార్కెట్‌ కోలుకుంది..!

వరుస నష్టాల నుంచి మార్కెట్‌ సూచీలు కోలుకొన్నాయి. నేడు సెన్సెక్స్‌ 169 పాయింట్ల లాభంలో ట్రేడింగ్‌ను ముగించింది. 

Published : 30 Jan 2023 16:11 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశీయ స్టాక్‌ మార్కెట్లు(stock market) కోలుకొని మెల్లగా లాభాల బాటపట్టాయి. గత వారం రెండు సెషన్లలో ఏకంగా రూ.10 లక్షల కోట్లు నష్టపోయిన మదుపర్లకు నేటి ట్రేడింగ్‌ కొంత ఊరటనిచ్చింది.  సోమవారం ట్రేడింగ్‌లో మధ్యాహ్నం వరకు కొంత నష్టాల్లో ఉన్నా.. ఆ తర్వాత మెల్లగా లాభాల బాటపట్టాయి. అదానీ గ్రూప్‌లోని పలు కంపెనీల షేర్లు  నేడు కూడా భారీగా విలువ కోల్పోయాయి. మార్కెట్‌ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 169 పాయింట్ల లాభంతో 59,500 వద్ద, నిఫ్టీ 44 పాయింట్లు కోల్పోయి 17,648 వద్ద స్థిరపడ్డాయి. నేడు సెన్సెక్స్‌ ఒక దశలో అత్యధికంగా 550 పాయింట్లు కోల్పోగా.. చివరికి 169 పాయింట్ల లాభంతో స్థిరపడింది. అంటే మొత్తం 801 పాయింట్ల మేరకు ఊగిసలాట ధోరణి కనిపించింది. మధ్యాహ్నం 2.02 సమయంలో నిఫ్టీ 17,450 వద్దకు చేరింది. ఆ సమయంలో మదుపర్ల సంపద దాదాపు రూ.3.83 లక్షల కోట్ల మేరకు ఆవిరైపోయింది. కానీ, ఆ తర్వాత సూచీలు లాభాలబాట పట్టాయి.

నేటి ఇంట్రాడే ట్రేడింగ్‌లో రిలయన్స్‌ షేరు ఏకంగా 1.2శాతం పుంజుకొంది. ఇది మార్కెట్‌ కోలుకోవడానికి సాయపడింది. ఐటీ కంపెనీల షేర్లు కూడా లాభాల్లోనే ట్రేడింగ్ ముగించాయి. టెక్‌ మహీంద్రా 0.8శాతం, హెచ్‌సీఎల్‌ టెక్‌ 2శాతం లాభపడ్డాయి. వొడాఫోన్‌ షేరు 6శాతం పెరిగింది. బీఎస్‌ఈలో డేటా పాట్రన్స్‌, ఏజీఐ గ్రీన్‌పాక్‌, ఇండస్‌ టవర్స్‌, ఇంటెలెక్ట్‌ డిజైన్‌ షేర్ల విలువ అత్యధికంగా పెరగ్గా.. అదానీ టోటల్‌ గ్యాస్‌, అదానీ గ్రీన్‌ ఎనర్జీ , అదానీ ట్రాన్స్‌మిషన్‌, సియారామ్‌ సిల్క్స్‌, ఈఐడీ పార్రీ సంస్థలు భారీగా నష్టపోయాయి.

అదానీ గ్రూప్‌ విలువ రూ.6 లక్షల కోట్లు ఆవిరి..

అదానీ ఎనర్జీ, అదానీ టోల్‌ గ్యాస్‌ 20శాతం విలువ కోల్పోయాయి. ఇక అదానీ ట్రాన్స్‌మెషీన్స్‌ 15శాతం నష్టపోయింది. అదానీ విల్మర్‌, అదానీ పవర్‌ షేర్ల విలువ ఐదు శాతం మేర కుంగింది. గత మూడు ట్రేడింగ్‌ సెషన్లలో ఈ గ్రూప్‌ మార్కెట్‌ విలువ రూ.6 లక్షల కోట్ల మేరకు నష్టపోయింది. 

అమెరికాకు చెందిన షార్ట్‌ సెల్లర్‌ హిండెన్‌బర్గ్‌ ఆరోపణలను అదానీ గ్రూప్‌ తీవ్రంగా ఖండించింది. భారత్‌ సాధిస్తున్న వృద్ధిపై అక్కసుతోనే ఇలా అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడింది. దీనికి హిండెన్‌బర్గ్‌ కూడా ఘాటుగానే స్పందించింది. ‘‘కీలకమైన విషయాల నుంచి దృష్టి మరల్చడానికి ప్రయత్నిస్తోన్న అదానీ గ్రూప్‌.. జాతీయవాద అంశాన్ని లేవనెత్తుతోంది. భారత్‌పై దాడి చేసేందుకే మా నివేదిక అన్నట్లు ప్రచారం చేస్తోంది.  సంపన్నులైనా.. అనామకులైనా మోసం ఎప్పటికీ మోసమే. జాతీయవాదం పేరు చెప్పి లేదా అస్పష్టమైన స్పందనలతోనో మోసాన్ని దాచి ఉంచలేరు’’ అంటూ ఎదురు దాడి చేసింది. ఈ పరిణామ క్రమాలు అదానీ మదపరుల్లో ఆందోళనలు నింపాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని