Stock market: గట్టి షాక్‌ నుంచి మదుపరికి ఊపిరి.. మళ్లీ 74వేల ఎగువకు సెన్సెక్స్‌

Stock market: స్టాక్‌ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 2300 పాయింట్లు, నిఫ్టీ 778 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి.

Updated : 05 Jun 2024 18:12 IST

Stock market | ముంబయి: సార్వత్రిక ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వెలువడడంతో భారీ నష్టాలు మూటగట్టుకున్న దేశీయ స్టాక్‌ మార్కెట్లు (Stock market). . ఇవాళ కోలుకోవడమే కాకుండా భారీ లాభాలను నమోదు చేశాయి. చరిత్రలోనే అతిపెద్ద నష్టంతో షాక్‌లోకి జారుకున్న మదుపరికి.. ఓ విధంగా కోలుకునే అవకాశం లభించింది. భాజపాకు సొంతంగా మెజారిటీ రాకపోయినా.. మరోసారి ప్రభుత్వ ఏర్పాటుకు పెద్దగా ఇబ్బంది ఉండకపోవడంతో సూచీలు రాణించాయి. ఈ క్రమంలోనే సెన్సెక్స్ 2,500 పాయింట్ల మేర లాభపడి.. తిరిగి తన 74వేల మార్కును నిలబెట్టుకుంది. నిఫ్టీ 22,600 పాయింట్ల ఎగువన ముగిసింది. ముఖ్యంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, రిలయన్స్‌ వంటి షేర్లు సూచీలకు దన్నుగా నిలిచాయి.

సెన్సెక్స్‌ ఉదయం 73,027.88 (క్రితం ముగింపు 72,079.05) దాదాపు వెయ్యి పాయింట్ల లాభంతో ప్రారంభమైంది. కాసేపు ఒడుదొడుకులు ఎదుర్కొన్నప్పటికీ.. తర్వాత లాభాల్లోనే కొనసాగింది. కేంద్రంలో మరోసారి అధికారం ఏర్పాటు దిశగా ఎన్డీయే అడుగులు వేస్తుండడంతో సూచీలు భారీ లాభాల్లోకి వెళ్లాయి. ఈ క్రమంలోనే సెన్సెక్స్‌ ఇంట్రాడేలో 74,534.82 వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరికి 2,303.19 పాయింట్ల లాభంతో 74,382.24 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 778.50 పాయింట్ల లాభంతో 22,663 పాయింట్ల వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.37గా ఉంది. సెన్సెక్స్‌లో అన్ని షేర్లూ లాభాల్లో ముగిశాయి. ఇండస్‌ ఇండ్ బ్యాంక్‌, టాటా స్టీల్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా, బజాజ్‌ ఫైనాన్స్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ షేర్లు ప్రధానంగా రాణించాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 77.39 డాలర్లకు చేరగా.. బంగారం 2350 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

NSE ప్రపంచ రికార్డు

నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ (NSE) అరుదైన ఘనత నమోదు చేసింది. కేవలం ఒక్క ట్రేడింగ్‌ రోజులోనే అత్యధిక లావాదేవీలు జరిపి ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది. ఈ విషయాన్ని ఎన్‌ఎస్‌ఈ ఎండీ, సీఈఓ ఆశిష్‌కుమార్‌ చౌహాన్‌ ఎక్స్‌ వేదికగా ప్రకటించారు. ‘బుధవారం (జూన్‌ 5) ఉదయం 9:15 నుంచి మధ్యాహ్నం 3:30 గంటల వరకు 6 గంటల 15 నిమిషాల పాటు సాగిన ట్రేడింగ్ సెషన్‌లో ఎన్‌ఎస్‌ఈ 1971 కోట్ల (19.71 బిలియన్) ఆర్డర్‌లను ప్రాసెస్ చేసింది. 28.05 కోట్ల (280.55 మిలియన్లు) ట్రేడ్‌లను నిర్వహించింది. ఒక్క రోజులోనే అత్యధిక లావాదేవీలు నిర్వహించి కొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పింది’ అని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని