Stock market: భారీ నష్టాల్లో సూచీలు.. సెన్సెక్స్‌ 700 పాయింట్లు డౌన్‌

Stock market closing bell: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 736, నిఫ్టీ 238 పాయింట్లు చొప్పున నష్టపోయాయి.

Published : 19 Mar 2024 16:16 IST

Stock market | ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు, ఐటీ స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడితో సూచీలు పతనమయ్యాయి. ముఖ్యంగా సూచీల్లో అధిక వెయిటేజీ కలిగిన టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌లో అమ్మకాల వల్ల సూచీలు మరింత ఒత్తిడికి లోనయ్యాయి. ఓ దశలో సెన్సెక్స్‌ 800 పాయింట్లకు పైగా నష్టపోయింది. నిఫ్టీ 22,800 దిగువకు చేరింది.

ఉదయం 72,462.94 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమైన సెన్సెక్స్‌.. రోజంతా అదే బాటలో పయనించింది. ఇంట్రాడేలో 71,933.35- 72,490.09 మధ్య కదలాడింది. చివరికి 736.37 పాయింట్ల నష్టంతో 72,012.05 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 238.25 పాయింట్ల నష్టంతో 21,817.45 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్‌లో టీసీఎస్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, నెస్లే ఇండియా, విప్రో, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి. బజాజ్‌ ఫైనాన్స్‌, కోటక్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు లాభపడ్డాయి. డాలరుతో రూపాయి మారకం విలువ 83.04గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 86.48 డాలర్లు, బంగారం ఔన్సు 2,155 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి.

ఎందుకీ పతనం..?

  • వడ్డీ రేట్లపై అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ ఈ వారమే నిర్ణయం తీసుకోనుంది. ఈ క్రమంలో మదుపరులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. హాంకాంగ్‌, దక్షిణ కొరియా షేర్లు నష్టపోవడంతో ఆ ప్రభావం ఆసియా మార్కెట్లతో పాటు మన మార్కెట్లపై పడింది. ఆసియాలో చాలావరకు మార్కెట్లు నష్టాల్లోనే ముగిశాయి.
  • బ్లాక్‌ డీల్‌ ద్వారా 2.02 కోట్ల టీసీఎస్‌ షేర్లను టాటా సన్స్‌ విక్రయం నేపథ్యంలో ఆ కంపెనీ షేరు 3 శాతం మేర క్షీణించింది. ఇతర ఐటీ కంపెనీలైన హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, విప్రో, ఇన్ఫోసిస్‌ షేర్లు కూడా నష్టాల్లో ట్రేడవడం సూచీలపై ప్రభావం చూపింది.
  • విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగడమూ మరో కారణం. సోమవారం రూ.2,061 కోట్ల విలువైన దేశీయ షేర్లను వారు విక్రయించినట్లు మార్కెట్‌ డేటా చెబుతోంది.
  • అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్‌ ధరలు పెరగడమూ మదుపరుల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ 86 డాలర్ల ఎగువన ట్రేడవుతోంది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని