Stock market: అమెరికా ద్రవ్యోల్బణ గణంకాల ప్రభావం.. భారీ నష్టాల్లో మన సూచీలు

Stock market: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 793 పాయింట్లు, నిఫ్టీ 234 పాయింట్లు చొప్పున నష్టపోయాయి.

Updated : 12 Apr 2024 16:30 IST

Stock market | ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి. అమెరికాలో అంచనాలు మించి ద్రవ్యోల్బణం నమోదు కావడడంతో ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపుపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ ఏడాది మూడు సార్లు వడ్డీ రేట్లు తగ్గింపు ఉంటుందన్న ఆశలపై ద్రవ్యోల్బణ గణాంకాలు నీల్లు చల్లాయి. దీనికితోడు ప్రపంచ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు, గరిష్ఠాల వద్ద మదుపరులు లాభాలకు మొగ్గు చూపడం వంటి కారణాలతో మన సూచీలు పతనమయ్యాయి. పెరిగిన చమురు ధరలూ మదుపరులను కలవరపెడుతున్నాయి. దీంతో ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 800 పాయింట్లకు పైగా నష్టపోయింది. నిఫ్టీ 22,500 స్థాయికి చేరింది.

ఉదయం 74,889.64 పాయింట్ల వద్ద సెన్సెక్స్‌ నష్టాల్లో  ప్రారంభమైంది. ఆద్యంతం నష్టాల్లోనే కొనసాగింది. మధ్యాహ్నం తర్వాత అమ్మకాలు వెల్లువెత్తడంతో సూచీ మరింత పతనమైంది. ఇంట్రాడేలో 74,189.31 కనిష్ఠానికి చేరింది. చివరికి 793.25 పాయింట్ల నష్టంతో 74,244.90 వద్ద ముగిసింది. నిఫ్టీ 234.40 పాయింట్ల నష్టంతో 22,519 పాయింట్ల వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.43గా ఉంది. సెన్సెక్స్‌లో టాటా మోటార్స్‌, టీసీఎస్‌, నెస్లే ఇండియా మినహా మిగిలిన అన్ని షేర్లూ నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్‌ క్రూడ్ బ్యారెల్‌ 90.73 డాలర్ల వద్ద, బంగారం ఔన్సు 2,414 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి. ఆసియా మార్కెట్లలో టోక్యో లాభపడగా.. సియోల్‌, షాంఘై, హాంకాంగ్‌ నష్టాల్లో ముగిశాయి. యూరోపియన్‌ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి.

  • 32% ప్రీమియంతో హెక్సాకామ్‌ ఎంట్రీ: భారతీ ఎయిర్‌టెల్‌కు చెందిన భారతీ హెక్సాకామ్‌ లిమిటెడ్‌ 32 శాతం ప్రీమియంతో స్టాక్ ఎక్స్ఛేంజీల్లో నమోదైంది. ఇష్యూ ధర రూ.570 కాగా.. బీఎస్‌ఈలో 32.49 శాతం ప్రీమియంతో 755.20 వద్ద, ఎన్‌ఎస్‌ఈలో 32.45 శాతం ప్రీమియంతో రూ.755 వద్ద ఈ ఉదయం లిస్టయ్యింది. మార్కెట్‌ ముగిసేసరికి 42 శాతం ప్రీమియంతో 813.75 వద్ద షేరు ముగిసింది. ఈ ఆర్థిక సంవత్సరం ఐపీఓకు వచ్చిన తొలి కంపెనీ ఇదే.
  • 18 నుంచి వొడాఫోన్‌ FPO: ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న టెలికాం సంస్థ వొడాఫోన్‌ ఐడియా ఫాలో ఆన్‌ పబ్లిక్‌ ఇష్యూకు సిద్ధమైంది. రూ.18వేల కోట్లు మార్కెట్ల నుంచి సమీకరించనుంది. ధరల శ్రేణిని ఒక్కో షేరుకు రూ.10-11గా నిర్ణయించింది. ఏప్రిల్ 18న ప్రారంభమై 22తో ముగుస్తుంది. దేశంలో అతిపెద్ద ఎఫ్‌పీఓ ఇదే.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని