Afcons Infra IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్‌ నుంచి ఐపీఓ.. రూ.7,000 కోట్ల సమీకరణ!

Afcons Infra IPO: ఐదేళ్ల తర్వాత షాపూర్జీ పల్లోంజీ గ్రూప్‌ నుంచి ఐపీఓ వస్తోంది. నిర్మాణ రంగ కంపెనీ ఆఫ్కాన్స్‌ ఇన్‌ఫ్రా పబ్లిక్‌ ఇష్యూ కోసం సెబీకి ప్రాథమిక పత్రాలు సమర్పించింది.

Published : 29 Mar 2024 14:12 IST

Afcons Infra IPO | ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ వ్యాపార సంస్థ షాపూర్జీ పల్లోంజీ (Shapoorji Pallonji) గ్రూప్‌నకు చెందిన నిర్మాణ, ఇంజినీరింగ్‌ కంపెనీ ఆఫ్కాన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ ఐపీఓకి (Afcons Infra IPO) రానుంది. ఈ మేరకు మార్కెట్ల నియంత్రణా సంస్థ సెబీ అనుమతి కోరుతూ ప్రాథమిక పత్రాలు సమర్పించింది. రూ.7,000 కోట్ల సమీకరణకు దరఖాస్తు చేసుకుంది. దీంట్లో రూ.1,250 కోట్లు కొత్త షేర్ల జారీ ద్వారా.. మరో రూ.5,750 కోట్లు ‘ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (OFS)’ కింద సమీకరించనున్నట్లు వెల్లడించింది.

ఓఎఫ్‌ఎస్‌లో భాగంగా గోస్వామి ఇన్‌ఫ్రాటెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ తమ వాటాలను విక్రయించనున్నట్లు ప్రాథమిక పత్రాల ద్వారా తెలుస్తోంది. 2023 డిసెంబర్‌ నాటికి ఆఫ్కాన్స్‌లో గోస్వామి ఇన్‌ఫ్రాకు 72.35 శాతం వాటాలున్నాయి. మిగిలిన 16.64 శాతం వాటా షాపూర్జీ పల్లోంజీ అండ్‌ కంపెనీ చేతిలో ఉన్నాయి. ఐపీఓలో (IPO) సమీకరించిన నిధుల్లో రూ.150 కోట్లు మూలధన వ్యయానికి, రూ.350 కోట్లు నిర్వహణ మూలధన వ్యయం, రూ.500 కోట్లు రుణ చెల్లింపులకు ఉపయోగించనున్నట్లు కంపెనీ తెలిపింది. ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌, డీఏఎం క్యాపిటల్‌, నొమురా, జెఫరీస్‌, ఎస్‌బీఐ క్యాపిటల్‌ ఈ పబ్లిక్‌ ఇష్యూకు లీడ్‌ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి.

భారత్‌తో పాటు అంతర్జాతీయంగా ఆఫ్కాన్స్‌ పలు ఇంజినీరింగ్‌, ప్రొక్యూర్‌మెంట్‌, నిర్మాణ ప్రాజెక్టులు చేపడుతోంది. పది ఆర్థిక సంవత్సరాల్లో 15 దేశాల్లో 76 ప్రాజెక్టులు పూర్తి చేసింది. వీటి కాంట్రాక్టు విలువ దాదాపు రూ.52,200 కోట్లు. ప్రస్తుతం 13 దేశాల్లో 67 ప్రాజెక్టుల కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. వీటి ఆర్డర్‌ బుక్‌ విలువ రూ.34,888 కోట్లు. దీంట్లో రూ.26,093 కోట్లు దేశీయ, రూ.8,795 కోట్లు అంతర్జాతీయ ప్రాజెక్టులకు సంబంధించినవి. మరోవైపు ఈ కంపెనీ వద్ద పలు ప్రత్యేకమైన యంత్రాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అటల్‌ టన్నెల్‌, హై-స్పీడ్‌ రైల్వే ప్రాజెక్ట్‌, దిల్లీ- మేరఠ్‌ రీజినల్‌ ర్యాపిడ్‌ ట్రాన్సిట్‌ సిస్టమ్‌, దిల్లీ మెట్రో ఫేజ్‌-IV వంటి కీలక ప్రాజెక్టులను దక్కించుకుంది.

2023 సెప్టెంబర్‌తో ముగిసిన ఆరు నెలల వ్యవధిలో కంపెనీ ఆదాయం రూ.6,655 కోట్లు, నికర లాభం రూ.195 కోట్లుగా నమోదైంది. చివరిసారి ఎస్‌పీ గ్రూప్‌ నుంచి 2019 ఆగస్టులో స్టెర్లింగ్‌ అండ్ విల్సర్‌ సోలార్‌ ఐపీఓకి వచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని