Share Market: సానుకూలతలున్నా.. అప్రమత్తతే!

ఎన్నికల అనంతరం అధికారం చేపట్టే పార్టీ విషయమై అనిశ్చితి వల్ల అప్రమత్తతతో ఉన్నా, నిఫ్టీ-50 ఈ వారం సానుకూలతలను కనబరచొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Updated : 21 May 2024 06:06 IST

లోహ, వాహన షేర్లు రాణించొచ్చు
విశ్లేషకుల అంచనా
స్టాక్‌ మార్కెట్‌
ఈ వారం

న్నికల అనంతరం అధికారం చేపట్టే పార్టీ విషయమై అనిశ్చితి వల్ల అప్రమత్తతతో ఉన్నా, నిఫ్టీ-50 ఈ వారం సానుకూలతలను కనబరచొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గురువారం షార్ట్‌ కవరింగ్‌ కనిపించడానికి తోడు, విదేశీ మదుపర్లు శుక్రవారం నికర కొనుగోలుదార్లుగా మారడం ఇందుకు నేపథ్యమని అంటున్నారు. అయిదో దశ పోలింగ్‌ పూర్తికాగా, ఇంకో 2 దశల్లో పూర్తికానున్న ఎన్నికలపై ఆందోళనల వల్ల లాభాలు పరిమితంగానే ఉండొచ్చంటున్నారు. నిఫ్టీ-50కి 22,300-22,350 వద్ద తక్షణ మద్దతు లభించొచ్చని; 22,600 వద్ద నిరోధం ఎదురు కావొచ్చని సాంకేతిక నిపుణులు అంచనా వేస్తున్నారు. మహారాష్ట్రలో పోలింగ్‌ కారణంగా సోమవారం మార్కెట్లు పనిచేయలేదు. ఈ వారం వెలువడే గ్రాసిమ్, సన్‌ఫార్మా, పవర్‌ గ్రిడ్, ఐటీసీ, హిందాల్కో, ఎన్‌టీపీసీ ఫలితాలను మదుపర్లు గమనించొచ్చు. వివిధ రంగాలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..

  •  బ్యాంకింగ్‌ షేర్లలో ఊగిసలాట కొనసాగొచ్చు. అయితే చాలా వరకు షేర్లు తక్కువ పీ/ఏబీవీ (ప్రైస్‌/అడ్జస్టెడ్‌ బుక్‌ వేల్యూ) వద్ద చలిస్తుండడంతో కొనుగోళ్లకు అవకాశం ఉంది. బ్యాంక్‌ నిఫ్టీ 48,500 స్థాయి దిశగా కదలాడొచ్చు. 47,700 కంటే దిగువకు వస్తే కొనుగోళ్లకు అవకాశంగా భావించొచ్చు.
  • ఎఫ్‌ఎమ్‌సీజీ షేర్లు ఒక శ్రేణికి లోబడి కదలాడొచ్చు. బులిష్‌ సెంటిమెంటు కొంత కనిపిస్తున్నా.. అంచనాలకు అనుగుణంగా రుతుపవనాల పురోగతి ఉంటుందా అనే అనుమానంతో, ఈ షేర్ల సిఫారసుకు కొంత మంది విశ్లేషకులు దూరం జరుగుతున్నారు.
  • లోహ కంపెనీల షేర్లు రాణించే అవకాశం ఉంది. అంతర్జాతీయ సంకేతాలు దన్నుగా నిలవవచ్చు. రేట్ల కోత దిశగా అమెరికా ఫెడ్‌ అడుగులు వేయొచ్చన్న అంచనాలు దోహదం చేయొచ్చు. 
  • ఇప్పటిదాకా వెలువడ్డ ఆర్థిక ఫలితాలు బాగుండడంతో యంత్ర పరికరాల షేర్లు సానుకూలంగా చలించొచ్చు. జనవరి-మార్చిలో ఆర్డర్లను మెరుగ్గా పూర్తి చేయడంతో పాటు, ఏప్రిల్‌-జూన్‌లోనూ ఈ ధోరణి కొనసాగొచ్చన్న అంచనాలు కలిసిరావొచ్చు.
  • బలమైన ఫలితాలు, ఏప్రిల్‌ నెల విక్రయాల మధ్య వాహన కంపెనీల షేర్లు సానుకూల ధోరణిలో చలించొచ్చు. ఈ వారం నిఫ్టీ ఆటో సూచీకి 23,250 వద్ద మద్దతు; 23,440 వద్ద నిరోధం కనిపిస్తున్నాయి. ఫెడ్‌ విధాన సమీక్ష, మన ఎన్నికల ఫలితాలు కీలకం కానున్నాయి.
  • ఇరాన్‌ అధ్యక్షుడి ఆకస్మిక మృతి నేపథ్యంలో, చమురు కంపెనీల షేర్లను జాగ్రత్తగా గమనించాలి. ముడి చమురు ధరలు పెరిగితే ఆ భారాన్ని వినియోగదార్లపై వేయొచ్చన్న అంచనాలు చమురు రిఫైనింగ్‌ కంపెనీలకు ఉపయోగపడొచ్చు. 
  • భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు లాభాల్లో, వొడాఫోన్‌ ఐడియా షేర్లు నష్టాల్లో కొనసాగొచ్చు. ఎన్నికల అనంతరం  టెలికాం కంపెనీలు ఛార్జీలపై తీసుకునే నిర్ణయాలను మదుపర్లు     గమనించాలి. 
  • మిశ్రమ ఆర్థిక ఫలితాల కారణంగా ఔషధ కంపెనీల షేర్లు ఒక శ్రేణిలోనే చలించొచ్చు. సన్‌ఫార్మా, గ్లాండ్‌ ఫార్మా, టొరెంట్‌ ఫార్మా, గ్లెన్‌మార్క్‌ ఫార్మా, దివీస్‌ కంపెనీల ఫలితాలు ఈ వారం వెలువడనున్నాయి. నిఫ్టీ ఫార్మాకు 19,400 వద్ద నిరోధం; 18,500 వద్ద మద్దతు కనిపిస్తున్నాయి. 
  • ఐటీ షేర్లు ఒక శ్రేణిలోనే ట్రేడవవచ్చు. సానుకూల ధోరణి పుంజుకుంటే నిఫ్టీ ఐటీ సూచీ 34,000కు వెళ్లొచ్చు.
  • ఈ నెలలోనూ సిమెంటు ధరలు పుంజుకోవడంలో విఫలం కావడంతో, సిమెంటు షేర్లు ఒక శ్రేణికి లోబడి కదలాడొచ్చు. ఎన్నికలు పూరయ్యే వరకు ధరలు పెరగకపోవచ్చు. అల్ట్రాటెక్‌ సిమెంట్, శ్రీసిమెంట్, జేకే సిమెంట్‌లను పరిశీలించొచ్చంటున్నారు.        

  నేటి బోర్డు సమావేశాలు: భెల్, ఎన్‌ఎండీసీ, ఎన్‌ఎండీసీ స్టీల్, పీఐ ఇండస్ట్రీస్, ఇర్కాన్‌ ఇంటర్నేషనల్, జేకే టైర్, జీఎస్‌ఎఫ్‌సీ, ఆజాద్‌ ఇంజినీరింగ్, రెలిగేర్‌ ఎంటర్‌ప్రైజెస్, వెల్‌స్పన్‌ ఎంటర్‌ప్రైజెస్, గల్ఫ్‌ ఆయిల్, మిక్‌ ఎలక్ట్రానిక్స్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని