Stock Market Update: దూసుకెళ్తున్న స్టాక్‌ మార్కెట్లు.. రూ.12.50 లక్షల కోట్ల లాభం!

Stock Market Update: మధ్యాహ్నం 12:32 గంటల సమయంలో సెన్సెక్స్‌ 2,335 పాయింట్లు ఎగబాకి 76,286 దగ్గర కొనసాగుతోంది. నిఫ్టీ 694 పాయింట్లు పెరిగి 23,225 వద్ద ట్రేడవుతోంది.

Published : 03 Jun 2024 12:49 IST

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు (Stock Market) సోమవారం జోరుమీదున్నాయి. ఉదయమే భారీ లాభాలతో ట్రేడింగ్‌ ప్రారంభించిన మార్కెట్లు అదే హవాను కొనసాగిస్తున్నాయి. సెన్సెక్స్‌, నిఫ్టీ జీవనకాల గరిష్ఠాలను తాకాయి. దీంతో మదుపర్ల సంపద ట్రేడింగ్‌ ప్రారంభంలోనే రూ.12.50 లక్షల కోట్లు పెరగడం విశేషం.

శనివారం వెలువడిన ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాల్లో మరోసారి అధికార ఎన్‌డీయే కూటమిదే విజయమని ముక్తకంఠంతో అంచనా వేసిన విషయం తెలిసిందే. సూచీల పరుగుకు ప్రధాన కారణం ఇదే. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూలతలు, రేట్ల కోత అంచనాలతో ఆసియా మార్కెట్ల ర్యాలీ, రూపాయి బలపడడం వంటి అంశాలు కూడా సూచీలను ముందుకు తీసుకెళ్తున్నాయి.

ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 76,738 దగ్గర, నిఫ్టీ 23,338 వద్ద జీవనకాల గరిష్ఠాన్ని తాకింది. సెన్సెక్స్‌-30 సూచీలో ఒక్క హెచ్‌సీఎల్‌ టెక్‌ మినహా అన్ని షేర్లు లాభాల్లోనే ఉన్నాయి. పవర్‌గ్రిడ్‌ ఏకంగా 10 శాతానికి పైగా లాభపడడం విశేషం. ఎస్‌బీఐ, ఎన్‌టీపీసీ ఎనిమిది శాతం లాభంతో ఉన్నాయి. ఎల్‌ అండ్‌ టీ, యాక్సిస్‌ బ్యాంక్‌ ఆరు శాతం, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, ఎం అండ్‌ ఎం ఐదు శాతానికి పైగా లాభంలో కొనసాగుతున్నాయి. మధ్యాహ్నం 12:32 గంటల సమయంలో సెన్సెక్స్‌ 2,335 పాయింట్లు ఎగబాకి 76,286 దగ్గర కొనసాగుతోంది. నిఫ్టీ 694 పాయింట్లు పెరిగి 23,225 వద్ద ట్రేడవుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని