Social media X: ‘ఎక్స్‌’లో బేసిక్‌ ఫీచర్లకు ఏడాదికి 1 డాలర్‌ ఛార్జ్‌..!

Social media X: నకిలీ ఖాతాలను అరికట్టడమే లక్ష్యంగా సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో ఎలాన్‌ మస్క్‌ మరో సరికొత్త సబ్‌స్క్రిప్షన్‌ మోడల్‌ను తీసుకొచ్చారు.

Updated : 18 Oct 2023 15:20 IST

వాషింగ్టన్‌: బిలియనీర్‌ ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) నేతృత్వంలోని సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌ (X)’ (గతంలో ట్విటర్‌) మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా మరో సబ్‌స్క్రిప్షన్‌ మోడల్‌ను పరీక్షించేందుకు సిద్ధమైంది. ప్రస్తుతానికి దీన్ని ప్రయోగాత్మకంగా కొన్ని మార్కెట్లలో ప్రవేశపెట్టింది. న్యూజిలాండ్‌, ఫిలిప్పీన్స్‌లో ఈ కొత్త సబ్‌స్క్రిప్షన్‌ పాలసీ అందుబాటులోకి వచ్చింది.

ఏంటీ కొత్త సబ్‌స్క్రిప్షన్‌..

ఈ సబ్‌స్క్రిప్షన్‌ మోడల్‌ ప్రకారం.. కొత్తగా ఎక్స్‌ (X) ఖాతా తెరిచే యూజర్లు ఏడాదికి 1 డాలర్‌ చెల్లించాల్సి ఉంటుంది. అయితే, వెబ్‌వెర్షన్‌లో ఇతరుల సందేశాలను రీపోస్ట్‌ చేయడం, లైక్ చేయడం, బుక్‌మార్క్‌ చేయడం, ఇతరుల ఖాతాలను మెన్షన్‌ చేయడం వంటి బేసిక్‌ ఫీచర్లు కావాలనుకునే వారు మాత్రమే ఈ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. కేవలం ఖాతా తెరిచి పోస్ట్‌లను చదవడం; ఫొటోలు, వీడియోలు చూడ్డానికి మాత్రం ఎలాంటి రుసుము అవసరం లేదు. ప్రస్తుతానికి దీన్ని కొత్త యూజర్లకు మాత్రమే పరిమితం చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఇప్పటికే ఎక్స్‌ ఖాతా ఉన్నవారిపై ఎలాంటి ప్రభావం ఉండబోదని కంపెనీ స్పష్టం చేసింది. ఇప్పటికే ‘ఎక్స్‌ ప్రీమియం’ పేరిట ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను ఎక్స్‌ అందుబాటులో ఉంచిన విషయం తెలిసిందే. దీని వల్ల యూజర్లు తమ ట్వీట్లను ఎడిట్‌ చేయడం, సుదీర్ఘ సందేశాలను పోస్ట్‌ చేయడం, ఫోల్డర్ల బుక్‌ మార్క్‌, యాప్‌ ఐకాన్‌ను నచ్చినట్లుగా మార్చుకోవడం వంటి అదనపు ఫీచర్లను అందిస్తోంది.

ఎందుకీ కొత్త మోడల్‌..

‘ఎక్స్‌ (X)’లో నకిలీ ఖాతాల బెడదపై మస్క్‌ ఎప్పటి నుంచో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ ఖాతాలను అరికట్టడం కోసం ఇప్పటికే పలు చర్యలు చేపట్టారు. తాజాగా తీసుకొస్తున్న 1 డాలర్‌ సబ్‌స్క్రిప్షన్‌ కూడా అందులో భాగమేనని కంపెనీ వివరించింది. దీని వల్ల నకిలీ ఖాతాలకు అడ్డుకట్ట పడే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేసింది. సబ్‌స్క్రిప్షన్‌ ఛార్జీలు దేశాన్ని బట్టి మారతాయని తెలిపింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని