Paytm: పేటీఎంలో సాఫ్ట్‌బ్యాంక్‌ మరో 2 శాతం వాటాలు విక్రయం

Paytm: ఇప్పటికే పలు దఫాల్లో పేటీఎంలో వాటాలు కుదించుకుంటూ వచ్చిన సాఫ్ట్‌బ్యాంక్‌ తాజాగా మరో రెండు శాతం వాటాలను విక్రయించింది.

Published : 29 Feb 2024 15:38 IST

ముంబయి: నియంత్రణపరమైన చిక్కులు ఎదుర్కొంటున్న ఫిన్‌టెక్‌ సంస్థ పేటీఎం (Paytm) నుంచి సాఫ్ట్‌బ్యాంక్ మరిన్ని వాటాలను విక్రయించింది. గత నెల రోజుల్లో ఓపెన్‌ మార్కెట్ ద్వారా దాదాపు 13.7 మిలియన్ల షేర్లను అమ్మేసింది. దీంతో పేటీఎం మాతృసంస్థ వన్‌97 కమ్యూనికేషన్స్‌లో ఆ కంపెనీ వాటా 5.01 శాతం నుంచి 2.83 శాతానికి తగ్గినట్లు గురువారం నాటి రెగ్యులేటరీ ఫైలింగ్‌ ద్వారా తెలుస్తోంది.

2022 సెప్టెంబరు నాటికి పేటీఎంలో సాఫ్ట్‌బ్యాంక్‌కు (SoftBank) 17.5 శాతం వాటా ఉండేది. అప్పటినుంచి పలుమార్లు ఓపెన్‌ మార్కెట్‌ ద్వారా తమ వాటాలను విక్రయిస్తూ వచ్చింది. చివరిసారిగా జనవరి 24న మరో రెండు శాతం వాటాను కుదించుకున్నట్లు వెల్లడించింది. మొత్తానికి పేటీఎం నుంచి పూర్తిగా నిష్క్రమించే యోచనలో ఉన్నట్లు సమాచారం.

సాఫ్ట్‌బ్యాంక్‌ (SoftBank) తమ పెట్టుబడులపై స్వల్ప లాభాలతో పేటీఎం నుంచి బయటకు వచ్చే అవకాశం ఓ దశలో ఉండేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. కానీ, పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌పై (PPBL) ఆర్‌బీఐ ఆంక్షల తర్వాత పరిస్థితులు తారుమారయ్యాయని చెప్పాయి. దాదాపు 100-150 మిలియన్‌ డాలర్ల నష్టం వాటిల్లే అవకాశం ఉందని వెల్లడించాయి. మరోవైపు వారెన్‌ బఫెట్‌కు చెందిన బెర్క్‌షైర్‌ హాత్‌వే, చైనా అలీబాబా గ్రూప్‌ వంటి అంతర్జాతీయ పెట్టుబడి సంస్థలు 2023లోనే పేటీఎం నుంచి వైదొలగాయి.

ఈపీఎఫ్‌ఓ కొత్త విధానం.. కోత ఖాయం!

జనవరి 31న పీపీబీఎల్‌పై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. 2024 మార్చి 15 తర్వాత డిపాజిట్లను స్వీకరించొద్దు. వినియోగదారుల ఖాతాలు, ప్రీ పెయిడ్‌ ఇన్‌స్ట్రుమెంట్‌లు, వాలెట్‌లు, ఫాస్ట్‌ట్యాగ్‌లు, నేషనల్‌ కామన్‌ మొబిలిటీ (ఎన్‌సీఎంసీ) కార్డులు తదితరాల్లో క్రెడిట్‌ లావాదేవీలు లేదా టాప్‌అప్‌లు చేయొద్దు. ఈ ఆంక్షల నేపథ్యంలో కంపెనీ షేరు విలువ (Paytm share price) పతనమవుతూ వస్తోంది. గురువారం బీఎస్‌ఈలో ఓ దశలో 3.5 శాతానికి పైగా నష్టపోయి రూ.390 వద్ద ట్రేడవుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు