Standard Deduction: స్టాండర్డ్ డిడక్షన్ అంటే ఏంటి? ప‌న్ను త‌గ్గించుకోవ‌డంలో ఎలా స‌హాయ‌ప‌డుతుంది?

జీతం ద్వారా ఆదాయం పొందుతున్న ఉద్యోగులు, పెన్ష‌నర్లు మాత్ర‌మే స్టాండ‌ర్డ్ డిడ‌క్ష‌న్‌ను క్లెయిమ్ చేసుకోవ‌చ్చు.

Updated : 07 Jul 2022 14:55 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం భార‌తీయ పౌరుల ఆదాయంపై ప‌న్నులు విధించ‌డం మాత్ర‌మే కాకుండా మిన‌హాయింపులు, రాయితీల‌ను క్లెయిమ్ చేసుకునేందుకు కూడా అవ‌కాశం క‌ల్పిస్తుంది. ప‌న్ను చెల్లింపుదారుల ఆదాయం, ఖ‌ర్చు చేసిన విధానంపై మిన‌హాయింపులు ఆధార‌ప‌డి ఉంటాయి. కానీ, ఆదాయం ఖ‌ర్చు చేసిన విధానంతో సంబంధం లేకుండా అంద‌రికీ ఒకే ర‌కమైన ప్ర‌యోజ‌నాల‌ను ఇచ్చేదే ప్రామాణిక తగ్గింపు (స్టాండర్డ్ డిడ‌క్ష‌న్). జీతం ద్వారా ఆదాయం పొందుతున్న ఉద్యోగులు, పెన్ష‌నర్లు స్టాండ‌ర్డ్ డిడ‌క్ష‌న్‌ను క్లెయిమ్ చేసుకోవ‌చ్చు. ఇందుకోసం ఆదాయం, ఖ‌ర్చుల‌కు సంబంధించిన ఎలాంటి ఆధారాలూ చూపించ‌న‌వ‌స‌రం లేదు.

స్టాండర్డ్ డిడక్షన్ మొదటిసారిగా 1974లో ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 16 కింద ప్రవేశపెట్టారు. ఉద్యోగి ఆఫీసుకు వెళ్లి వ‌చ్చేందుకు అయ్యే ర‌వాణా ఖ‌ర్చులు, ఆరోగ్య వైద్య ఖ‌ర్చుల‌ను దృష్టిలో పెట్టుకుని అప్ప‌ట్లో స్టాండ‌ర్డ్ డిడ‌క్ష‌న్‌ను ప‌రిచ‌యం చేశారు. ఉద్యోగి స్థూల వేత‌నం నుంచి అనుమతించిన ప‌రిమితి మేర‌కు ఈ ఖ‌ర్చుల‌ను తీసివేసి ప‌న్ను లెక్కించేవారు. కానీ, మ‌దింపు సంవ‌త్స‌రం (2006-07) నుంచి దీన్ని రద్దు చేశారు. అయితే, 12 ఏళ్ల త‌ర్వాత.. అంటే 2018 బ‌డ్జెట్‌లో మళ్లీ  స్టాండ‌ర్డ్ డిడ‌క్ష‌న్‌ను తిరిగి ప్ర‌వేశ‌పెట్టాల‌ని కేంద్ర‌ ప్రభుత్వం ప్రతిపాదించింది.

ఏమిటీ స్టాండ‌ర్డ్ డిడ‌క్ష‌న్‌..?
జీతం ద్వారా ఆదాయం పొందే ఉద్యోగులు.. పెట్టుబ‌డులకు, ఇత‌ర వ్య‌యాల‌కు సంబంధించిన రుజువులు చూపించ‌కుండా వార్షిక ఆదాయం నుంచి ముందుగా రూ.50 వేల స్టాండ‌ర్డ్ డిడ‌క్ష‌న్‌ను తీసివేసి, ప‌న్ను చెల్లించాల్సిన ఆదాయాన్ని త‌గ్గించుకోవ‌చ్చు. అయితే ఒక ఆర్థిక సంవ‌త్స‌రంలో ఒక్క‌సారి మాత్ర‌మే రూ.50 వేల స్టాండ‌ర్డ్ డిడ‌క్ష‌న్ క్లెయిమ్ చేసుకోవ‌చ్చు. ఉదాహ‌ర‌ణ‌కు ఒక వ్య‌క్తి ఒక ఆర్థిక సంవ‌త్స‌రంలో ఇద్ద‌రు య‌జ‌మానుల వ‌ద్ద ప‌నిచేసిన‌ప్ప‌టికీ ఒక జీతంపై లేదా వార్షిక‌ ఆదాయంపై మాత్ర‌మే స్టాండ‌ర్డ్ డిడ‌క్ష‌న్ క్లెయిమ్ చేసుకోవ‌చ్చు.

2018కి ముందు జీతం ద్వారా ఆదాయం పొందుతున్న ఉద్యోగులకు వారి వారి ట్రాన్స్‌పోర్ట్ అల‌వెన్స్‌, ఇతర వైద్య ఖ‌ర్చుల ఆధారంగా మిన‌హాయింపు ఇచ్చేవారు. అయితే, ఇది వేరు వేరు వ్య‌క్తుల‌కు వేరు వేరుగా ఉండేది. కానీ అంద‌రికీ ఒకే ర‌క‌మైన ప్ర‌యోజ‌నాల‌ను అందించాల‌నే ఉద్దేశంతో 2018లో స్టాండ‌ర్డ్ డిడ‌క్ష‌న్‌ను తిరిగి ప్ర‌వేశ‌పెట్టారు. అప్పుడు స్టాండ‌ర్డ్ డిడ‌క్ష‌న్ లిమిట్‌ రూ.40 వేల వ‌ర‌కు ఉండేది. 2021-22 ఆర్థిక సంవ‌త్స‌రంలో ఈ పరిమితిని రూ.50 వేల‌కు పెంచారు. ప్ర‌స్తుతం ఇది ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం సెక్ష‌న్ 16(ia) కిందికి వ‌స్తుంది.

స్టాండ‌ర్డ్ డిడ‌క్ష‌న్ ప్ర‌యోజ‌నాలు..

  • మీరు జీతం ద్వారా ఆదాయం పొందుతున్న వ్య‌క్తులైతే..ఏ  ఆదాయ‌పు ప‌న్ను స్లాబ్‌లోకి వ‌చ్చినప్ప‌ట‌కీ స్టాండ‌ర్డ్ డిడ‌క్ష‌న్ క్లెయిమ్ చేసుకోవ‌చ్చు.
  • రూ. 50 వేల డిడ‌క్ష‌న్‌ను మీ స్థూల ఆదాయం నుంచి ఫ్లాట్‌గా తీసివేయ‌వచ్చు. ఈ మొత్తాన్ని ఏ అవ‌స‌రం కోసం ఎక్క‌డ ఖ‌ర్చు చేశారో చూపించాల్సిన అవ‌స‌రం లేదు.
  • ముఖ్యంగా మ‌ధ్య‌త‌రగ‌తి ప‌న్ను చెల్లింపుదారులు త‌మ ప‌న్ను బాధ్యతను త‌గ్గించుకునేందుకు ఇది చాలా బాగా స‌హాయ‌ప‌డుతుంది.

ఉదాహ‌ర‌ణ‌కు.. ఒక వ్య‌క్తి స్టాండ‌ర్డ్ డిడ‌క్ష‌న్ త‌ప్ప‌ అన్ని మిన‌హాయింపులూ తీసివేసిన త‌ర్వాత వ‌చ్చే నిక‌ర ఆదాయం రూ. 5.50 ల‌క్ష‌లు అనుకుందాం. ఒక వేళ స్టాండ‌ర్డ్ డిడ‌క్ష‌న్ లేక‌పోతే ఆ వ్య‌క్తి రూ. 5.50 ల‌క్ష‌ల‌పై ప‌న్ను చెల్లించాలి. అప్పుడు పాత ప‌న్ను స్లాబ్ ప్ర‌కారం.. రూ.2.50 ల‌క్ష‌ల వ‌ర‌కు పన్ను ఉండదు. రూ. 2.50 ల‌క్ష‌ల (రూ.5 ల‌క్ష‌లు - రూ.2.50 ల‌క్ష‌లు) పై 5 శాతం అంటే రూ. 12,500 + రూ. 50 వేల‌ (రూ. 5.50 ల‌క్ష‌లు - 5 ల‌క్ష‌లు) పై 20 శాతం అంటే రూ. 10,000.. మొత్తం రూ. రూ. 22,500 వ‌ర‌కు ప‌న్ను చెల్లించాల్సి వ‌స్తుంది. స్టాండ‌ర్డ్ డిడ‌క్ష‌న్ ఉండ‌డం వ‌ల్ల నిక‌ర ఆదాయం రూ. 5 ల‌క్ష‌ల‌కు త‌గ్గుతుంది. కాబ‌ట్టి, రూ. 5 ల‌క్ష‌ల లోపు ఆదాయం ఉన్న వారు ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం సెక్ష‌న్ 87ఏ కింద రిబేట్ క్లెయిమ్ చేసుకోవ‌చ్చు కాబ‌ట్టి చెల్లించాల్సిన ప‌న్ను జీరో అవుతుంది. ఉద్యోగులు ప‌నిచేసే సంస్థ స్టాండ‌ర్డ్ డిడ‌క్ష‌న్‌ను పరిగణనలోకి తీసుకోకుండా ప‌న్ను వ‌ర్తింప‌చేస్తే.. రిట‌ర్నులు ఫైల్ చేసిన‌ప్పుడు రీఫండ్ క్లెయిమ్ చేసుకోవ‌చ్చు.

గుర్తుంచుకోండి: పాత విధానంలో ప‌న్ను చెల్లించే వారు మాత్ర‌మే స్టాండ‌ర్డ్ డిడ‌క్ష‌న్‌ను క్లెయిమ్ చేసుకోవ‌చ్చు. కొత్త ప‌న్ను విధానం ఎంచుకున్న‌వారికి స్టాండ‌ర్డ్ డిడ‌క్ష‌న్ వ‌ర్తించ‌దు. అలాగే, స్వీయ ఉపాధి పొందే వారు స్టాండ‌ర్డ్ డిడ‌క్ష‌న్ క్లెయిమ్ చేయ‌డం కుద‌ర‌దు. కార‌ణం, స్వీయ ఉపాధి పొందే వారికి శాల‌రీ ద్వారా వ‌చ్చే ఆదాయం ఉండ‌దు. వారి ఆదాయం ‘వ్యాపారం ద్వారా వ‌చ్చిన ఆదాయం’ కింద‌కి వ‌స్తుంది. జీతం ద్వారా వ‌చ్చిన ఆదాయంపై మాత్ర‌మే స్టాండ‌ర్డ్ డిడక్ష‌న్ క్లెయిమ్ చేసుకునే వీలుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని