Stock Market: రంకేసిన బుల్‌.. మదుపర్లకు లాభాల పంట

Stock Market Closing bell: సెన్సెక్స్‌ (Sensex) 1383.93 పాయింట్లు లాభపడి 68,865.12 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ (Nifty) 418.90 పాయింట్లు పెరిగి 20,686.80 దగ్గర ముగిసింది.

Updated : 04 Dec 2023 21:27 IST

Stock Market Closing bell | ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ (Stock Market) సూచీలు సోమవారం దూసుకెళ్లాయి. ఉదయమే ఉత్సాహంగా ప్రారంభమైన మార్కెట్లు సమయం గడుస్తున్న కొద్దీ సరికొత్త గరిష్ఠాలను నమోదు చేస్తూ మదుపర్లకు భారీ లాభాలను తెచ్చి పెట్టాయి. తాజా ఎన్నికల్లో భాజపా విజయం నేటి బుల్‌ పరుగుకు ప్రధాన కారణంగా నిలిచింది.

ఉదయం సెన్సెక్స్‌ (Sensex) 68,435.34 దగ్గర భారీ లాభాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 68,918.22 వద్ద ఆల్‌టైం రికార్డును నమోదు చేసింది. చివరకు 1383.93 పాయింట్లు లాభపడి 68,865.12 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ (Nifty) 20,601.95 దగ్గర ప్రారంభమై ఇంట్రాడేలో 20,702.65 వద్ద జీవనకాల గరిష్ఠాన్ని తాకింది. చివరకు 418.90 పాయింట్లు పెరిగి 20,686.80 దగ్గర ముగిసింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.36 వద్ద నిలిచింది.

సెన్సెక్స్‌ (Sensex)30 సూచీలో టాటా మోటార్స్‌, విప్రో మాత్రమే నష్టాల్లో ముగిశాయి. ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎస్‌బీఐ షేర్లు నాలుగు శాతానికి పైగా లాభపడ్డాయి. ఎల్‌అండ్‌టీ, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌ మూడు శాతం మేర పెరిగాయి. ఎన్‌టీపీసీ, బజాజ్‌ ఫైనాన్స్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లు రెండు శాతానికి పైగా పుంజుకున్నాయి. ఎంఅండ్‌ఎం, భారతీ ఎయిర్‌టెల్‌, హెచ్‌యూఎల్‌, పవర్‌గ్రిడ్‌, రిలయన్స్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ షేర్లు ఒకశాతం మేర రాణించాయి.

ర్యాలీకి కారణాలివే..

  • ఎన్నికల ఫలితాలు: మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కేంద్రంలోని అధికార భాజపా విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇదే నేటి మార్కెట్ల పరుగుకు ప్రధాన కారణం. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి సుస్థిర ప్రభుత్వ ఏర్పాటు అవకాశాలకు ఈ ఫలితాలు దోహదం చేస్తాయనే అంచనాలు మదుపర్లలో ఉత్సాహం నింపాయి.
  • వడ్డీరేట్ల కోత: ద్రవ్యోల్బణ కట్టడి కోసం ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు ఇటీవలి వరకు కీలక రేట్లను పెంచిన విషయం తెలిసిందే. దీంతో వడ్డీరేట్లు గరిష్ఠాలకు చేరాయి. తాజాగా ద్రవ్యోల్బణం చల్లబడుతున్నట్లు గణాంకాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇకపై రేట్ల పెంపును నిలిపివేసి.. వచ్చే ఏడాది నుంచి కోతలు అమలు చేసే అవకాశం ఉందనే సంకేతాలు వినిపిస్తున్నాయి.
  • ప్రపంచ మార్కెట్లలో సానుకూల పవనాలు: వడ్డీరేట్ల కోత వార్తలు ప్రపంచవ్యాప్తంగా షేర్‌ మార్కెట్లలో సానుకూల సంకేతాలు నింపింది. దీంతో అమెరికా, ఐరోపా సహా ఆసియా- పసిఫిక్‌ సూచీలన్నీ లాభాల్లో ట్రేడవుతున్నాయి.
  • ఎఫ్‌ఐఐల కొనుగోళ్లు: విదేశీ సంస్థాగత మదుపర్లు గతకొన్ని నెలలుగా దేశీయ ఈక్విటీ షేర్లను వరుసగా విక్రయిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. నవంబర్‌ చివర్లో మాత్రం పరిస్థితులు మారాయి. గత కొన్ని రోజులుగా వీరు నికర కొనుగోలుదారులుగా నిలుస్తుండడం సూచీలకు కలిసొస్తోంది.

రూ.5 లక్షల కోట్లకు పైగా లాభం..

మదుపర్ల సంపదగా భావించే బీఎస్‌ఈలోని నమోదిత సంస్థల మార్కెట్‌ విలువ సోమవారం ఒక్కరోజే రూ.5 లక్షల కోట్లకు పైగా పెరిగి రూ.343 లక్షల కోట్లకు చేరింది. గత ఐదు ట్రేడింగ్‌ సెషన్లలో ఈ విలువ రూ.14 లక్షల కోట్లకు పైగా ఎగబాకడం విశేషం. బీఎస్‌ఈలోని నమోదిత సంస్థల మార్కెట్‌ విలువ ఇటీవలే నాలుగు లక్షల కోట్ల డాలర్ల కీలక మైలురాయిని అధిగమించిన విషయం తెలిసిందే. మరోవైపు ఎన్‌ఎస్‌ఈ లిస్టెడ్‌ కంపెనీల విలువ సైతం శుక్రవారం ఈ కీలక మైలురాయి దాటింది.

‘అదానీ’ షేర్ల ర్యాలీ..

అదానీ గ్రూప్‌ షేర్లలో ర్యాలీ కొనసాగుతూనే ఉంది. అత్యధికంగా అదానీ గ్రీన్‌ ఎనర్జీ.. బీఎస్ఈలో 9.47 శాతం పెరిగి రూ.1,123 దగ్గర స్థిరపడింది. తర్వాత అంబుజా సిమెంట్స్‌ 7.36 శాతం, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ 7.13 శాతం పెరిగాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని