Stock Market: ఆద్యంతం ఒడుదొడుకులు.. ఆఖర్లో లాభాలు.. 19,880 ఎగువన నిఫ్టీ

Stock Market Closing bell: సెన్సెక్స్‌ (Sensex) 204.16 పాయింట్లు లాభపడి 66,174.20 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ (Nifty) 95 పాయింట్లు కుంగి 19,889.70 దగ్గర ముగిసింది.

Published : 28 Nov 2023 16:14 IST

Stock Market Closing bell | ముంబయి: మంగళవారం ఆద్యంతం తీవ్ర ఒడుదొడుకుల మధ్య సాగిన దేశీయ స్టాక్‌ మార్కెట్ (Stock Market) సూచీల పయనం చివరకు లాభాల్లో ముగిసింది. ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు ఆఖరి గంటన్నర ముందు వరకు తీవ్ర ఊగిసలాటలో పయనించాయి. చివరకు కొనుగోళ్లు వెల్లువెత్తడంతో స్పష్టమైన లాభాలను నమోదు చేశాయి. దీంతో రెండు రోజుల సెషన్ల వరుస నష్టాలకు బ్రేక్‌ పడింది. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు ఇంట్రాడేలో సూచీలపై ప్రభావం చూపాయి.

ఉదయం సెన్సెక్స్‌ (Sensex) 66,063.72 దగ్గర స్వల్ప లాభాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 66,256.20 దగ్గర గరిష్ఠాన్ని, 65,906.65 వద్ద కనిష్ఠాన్ని నమోదు చేసింది. చివరకు 204.16 పాయింట్లు లాభపడి 66,174.20 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ (Nifty) 19,844.65 దగ్గర ప్రారంభమై ఇంట్రాడేలో 19,916.85- 19,800 మధ్య కదలాడింది. చివరకు 95 పాయింట్లు పెరిగి 19,889.70 దగ్గర ముగిసింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.34 వద్ద నిలిచింది.

సెన్సెక్స్‌ (Sensex)30 సూచీలో టాటా మోటార్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, భారతీ ఎయిర్‌టెల్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఎన్‌టీపీసీ, టైటన్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఎంఅండ్‌ఎం, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఎస్‌బీఐ, టెక్‌ మహీంద్రా షేర్లు లాభాల్లో ఉన్నాయి. హెచ్‌యూఎల్‌, సన్‌ఫార్మా, ఐటీసీ, పవర్‌గ్రిడ్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎల్‌అండ్‌టీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ షేర్లు మాత్రమే నష్టాల్లో స్థిరపడ్డాయి.

మార్కెట్‌లోని ఇతర విషయాలు..

☛ సహజ వాయువులో హరిత ఉదజనిని కలిపే పైలట్‌ ప్రాజెక్టును అదానీ టోటల్‌ గ్యాస్‌ అహ్మదాబాద్‌లో ప్రారంభించింది. ఈ నేపథ్యంలో కంపెనీ స్టాక్‌ ఈరోజు 20 శాతం పెరిగి రూ.644.20 దగ్గర అప్పర్‌ సర్క్యూట్‌ని తాకింది. ఈరోజు అదానీ గ్రూప్‌ షేర్లన్నీ రాణించడమూ ఈ కంపెనీ స్టాక్‌ ర్యాలీకి దోహదం చేసింది.

☛ పెట్రోనెట్‌ ఎల్ఎన్‌జీకి చెందిన 35 లక్షల షేర్లు ఈరోజు చేతులు మారాయి. కంపెనీ షేరు ఈరోజు 0.61 శాతం పెరిగి రూ.196.50 దగ్గర స్థిరపడింది.

☛ యునైటెడ్‌ బ్రూవరీస్‌ లిమిటెడ్‌.. డ్రాట్‌ బీర్‌ మార్కెట్‌లోకీ ప్రవేశించింది. కంపెనీ షేరు 1.63 శాతం పెరిగి రూ.1,610కి చేరింది.

☛ పదేళ్ల ఇన్‌ఫ్రా బాండ్ల ద్వారా బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా రూ.5,000 కోట్లు సమీకరించాలని యోచిస్తోంది. బ్యాంక్‌ షేరు ఈరోజు 1.84 శాతం పెరిగి రూ.196.65 దగ్గర స్థిరపడింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు