Stock Market: ఆర్‌బీఐ ఎఫెక్ట్‌.. తొలిసారి 21,000 మార్క్‌ అందుకున్న నిఫ్టీ!

Stock Market Closing bell: సెన్సెక్స్‌ 303.91 పాయింట్లు పుంజుకొని 69,825.60 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ 68.25 పాయింట్లు లాభపడి 20,969.40 వద్ద ముగిసింది.

Published : 08 Dec 2023 16:10 IST

Stock Market Closing bell | ముంబయి: ఏడు రోజుల వరుస ర్యాలీ నుంచి గురువారం విరామం తీసుకున్న దేశీయ స్టాక్‌ మార్కెట్‌ (Stock Market) సూచీలు నేడు తిరిగి పుంజుకున్నాయి. కీలక వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ఆర్‌బీఐ (RBI) ప్రకటించడంతో సూచీలు శుక్రవారం సరికొత్త గరిష్ఠాలను తాకాయి. తర్వాత అమ్మకాల సెగతో ఓ దశలో దాదాపు ఫ్లాట్‌గా మారాయి. తిరిగి కొనుగోళ్ల అండతో వెంటనే పుంజుకొని ఇంట్రాడే గరిష్ఠాలను నమోదు చేశాయి. దీంతో వరుసగా ఆరో వారమూ ప్రధాన సూచీల్లో నికరంగా లాభాలు నమోదయ్యాయి.

సెన్సెక్స్‌ ఉదయం 69,666.38 దగ్గర లాభాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 69,893.80 దగ్గర జీవనకాల గరిష్ఠాన్ని తాకింది. చివరకు 303.91 పాయింట్లు పుంజుకొని 69,825.60 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ 20,934.10 దగ్గర ప్రారంభమై రోజులో 21,006.10 వద్ద ఆల్‌టైం గరిష్ఠాన్ని నమోదు చేసింది. చివరకు 68.25 పాయింట్లు లాభపడి 20,969.40 దగ్గర స్థిరపడింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.38 దగ్గర నిలిచింది.

సెన్సెక్స్‌-30 సూచీలో హెచ్‌సీఎల్‌ టెక్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఇన్ఫోసిస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, విప్రో, యాక్సిస్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, టైటన్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, ఎల్‌అండ్‌టీ, ఎస్‌బీఐ షేర్లు అత్యధికంగా లాభపడ్డ వాటిలో ఉన్నాయి. ఐటీసీ, ఎంఅండ్‌ఎం, బజాజ్‌ ఫైనాన్స్‌, టాటా మోటార్స్‌, నెస్లే ఇండియా, ఏషియన్‌ పెయింట్స్‌, టాటా స్టీల్‌, పవర్‌గ్రిడ్‌, మారుతీ, సన్‌ఫార్మా, రిలయన్స్‌ షేర్లు నష్టపోయాయి.

వరుసగా ఐదోసారీ రెపోరేటును 6.5 శాతం దగ్గర యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ఆర్‌బీఐ శుక్రవారం ప్రకటించింది. ఈ ప్రకటన వెలువడిన వెంటనే సూచీలు భారీగా పుంజుకున్నాయి. మరోవైపు ఈ ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు అంచనాలను 6.5 శాతం నుంచి 7 శాతానికి ఆర్‌బీఐ పెంచడం కూడా మార్కెట్లకు సానుకూలంగా మారింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని