Stock Market Crash: ‘షాక్‌’ మార్కెట్‌.. రూ.30 లక్షల కోట్ల సంపద ఉఫ్‌!

Stock Market Crash: సెన్సెక్స్‌ 4,390 పాయింట్ల నష్టంతో 72,079 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 1,379 పాయింట్లు నష్టపోయి 21,884 వద్ద నిలిచింది.

Published : 04 Jun 2024 16:01 IST

Stock Market Crash | ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ (Stock Market) సూచీలు మంగళవారం అల్లకల్లోలమయ్యాయి. బేర్‌ పంజాకు మదుపర్లు విలవిల్లాడారు. దలాల్‌ స్ట్రీట్‌ చరిత్రలోనే ఒకరోజు అతిపెద్ద నష్టాలు నమోదయ్యాయి. ఫలితం చూస్తుండగానే మదుపర్ల సంపద రూ.30 లక్షల కోట్లు తుడిచిపెట్టుకుపోయింది.

ఆరంభంలోనే బేర్‌ గుప్పిట్లో చిక్కిన స్టాక్‌ సూచీలు (Stock Market) ఏ దశలోనూ బయటకు రాలేకపోయాయి. సమయం గడుస్తున్న కొద్దీ మరింత దిగజారుతూ మదుపర్లను వణికించాయి. సెన్సెక్స్‌ ఉదయం 2,000 పాయింట్లకు పైగా నష్టంతో 76,285.78 వద్ద ప్రారంభమైంది. ఇంట్రాడేలో రికార్డు స్థాయిలో 6,000 పాయింట్లకు పైగా కుంగి 70,234 వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరకు 4,390 పాయింట్ల నష్టంతో 72,079 వద్ద స్థిరపడింది. నిఫ్టీ ఇంట్రాడేలో దాదాపు 1,900 పాయింట్ల వరకు కుంగి 21,281 దగ్గర దిగువ స్థాయికి చేరింది. చివరకు 1,379 పాయింట్లు నష్టపోయి 21,884 వద్ద నిలిచింది.

సెన్సెక్స్‌-30 సూచీలో హెచ్‌యూఎల్‌, నెస్లే ఇండియా, టీసీఎస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఏషియన్‌ పెయింట్స్‌, సన్‌ ఫార్మా షేర్లు మాత్రమే లాభాల్లో స్థిరపడ్డాయి. ఎన్టీపీసీ, ఎస్‌బీఐ, పవర్‌గ్రిడ్‌, టాటా స్టీల్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, రిలయన్స్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌ షేర్లు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి.

దెబ్బకొట్టిన అంచనాలు..

ఎన్నికల ఫలితాల ట్రెండ్స్‌ ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలకు కాస్త భిన్నంగా ఉన్న విషయం తెలిసిందే. అధికారం విషయంలో ఎన్డీయే కూటమికి మెజారిటీ మార్క్‌ దాటినప్పటికీ.. సీట్ల విషయంలో మాత్రం లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. ఎగ్జిట్‌ పోల్స్‌ అన్నీ ఎన్డీయే దాదాపు 350 స్థానాల వరకు గెలుస్తుందని అంచనా వేశాయి. కానీ, వాస్తవంలో ఆ సంఖ్య ఇప్పటివరకు 300కు దిగువనే ఉండడం మదుపర్ల సెంటిమెంటును దెబ్బతీసింది. గత ఎన్నికల్లో ఒంటరిగానే ప్రభుత్వం ఏర్పాటు కావాల్సిన మెజారిటీ సాధించిన భాజపాకు ఈసారి కూటమి అవసరం అనివార్యమైంది. దీంతో సుస్థిర ప్రభుత్వ ఏర్పాటు విషయంలో మదుపర్ల అంచనాలు తప్పాయి. మరోవైపు 150 సీట్లకే పరిమితమవుతుందనుకున్న కాంగ్రెస్‌ నేతృత్వంలోని ఇండియా కూటమి అనూహ్యంగా పుంజుకొని 220 మార్క్‌ దాటడం గమనార్హం. నేటి నష్టాలకు ఇదే ప్రధాన కారణంగా నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాల జోరులో బ్యాంకింగ్‌, ప్రభుత్వ రంగ సంస్థలు సోమవారం భారీగా పుంజుకున్నాయి. నేడు అవన్నీ పెద్దఎత్తున కుంగి సూచీలను బేర్‌ గుప్పిట్లోకి నెట్టాయి. ఎస్‌బీఐ, ఎన్‌టీపీసీ, పవర్‌గ్రిడ్‌, టాటా స్టీల్‌, రిలయన్స్‌ వంటి బడా సంస్థలు భారీగా నష్టపోవడం మార్కెట్లను ఎరుపెక్కించాయి. అదానీ గ్రూప్‌ స్టాక్స్‌ అన్నీ భారీ నష్టాల్లో ముగియడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని