Share Market: మళ్లీ 22,400 పైకి నిఫ్టీ

ఆఖరి గంటన్నర ట్రేడింగ్‌లో మదుపర్ల కొనుగోళ్ల జోరుతో గురువారం సూచీలు లాభాల్లో ముగిశాయి. సానుకూల అంతర్జాతీయ సంకేతాల అండతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌ షేర్లు మార్కెట్లను నడిపించాయి.

Published : 17 May 2024 04:09 IST

సమీక్ష

ఆఖరి గంటన్నర ట్రేడింగ్‌లో మదుపర్ల కొనుగోళ్ల జోరుతో గురువారం సూచీలు లాభాల్లో ముగిశాయి. సానుకూల అంతర్జాతీయ సంకేతాల అండతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌ షేర్లు మార్కెట్లను నడిపించాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 4 పైసలు తగ్గి 83.50 వద్ద ముగిసింది. బ్యారెల్‌ ముడిచమురు 0.33% తగ్గి 82.45 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

సెన్సెక్స్‌ ఉదయం 73,338.24 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. మదుపర్ల లాభాల స్వీకరణతో ఇంట్రాడేలో 72,529.97 పాయింట్ల వద్ద కనిష్ఠానికి పడిపోయింది. ఆఖర్లో పుంజుకుని లాభాల్లోకి వచ్చిన సెన్సెక్స్‌, 676.69 పాయింట్ల లాభంతో 73,663.72 వద్ద ముగిసింది. నిఫ్టీ 203.30 పాయింట్లు పెరిగి 22,403.85 దగ్గర స్థిరపడింది.

 • మెరుగైన త్రైమాసిక ఫలితాలు ప్రకటించడంతో ఒబెరాయ్‌ రియాల్టీ షేరు ఇంట్రాడేలో 9.83% పెరిగి రూ.1,730 వద్ద 52 వారాల గరిష్ఠాన్ని తాకింది. చివరకు 8.77% లాభంతో రూ.1,713.30 వద్ద ముగిసింది.
 • సెన్సెక్స్‌ 30 షేర్లలో 25 పరుగులు తీశాయి. ఎం అండ్‌ ఎం 3.05%, టెక్‌ మహీంద్రా 2.66%, భారతీ ఎయిర్‌టెల్‌ 2.53%, ఇన్ఫోసిస్‌ 2.26%, టైటన్‌ 2.17%, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ 1.79%, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ 1.72%, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 1.48%, ఎల్‌ అండ్‌ టీ 1.45%, విప్రో 1.36% లాభపడ్డాయి. మారుతీ, టాటా మోటార్స్‌, ఎస్‌బీఐ, పవర్‌గ్రిడ్‌ 2% వరకు నష్టపోయాయి. రంగాల వారీ సూచీల్లో.. యంత్ర పరికరాలు 2.05%, పరిశ్రమలు 1.99%, టెక్‌ 1.66%, స్థిరాస్తి 1.59%, ఐటీ 1.55%, టెలికాం 0.99%, ఆరోగ్య సంరక్షణ 0.70% మెరిశాయి. బీఎస్‌ఈలో 2040 షేర్లు లాభాల్లో ముగియగా, 1798 స్క్రిప్‌లు నష్టపోయాయి. 114 షేర్లలో ఎటువంటి మార్పు లేదు.
 • ఫ్లెక్సిబుల్‌ వర్క్‌స్పేస్‌ సొల్యూషన్స్‌ అందించే ఆఫిస్‌ స్పేస్‌ సొల్యూషన్స్‌ ఐపీఓ ఈనెల 22న ప్రారంభమై 27న ముగియనుంది. ధరల శ్రేణిగా రూ.364-383 నిర్ణయించారు. గరిష్ఠ ధర వద్ద కంపెనీ రూ.599 కోట్లు సమీకరించనుంది. యాంకర్‌ మదుపర్లు 21న బిడ్లు దాఖలు చేసుకోవచ్చు. రిటైల్‌ మదుపర్లు కనీసం 39 షేర్లకు దరఖాస్తు చేసుకోవాలి.
 • గో డిజిట్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ ఐపీఓ రెండో రోజుకు 79% స్పందన లభించింది. ఇష్యూలో భాగంగా 5,28,69,677 షేర్లను ఆఫర్‌ చేయగా, 4,17,43,735 షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి.
 • ఎస్సార్‌ గ్రూపునకు చెందిన మహాన్‌ సిపాత్‌ ట్రాన్స్‌మిషన్‌ ఆస్తులను రూ.1,900 కోట్లకు కొనుగోలు చేయడాన్ని పూర్తి చేసినట్లు అదానీ ఎనర్జీ సొల్యూషన్స్‌ వెల్లడించింది.
 • నార్వే సంస్థ ఎల్కెమ్‌ ఏఎస్‌ఏకు ఆర్‌ఈసీ సోలార్‌ నార్వే ఏఎస్‌ను 22 మిలియన్‌ డాలర్లకు విక్రయించడాన్ని పూర్తి చేసినట్లు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ తెలిపింది.
 • భారతీ గ్రూప్‌నకు చెందిన 4 వాణిజ్య ఆస్తుల్లో 50% వాటాను బ్రూక్‌ఫీల్డ్‌ ఇండియా రియల్‌ ఎస్టేట్‌ ట్రస్ట్‌ కొనుగోలు చేయనుంది. దిల్లీ, గురుగ్రామ్‌లలో ఉన్న ఈ వాణిజ్య సముదాయాల  విస్తీర్ణం 33 లక్షల చదరపు అడుగులు. ఇందుకు ఎంటర్‌ప్రైజ్‌ విలువగా రూ.6,000 కోట్లు నిర్ణయించారు.  
 • సెక్యూరిటీల జారీ ద్వారా రూ.8,500 కోట్ల వరకు సమీకరించేందుకు వేదాంతా బోర్డు ఆమోదం తెలిపింది. అమెరికన్‌ డిపాజిటరీ రిసీట్స్‌, గ్లోబల్‌ డిపాజిటరీ రిసీట్స్‌, విదేశీ కరెన్సీ కన్వెర్టబుల్‌ బాండ్ల ద్వారా కంపెనీ నిధులు సమీకరించనుంది. ఇందుకు నియంత్రణ సంస్థల అనుమతులు లభించాల్సి ఉంటుంది.
 • దశలవారీగా 1000 ఇ-సీ3 విద్యుత్‌ కార్లను సరఫరా చేసేందుకు ఓహెచ్‌ఎం ఇ లాజిస్టిక్స్‌తో అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకున్నట్లు ఫ్రాన్స్‌ వాహన సంస్థ సిట్రోయెన్‌ వెల్లడించింది.
 • తమ ప్రభుత్వ పెన్షన్‌ ఫండ్‌ నుంచి అదానీ పోర్ట్స్‌ సహా మూడు కంపెనీలను తొలగించాలని ఎగ్జిక్యూటివ్‌ బోర్డు నిర్ణయించిందని నార్వే కేంద్ర బ్యాంక్‌ వెల్లడించింది. అదానీ పోర్ట్స్‌తో పాటు ఎల్‌3 హ్యారిస్‌ టెక్నాలజీస్‌, చైనా సంస్థ వీచాయ్‌ పవర్‌ ఇందులో ఉన్నాయి. నైతిక పరమైన అంశాలే ఇందుకు కారణమని పేర్కొంది.
 • రాబోయే స్పెక్ట్రమ్‌ వేలం కోసం రిలయన్స్‌ జియో అత్యధికంగా రూ.3000 కోట్లు డిపాజిట్‌ చేసింది. ఎయిర్‌టెల్‌ రూ.1050 కోట్లు, వొడాఫోన్‌ ఐడియా రూ.300 కోట్లు చొప్పున డిపాజిట్‌ చేసినట్లు టెలికాం విభాగం (డాట్‌) వెల్లడించింది.

నేటి బోర్డు సమావేశాలు: ఎన్‌హెచ్‌పీసీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, రైల్‌ వికాస్‌ నిగమ్‌, బంధన్‌ బ్యాంక్‌, గోద్రేజ్‌ ఇండస్ట్రీస్‌, ఫైజర్‌, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని