Stock Market: సెన్సెక్స్‌ 76000ను తాకి.. వెనక్కి

సెన్సెక్స్‌ చరిత్రలో తొలిసారిగా 76,000 పాయింట్ల శిఖరాన్ని సోమవారం అందుకుంది. నిఫ్టీ కూడా జీవనకాల తాజా గరిష్ఠాన్ని తాకింది. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వచ్చేవారం వెలువడనున్న నేపథ్యంలో, సూచీల గరిష్ఠ స్థాయుల్లో మదుపర్లు లాభాలు స్వీకరణకే మొగ్గుచూపారు.

Updated : 28 May 2024 02:48 IST

సెన్సెక్స్‌ చరిత్రలో తొలిసారిగా 76,000 పాయింట్ల శిఖరాన్ని సోమవారం అందుకుంది. నిఫ్టీ కూడా జీవనకాల తాజా గరిష్ఠాన్ని తాకింది. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వచ్చేవారం వెలువడనున్న నేపథ్యంలో, సూచీల గరిష్ఠ స్థాయుల్లో మదుపర్లు లాభాలు స్వీకరణకే మొగ్గుచూపారు. ఫలితంగా ఆరంభ లాభాలు హరించుకుపోయి, సూచీలు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. రిలయన్స్, ఐటీసీ షేర్లు నష్టపోయాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 3 పైసలు తగ్గి  83.13 వద్ద ముగిసింది. బ్యారెల్‌ ముడిచమురు 82.44 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఆసియా, ఐరోపా మార్కెట్లు మెరిశాయి.

 

 • ఈ ఏడాది ఏప్రిల్‌ 9న సెన్సెక్స్‌ 75,000 మార్కును అధిగమించింది. అక్కడ నుంచి 31 ట్రేడింగ్‌ రోజుల్లో 1000 పాయింట్లు పెరిగి 76,000 పాయింట్లకు చేరింది. 
 • సెన్సెక్స్‌ ఉదయం 75,655.46 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. అదే జోరులో 76,009.68 వద్ద జీవనకాల గరిష్ఠాన్ని నమోదుచేసింది. మధ్యాహ్నం తర్వాత లాభాల స్వీకరణతో నష్టాల్లోకి జారుకుని, 75,175.27 వద్ద కనిష్ఠానికి పడిపోయింది. చివరకు 19.89 పాయింట్ల నష్టంతో 75,390.50 వద్ద ముగిసింది. నిఫ్టీ 24.65 పాయింట్లు తగ్గి 22,932.45 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 23,110.80 పాయింట్ల వద్ద రికార్డు గరిష్ఠాన్ని తాకింది.
 • సెన్సెక్స్‌ సూచీలోకి చేరనున్న నేపథ్యంలో అదానీ పోర్ట్స్‌ షేరు ఇంట్రాడేలో 2.93% పెరిగి రూ.1,457.25 వద్ద 52 వారాల గరిష్ఠాన్ని తాకింది. చివరకు 1.13% లాభంతో రూ.1,431.75 వద్ద ముగిసింది.
 • ఆకర్షణీయ త్రైమాసిక ఫలితాలతో అశోక్‌ లేలాండ్‌ షేరు 7.69% దూసుకెళ్లి రూ.226.75 దగ్గర స్థిరపడింది. 
 • సెన్సెక్స్‌ 30 షేర్లలో 18 డీలాపడ్డాయి. విప్రో 2.36%, ఎన్‌టీపీసీ 1.40%, సన్‌ఫార్మా 1.34%, ఎం అండ్‌ ఎం 1.25%, ఐటీసీ 1.05%, రిలయన్స్‌ 0.92% నష్టపోయాయి. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 1.65%, యాక్సిస్‌ బ్యాంక్‌ 1.11%, బజాజ్‌ ఫైనాన్స్‌ 0.81%, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 0.75%, ఎల్‌ అండ్‌ టీ 0.69% లాభపడ్డాయి. 
 • ఆఫిస్‌ స్పేస్‌ సొల్యూషన్స్‌ ఐపీఓ చివరి రోజు 108.17 రెట్ల స్పందన లభించింది. ఇష్యూలో భాగంగా 86,29,670 షేర్లను ఆఫర్‌ చేయగా, 93,34,36,374 షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. రిటైల్‌ మదుపర్ల నుంచి 53.23 రెట్ల స్పందన లభించింది. 
 • బోనస్‌ షేర్ల కేటాయింపునకు రికార్డు తేదీగా జూన్‌ 21ను హెచ్‌పీసీఎల్‌ ప్రకటించింది. రూ.10 ముఖ విలువ కలిగిన ప్రతి 2 షేర్లకు ఒక షేరును బోనస్‌గా ఇస్తామని సంస్థ ఇటీవల వెల్లడించిన సంగతి విదితమే. 
 • నజారా టెక్నాలజీస్‌ ప్రమోటర్‌ మిట్టర్‌ ఇన్ఫోటెక్, కంపెనీలో 6.38% వాటాకు సమానమైన 48.8 లక్షల షేర్లను విక్రయించినట్లు తెలిపింది. ప్రస్తుత పెట్టుబడిదారు ప్లూటస్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ ఈ వాటాను కొనుగోలు చేసినట్లు వెల్లడించింది.
 • చెన్నైలో తమ తొలి విద్యుత్‌ వాహన (ఈవీ) వేగవంత ఛార్జింగ్‌ స్టేషన్‌ను హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా ప్రారంభించింది.  
 • బ్రిటన్‌ సంస్థకు హైబ్రిడ్‌ ఎస్‌ఓవీలను అందించేందుకు 60 మిలియన్‌ యూరోల ఆర్డరును అందుకున్నట్లు కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ ప్రకటించింది.
 • వచ్చే 5 ఏళ్లలో ఈక్విటీ మూలధనాన్ని నాలుగు రెట్లు అధికంగా రూ.10,000 కోట్లకు పెంచుకునేందుకు స్థిరాస్తి సంస్థ శోభా చూస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రైట్స్‌ ఇష్యూ ద్వారా రూ.2000 కోట్లు సమీకరించాలని కంపెనీ భావిస్తోంది.

నేటి బోర్డు సమావేశాలు: ఐఆర్‌సీటీసీ, అమరరాజా ఎనర్జీ అండ్‌ మొబిలిటీ, మెడ్‌ప్లస్‌ హెల్త్‌ సర్వీసెస్, ఎంటార్‌ టెక్నాలజీస్, జీవీకే పవర్‌ అండ్‌ ఇన్‌ఫ్రా ప్రెస్టీజ్‌ ఎస్టేట్స్, జీఐసీ, బ్రిగేడ్‌ ఎంటర్‌ప్రైజెస్, ఆదిత్య బిర్లా ఫ్యాషన్‌ అండ్‌ రిటైల్, ఈఐహెచ్, ఎన్‌బీసీసీ (ఇండియా), రైట్స్, ఇంజినీర్స్‌ ఇండియా, ఎంఎంటీసీ, మిశ్ర ధాతు నిగమ్, వోఖార్డ్, జేఎస్‌డబ్ల్యూ హోల్డింగ్స్, యునిటెక్, రామ్‌కో ఇండస్ట్రీస్‌.


ఎన్‌ఎస్‌ఈ టిక్‌ సైజ్‌ తగ్గింపు

రూ.250 కంటే తక్కువ విలువ కలిగిన అన్ని షేర్ల టిక్‌ సైజ్‌ను నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ (ఎన్‌ఎస్‌ఈ) తగ్గించింది. ఇంతకు ముందు ఇది 5 పైసలుగా ఉండగా, దాన్ని ఒక పైసా చేసింది. ఈ మార్పులు జూన్‌ 10 నుంచి అమల్లోకి రానున్నాయి. నగదు లభ్యతను పెంచడం, మెరుగైన ధరల మార్పుల ద్వారా కచ్చితత్వం కోసమే ఎన్‌ఎస్‌ఈ ఈ నిర్ణయం తీసుకుంది. రూ.250 కంటే తక్కువ ధర కలిగిన ఈక్యూ, బీఈ, బీజడ్, బీఓ, ఆర్‌ఎల్, ఏఎఫ్‌ సిరీస్‌ షేర్ల (ఈటీఎఫ్‌ మినహా)కు ఈ మార్పులు వర్తిస్తాయని ఎన్‌ఎస్‌ఈ పేర్కొంది.

మార్పు ఇలా: బిడ్‌ (కొనుగోలు), ఆఫర్‌ (అమ్మకం) ధరల్లో వచ్చే కనీస మార్పును టిక్‌ సైజ్‌గా పరిగణిస్తారు. టిక్‌ సైజ్‌ తక్కువగా ఉండటం ద్వారా మదుపర్లకు మెరుగైన ధర లభిస్తుంది. ఉదాహరణకు.. ఒక షేరు టిక్‌ సైజ్‌ రూ.0.10గా ఉండి, చివరి ట్రేడింగ్‌ ధర (ఎల్‌టీపీ) రూ.50 అనుకుందాం. అప్పుడు కొనుగోలుకు బిడ్‌ దాఖలు చేయాలంటే, ధరలు రూ.49.90, రూ.49.80, రూ.49.70గా ఉంటాయి. టిక్‌ సైజ్‌ రూ.0.10 కాబట్టి, రూ.49.85 లేదా రూ.49.92 బిడ్‌ ధరలను అనుమతించరు. ఇప్పుడు ఇది పైసా కనుక, ఆ మేరకు షేరు ధర పెంచుతూ, బిడ్‌ వేయొచ్చు. టిక్‌ సైజు ప్రతినెలా మారుతూ ఉంటుందని ఎన్‌ఎస్‌ఈ తెలిపింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని