Stock Market: నష్టాల్లో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. 20,900 దిగువకు నిఫ్టీ

Stock Market Opening bell | ఉదయం 9:28 గంటల సమయంలో సెన్సెక్స్‌ 319 పాయింట్లు నష్టపోయి 69,333 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 84 పాయింట్లు కుంగి 20,853 దగ్గర కొనసాగుతోంది.

Updated : 07 Dec 2023 09:53 IST

Stock Market Opening bell | ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ (Stock Market) సూచీలు గురువారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. గత కొన్ని రోజుల వరుస ర్యాలీల నేపథ్యంలో ఆరంభంలోనే లాభాల స్వీకరణ ప్రభావం కనిపిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు కూడా సూచీలపై ప్రభావం చూపుతున్నాయి. ఉదయం 9:28 గంటల సమయంలో సెన్సెక్స్‌ 319 పాయింట్లు నష్టపోయి 69,333 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 84 పాయింట్లు కుంగి 20,853 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.36 వద్ద ప్రారంభమైంది.

సెన్సెక్స్‌-30 సూచీలో అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, పవర్‌గ్రిడ్‌, ఏషియన్‌ పెయింట్స్‌, ఎన్‌టీపీసీ, టెక్‌ మహీంద్రా, హెచ్‌సీఎల్‌ టెక్‌, మారుతీ, విప్రో, టీసీఎస్‌ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. హెచ్‌యూఎల్‌, భారతీ ఎయిర్‌టెల్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎంఅండ్‌ఎం, టాటా మోటార్స్, యాక్సిస్‌ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, ఐటీసీ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. 

అమెరికా మార్కెట్లు (Stock Market) బుధవారం నష్టాల్లో ముగిశాయి. అక్కడి ఇంధన రంగ షేర్లతో పాటు లార్జ్‌క్యాప్‌ స్టాక్స్‌లో అమ్మకాలు సూచీలను కుంగదీశాయి. అక్కడి నుంచి ప్రతికూల సంకేతాలు అందుకున్న ఆసియా మార్కెట్లు నేడు ట్రేడింగ్‌ ఆరంభం నుంచే నష్టాలను చవిచూస్తున్నాయి. దేశీయంగా చూస్తే.. ఆర్‌బీఐ ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష సమావేశం బుధవారం ప్రారంభమైంది. దీనిలోని నిర్ణయాలను ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ శుక్రవారం వెల్లడించనున్నారు. ఈసారి కూడా కీలక రేట్లు యథాతథంగా కొనసాగించొచ్చనే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ పరిణామాలపై మదుపర్లు దృష్టి సారించే అవకాశం ఉంది.

విదేశీ సంస్థాగత మదుపర్లు (FII) బుధవారం రూ.79.88 కోట్లు విలువ చేసే భారత ఈక్విటీలను విక్రయించారు. గత పది రోజుల్లో ఎఫ్‌ఐఐలు నికర విక్రయదారులుగా నిలవడం ఇదే తొలిసారి. అదే సమయంలో దేశీయ సంస్థాగత మదుపర్లు (DII) రూ.1,372.18 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు మరింత దిగొచ్చాయి. బ్యారెల్‌ బ్రెంట్‌ చమురు ధర గురువారం ఉదయం 74.63 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు