Stock Market: లాభాల్లో దేశీయ సూచీలు.. 18,350 పైకి నిఫ్టీ

Stock Market: ఉదయం 9:20 గంటల సమయంలో సెన్సెక్స్‌ (Sensex) 131 పాయింట్ల లాభంతో 62,004 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ (Nifty) 33 పాయింట్లు లాభపడి 18,354 దగ్గర కొనసాగుతోంది.

Published : 26 May 2023 09:30 IST

ముంబయి: అంతర్జాతీయ మార్కెట్లలోని మిశ్రమ సంకేతాల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్‌ (Stock Market) సూచీలు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:20 గంటల సమయంలో సెన్సెక్స్‌ (Sensex) 131 పాయింట్ల లాభంతో 62,004 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ (Nifty) 33 పాయింట్లు లాభపడి 18,354 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.72 దగ్గర ప్రారంభమైంది. సెన్సెక్స్‌ 30 సూచీలో ఎన్‌టీపీసీ, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఎంఅండ్‌ఎం, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, టెక్‌ మహీంద్రా, మారుతీ, బజాజ్‌ ఫైనాన్స్‌, రిలయన్స్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఇన్ఫోసిస్‌ షేర్లు లాభాల్లో ఉన్నాయి. పవర్‌గ్రిడ్‌, సన్‌ఫార్మా, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, నెస్లే ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

అమెరికా మార్కెట్లు గురువారం మిశ్రమంగా ముగిశాయి. నాస్డాక్‌, ఎస్‌అండ్‌పీ 500 లాభాలు నమోదు చేయగా.. డోజోన్స్‌ సూచీ నష్టపోయింది. ఆసియా-పసిఫిక్‌ సూచీలు సైతం నేడు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో జర్మనీ ఆర్థిక వ్యవస్థ 0.3 శాతం క్షీణించింది. 2022 చివరి త్రైమాసికంలోనూ జర్మనీ వృద్ధి 0.5 శాతం క్షీణించింది. ఫలితంగా ఐరోపాలోని ఈ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక మాంద్యంలోకి జారుకున్నట్లయింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు దిగొచ్చాయి. బ్రెంట్‌ బ్యారెల్‌ చమురు ధర 75.86 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. విదేశీ సంస్థాగత మదుపర్లు గురువారం రూ.589 కోట్లు విలువ చేసే భారత ఈక్విటీలను కొనుగోలు చేశారు. అదే సమయంలో దేశీయ మదుపర్లు రూ.338 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు.

గమనించాల్సిన స్టాక్స్‌..

నవ లిమిటెడ్‌: విద్యుత్తు, ఫెర్రో అల్లాయ్స్‌ ఉత్పత్తితో పాటు మైనింగ్‌ కార్యకలాపాలు నిర్వహించే సంస్థ నవ లిమిటెడ్‌, ఏకీకృత ఖాతాల ప్రకారం గత ఆర్థిక సంవత్సరానికి రికార్డు స్థాయిలో రూ.1,222 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. అదే సమయంలో టర్నోవర్‌ రూ.3,928 కోట్లుగా నమోదైంది. 2021-22తో పోల్చితే ఆదాయం 7.8%, నికరలాభం 113% పెరిగాయి. ఆకర్షణీయ ఫలితాల నేపథ్యంలో వాటాదార్లకు 300% డివిడెండ్‌ చెల్లించాలని కంపెనీ డైరెక్టర్ల బోర్డు ప్రతిపాదించింది.

మాస్‌చిప్‌ టెక్నాలజీస్‌: ఏకీకృత ఖాతాల ప్రకారం మార్చి త్రైమాసికానికి రూ.54 కోట్ల ఆదాయాన్ని, రూ.1.52 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. 2021-22 ఇదేకాలంలో ఆదాయం రూ.38 కోట్లు, నికరలాభం రూ.1.01 కోట్లు ఉన్నాయి.

మెడ్‌ప్లస్‌ హెల్త్‌ సర్వీసెస్‌: ఏకీకృత ఖాతాల ప్రకారం మార్చి త్రైమాసికానికి రూ.1,266.67 కోట్ల ఆదాయాన్ని, రూ.26.52 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. 2021-22 ఇదేకాలంలో ఆదాయం రూ.978.95 కోట్లు, నికరలాభం రూ.11.61 కోట్లు ఉన్నాయి. దీంతో పోల్చితే ఈసారి ఆదాయం, నికరలాభం ఆకర్షణీయంగా పెరిగాయి.

సువెన్‌ ఫార్మా: మార్చి త్రైమాసికానికి ఏకీకృత ఖాతాల ప్రకారం రూ.380.75 కోట్ల ఆదాయాన్ని, రూ.123.97 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. త్రైమాసిక ఈపీఎస్‌ రూ.4.87గా నమోదైంది. 2021-22 ఇదేకాలంలో ఆదాయం రూ.380.71 కోట్లు, నికరలాభం రూ.91.66 కోట్లు ఉన్నాయి. దీంతో పోల్చితే ఆదాయం స్థిరంగా ఉన్నా లాభం పెరిగింది.

పోకర్ణ లిమిటెడ్‌: మార్చి త్రైమాసికానికి ఏకీకృత ఖాతాల ప్రకారం రూ.165.29 కోట్ల ఆదాయాన్ని, రూ.10.68 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. 2021-22 ఇదేకాలంలో ఆదాయం రూ.209.05 కోట్లు, నికరలాభం రూ. 20.10 కోట్లు ఉన్నాయి. దీంతో పోల్చితే నికరలాభం సగానికి తగ్గింది.

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌: లోటస్‌ చాకొలెట్‌లో నియంత్రిత 51% వాటా కొనుగోలు చేయడాన్ని పూర్తి చేసినట్లు రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్స్‌ వెల్లడించింది. అనుబంధ సంస్థ రిలయన్స్‌ కన్జూమర్‌ ప్రోడక్ట్స్‌ మే 24 నుంచి లోటస్‌ చాకొలెట్‌పై నియంత్రణ చేపట్టినట్లు వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని