Stock Market: లాభాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. 20,000 చేరువలో నిఫ్టీ

Stock Market Opening bell: ఉదయం 9:27 గంటల సమయంలో సెన్సెక్స్‌ (Sensex) 343 పాయింట్ల లాభంతో 66,517 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ (Nifty) 104 పాయింట్లు పెరిగి 19,993 దగ్గర కొనసాగుతోంది.

Published : 29 Nov 2023 09:39 IST

Stock Market Opening bell | అంతర్జాతీయ మార్కెట్లలోని మిశ్రమ సంకేతాల మధ్య దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:27 గంటల సమయంలో సెన్సెక్స్‌ (Sensex) 343 పాయింట్ల లాభంతో 66,517 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ (Nifty) 104 పాయింట్లు పెరిగి 19,993 వద్ద కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.32 దగ్గర ప్రారంభమైంది.

సెన్సెక్స్‌ 30 సూచీలో పవర్‌గ్రిడ్‌, సన్‌ఫార్మా, మారుతీ షేర్లు మాత్రమే నష్టాల్లో ఉన్నాయి. భారతీ ఎయిర్‌టెల్‌, టెక్‌ మహీంద్రా, విప్రో, హెచ్‌సీఎల్‌ టెక్‌, టీసీఎస్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఎంఅండ్‌ఎం, ఇన్ఫోసిస్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, రిలయన్స్‌, టైటన్‌, ఎల్‌అండ్‌టీ, ఐటీసీ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.

వడ్డీరేట్లను ఇప్పట్లో మరింత పెంచాల్సిన అవసరం కనిపించడం లేదని అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌కు చెందిన ఓ ఉన్నతాధికారి మంగళవారం వ్యాఖ్యానించారు. దీంతో అక్కడి సూచీలు లాభాల్లో ముగిశాయి. ఐరోపా మార్కెట్లు మాత్రం నష్టాల్లో స్థిరపడ్డాయి. ఆసియా-పసిఫిక్‌ మార్కెట్లు నేడు ప్రతికూలంగా ప్రారంభమయ్యాయి. నవంబర్‌లో ఇప్పటి వరకు డెట్‌ మార్కెట్లో ఎఫ్‌పీఐల పెట్టుబడులు రూ.12,400 కోట్ల వద్ద రెండేళ్ల గరిష్ఠానికి చేరాయి. 2024 చమురు ఉత్పత్తి లక్ష్యాలపై చర్చించేందుకు ఒపెక్‌+ గురువారం వర్చువల్‌ సమావేశం నిర్వహించనుంది. ముడి చమురు ధరలు మంగళవారం రెండు శాతానికి పైగా పెరిగాయి. బ్యారెల్‌ బ్రెంట్‌ చమురు ధర 82.05 డాలర్లకు చేరింది. విదేశీ సంస్థాగత మదుపర్లు (FII) మంగళవారం రూ.783 కోట్లు విలువ చేసే భారత ఈక్విటీలను కొనుగోలు చేశారు. దేశీయ మదుపర్లు (DII) సైతం రూ.1,324 కోట్లు విలువ చేసే స్టాక్స్‌ను కొన్నారు.

గమనించాల్సిన స్టాక్స్‌..

  • ఐఆర్‌ఈడీఏ: ఇటీవలే ఐపీఓకి వచ్చిన ఈ ప్రభుత్వం రంగ కంపెనీ షేర్లు ఈ రోజు స్టాక్ ఎక్స్చేంజీల్లో లిస్ట్‌ కానున్నాయి. రూ.32 ఇష్యూ ధర వద్ద ఈ కంపెనీ ఐపీఓకి వచ్చిన విషయం తెలిసిందే.
  • పీసీబీఎల్‌: రూ.3,800 కోట్లతో ఆక్వాఫామ్‌ కెమికల్స్ కొనుగోలుకు పీసీబీఎల్‌ బోర్డు ఆమోదం తెలిపింది.
  • కెనరా బ్యాంక్‌: అనుబంధ సంస్థ కెన్‌బ్యాంక్‌ ఫ్యాక్టర్స్‌లో 70 శాతం వాటాలను ఉపసంహరించుకునేందుకు ఆర్‌బీఐ ఆమోదం తెలిపింది. అలాగే బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, డీబీఎస్‌ బ్యాంక్‌ ఇండియా, కెన్‌బ్యాంక్‌ కంప్యూటర్‌ సర్వీసెస్‌లో వాటాలను కొనుగోలు చేయాలని యోచిస్తున్నట్లు కెనరా బ్యాంక్‌ తెలిపింది.
  • హావెల్స్‌ ఇండియా: పశ్చిమాసియా మార్కెట్‌లో తమ కన్జ్యూమర్‌ డ్యూరబుల్‌ బ్రాండ్‌ ‘Lloyd’ను హావెల్స్‌ ఇండియా ప్రవేశపెట్టింది.
  • వరుణ్‌ బెవరేజెస్‌: బెవరేజీల పంపిణీ కోసం వరుణ్‌ బెవరేజెస్‌ మొజాంబిక్‌లో ఓ అనుబంధ సంస్థను ఏర్పాటు చేసింది.
  • TCS: టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) రూ.17,000 కోట్ల విలువైన షేర్లను తిరిగి కొనుగోలు చేసే ప్రక్రియ (బైబ్యాక్‌)ను డిసెంబరు 1 నుంచి 7 వరకు నిర్వహించనుంది. ఈ బైబ్యాక్‌లో మదుపర్ల దగ్గర నుంచి 4.09 కోట్ల షేర్లను (సంస్థలో 1.12 శాతం వాటా) ఒక్కోటి రూ.4,150 చొప్పున కొనుగోలు చేయనుంది. మంగళవారం టీసీఎస్‌ షేరు ముగింపు ధర రూ.3,470.45తో పోలిస్తే, ఈ ధర 20 శాతం ఎక్కువ కావడం గమనార్హం.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని