Stock Market: లాభాల్లో మార్కెట్‌ సూచీలు.. 17,000 ఎగువన నిఫ్టీ

Stock Market: ఉదయం 9:27 గంటల సమయంలో సెన్సెక్స్‌ (Sensex) 143 పాయింట్ల లాభంతో 57,797 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ (Nifty) 33 పాయింట్లు లాభపడి 17,019 దగ్గర కొనసాగుతోంది.

Published : 28 Mar 2023 09:37 IST

ముంబయి: అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాల మధ్య దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:27 గంటల సమయంలో సెన్సెక్స్‌ (Sensex) 143 పాయింట్ల లాభంతో 57,797 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ (Nifty) 33 పాయింట్లు లాభపడి 17,019 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 15 పైసలు పుంజుకొని రూ.82.16 దగ్గర ప్రారంభమైంది. సెన్సెక్స్‌ 30 సూచీలో ఐసీఐసీఐ బ్యాంక్‌, మారుతీ, హెచ్‌సీఎల్‌ టెక్‌, విప్రో, ఎల్‌అండ్‌టీ, టీసీఎస్‌, టాటా స్టీల్‌, రిలయన్స్‌ షేర్లు లాభాల్లో ఉన్నాయి. భారతీ ఎయిర్‌టెల్‌, సన్‌ఫార్మా, టెక్‌ మహీంద్రా, పవర్‌గ్రిడ్‌ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

అమెరికా మార్కెట్లు సోమవారం మిశ్రమంగా ముగిశాయి. అక్కడి టెక్‌ స్టాక్స్‌లో అమ్మకాలు వెల్లువెత్తగా.. బ్యాంకింగ్‌ స్టాక్స్‌లో కొనుగోళ్ల కళ కనిపించింది. ఆసియా- పసిఫిక్‌ సూచీలు లాభాల్లో ట్రేడవుతున్నాయి. దేశీయంగా చూస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు 7 శాతంగా నమోదయ్యే అవకాశం ఉందని ఎస్‌ అండ్‌ పీ గ్లోబల్‌ రేటింగ్స్‌ తెలిపింది. మరోవైపు గురువారం సెలవు కావడంతో వీక్లీ ఎక్స్‌పైరీతో పాటు మంత్లీ ఎక్స్‌పైరీ కూడా రేపే ఉంది. అలాగే ఆర్థిక సంవత్సరం ముగింపు కూడా సూచీలపై ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు విదేశీ మదుపర్లు సోమవారం రూ.890.64 కోట్లు విలువైన భారత ఈక్విటీలను విక్రయించారు. అదే సమయంలో దేశీయ మదుపర్లు రూ.1,808.94 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

గమనించాల్సిన స్టాక్స్‌..

దిలీప్‌ బిల్డ్‌కాన్‌: ఆంధ్రప్రదేశ్‌లోని ఆదిరెడ్డి పల్లె నుంచి మల్లెపల్లె వరకు బెంగళూరు- విజయవాడ ఎకానమిక్‌ కారిడార్‌లో ఆరు వరుసల రోడ్డును నిర్మించేందుక కనిష్ఠ బిడ్డర్‌గా దిలీప్‌ బిల్డ్‌కాన్‌ను ఎన్‌హెచ్‌ఏఐ ఎంపిక చేసింది.

పీఎన్‌సీ ఇన్‌ఫ్రాటెక్‌: ఉత్తర్‌ప్రదేశ్‌లో ఓ కీలక నాలుగు లేన్ల రహదారిని నిర్మించేందుకు పీఎన్‌సీ ఇన్‌ఫ్రాటెక్‌ కనిష్ఠ బిడ్డర్‌గా ఎంపికైంది.

ఎస్‌జీవీఎన్‌: ‘జపాన్‌ బ్యాంక్‌ ఫర్‌ ఇంటర్నేషనల్‌ కోఆపరేషన్‌’ నుంచి ఎస్‌జేవీఎన్‌కు రూ.915 కోట్ల రుణం మంజూరైంది. ఈ నిధులను మధ్యప్రదేశ్‌, గుజరాత్‌లో సోలార్‌ పవర్‌ ప్రాజెక్టుల నిర్మాణానికి వినియోగించనున్నారు.

నెస్లే ఇండియా: ఏప్రిల్‌ 12న సమావేశమై మధ్యంతర డివిడెండ్‌పై నిర్ణయం తీసుకోనున్నట్లు నెస్లే ఇండియా బోర్డు తెలిపింది.

ఆదిత్య బిర్లా క్యాపిటల్‌: ఆదిత్య బిర్లా ఇన్సూరెన్స్‌ బ్రోకర్స్‌లో ఆదిత్య బిర్లా క్యాపిటల్‌ 25.65 లక్షల షేర్లు విక్రయించనుంది. అలాగే ఇన్ఫోసైబర్‌ ఇండియా సైతం అదే కంపెనీ నుంచి 25.64 లక్షల షేర్లను విక్రయించాలని నిర్ణయించింది. వీటిని రూ.455 కోట్లకు Edme Services కొనుగోలు చేయనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని