Stock Market: స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ @ 20,120

Stock Market Opening bell: ఉదయం 9:24 గంటల సమయంలో సెన్సెక్స్‌ (Sensex) 77 పాయింట్ల లాభంతో 66,979 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ (Nifty) 26 పాయింట్లు పెరిగి 20,123 వద్ద కొనసాగుతోంది.

Published : 30 Nov 2023 09:37 IST

Stock Market Opening bell | దేశీయ స్టాక్‌ మార్కెట్ (Stock Market) సూచీలు గురువారం స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని మిశ్రమ సంకేతాలు సూచీలపై ప్రభావం చూపుతున్నాయి. ఉదయం 9:24 గంటల సమయంలో సెన్సెక్స్‌ (Sensex) 77 పాయింట్ల లాభంతో 66,979 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ (Nifty) 26 పాయింట్లు పెరిగి 20,123 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.30 వద్ద ప్రారంభమైంది.

సెన్సెక్స్‌ 30 సూచీలో అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఎల్‌అండ్‌టీ, ఎంఅండ్‌ఎం, సన్‌ఫార్మా, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, పవర్‌గ్రిడ్‌, హెచ్‌యూఎల్‌, టైటన్‌, ఐటీసీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌ షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఏషియన్‌ పెయింట్స్‌, ఎన్‌టీపీసీ, టీసీఎస్‌, విప్రో, టాటా స్టీల్‌, టెక్‌ మహీంద్రా, రిలయన్స్‌, ఇన్ఫోసిస్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, భారతీ ఎయిర్‌టెల్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లు నష్టపోయాయి.

అమెరికా మార్కెట్లు (Stock Market) బుధవారం లాభాలతో ముగిశాయి. ఐరోపా సూచీలూ అదే బాటలో పయనించాయి. ఆసియా-పసిఫిక్‌ మార్కెట్లు మాత్రం నేడు నష్టాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ముడి చమురు ధరలు బుధవారం స్వల్పంగా తగ్గాయి. బ్యారెల్‌ బ్రెంట్‌ చమురు ధర 82.90 డాలర్లకు చేరింది. విదేశీ సంస్థాగత మదుపర్లు (FII) బుధవారం రూ.71.91 కోట్లు విలువ చేసే భారత ఈక్విటీలను కొనుగోలు చేశారు. దేశీయ మదుపర్లు (DII) సైతం రూ.2,360.81 కోట్లు విలువ చేసే స్టాక్స్‌ను కొన్నారు.

కల్వర్‌ మ్యాక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ (ఇంతకు ముందు సోనీ పిక్చర్స్‌ నెట్‌వర్క్స్‌ ఇండియా)తో ప్రతిపాదిత విలీనాన్ని విజయవంతంగా పూర్తిచేయడానికి కృషి చేస్తున్నట్లు జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌ వెల్లడించింది. హెచ్‌ఐవీ మందుకు అరబిందో ఫార్మా అమెరికాలో అనుమతి సంపాదించింది. ఏరోస్పేస్‌, రక్షణ రంగాలకు విడిభాగాలు అందించే టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌(టీఏఎస్‌ఎల్‌), నాస్‌డాక్‌ లిస్టెడ్‌ కంపెనీ-శాటెల్లాజిక్‌ ఇంక్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ నేపథ్యంలో ఆయా కంపెనీల షేర్లపై మదుపర్లు దృష్టి సారించే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని