Stock Market: లాభాల్లో స్టాక్‌ మార్కెట్ సూచీలు.. రికార్డు గరిష్ఠానికి నిఫ్టీ

Stock Market Opening bell ఉదయం 9:30 గంటల సమయంలో సెన్సెక్స్‌ (Sensex) 306 పాయింట్ల లాభంతో 67,295 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ (Nifty) 95 పాయింట్లు పెరిగి 20,228 దగ్గర సరికొత్త గరిష్ఠాన్ని నమోదు చేసింది.

Published : 01 Dec 2023 09:44 IST

Stock Market Opening bell | అంతర్జాతీయ మార్కెట్లలోని మిశ్రమ సంకేతాల మధ్య దేశీయ స్టాక్ (Stock Market) మార్కెట్లు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:30 గంటల సమయంలో సెన్సెక్స్‌ (Sensex) 306 పాయింట్ల లాభంతో 67,295 సమీపంలో ట్రేడవుతోంది. నిఫ్టీ (Nifty) 95 పాయింట్లు పెరిగి 20,228 దగ్గర సరికొత్త గరిష్ఠాన్ని నమోదు చేసింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.28 వద్ద ప్రారంభమైంది.

సెన్సెక్స్‌ 30 సూచీలో ఎల్‌అండ్‌టీ, ఎన్‌టీపీసీ, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఏషియన్‌ పెయింట్స్‌, ఐటీసీ, పవర్‌గ్రిడ్‌, సన్‌ఫార్మా, ఎస్‌బీఐ, బజాజ్‌ ఫైనాన్స్‌, రిలయన్స్‌, మారుతీ, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌ షేర్లు లాభాల్లో ఉన్నాయి. విప్రో, టైటన్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, టెక్‌ మహీంద్రా, ఇన్ఫోసిస్‌, టాటా మోటార్స్‌, నెస్లే ఇండియా షేర్లు మాత్రమే నష్టాల్లో కొనసాగుతున్నాయి.

అమెరికా మార్కెట్‌ (Stock Market) సూచీలు గురువారం భారీ లాభాల్లో ముగిశాయి. ద్రవ్యోల్బణం దిగొచ్చిందనే సంకేతాలు అక్కడి మదుపర్లను ఉత్సాహపర్చాయి. మొత్తంగా నవంబర్‌లో యూఎస్‌ సూచీలు 2022 అక్టోబర్‌ తర్వాత మెరుగైన నెలవారీ లాభాలను నమోదుచేశాయి. ఐరోపా మార్కెట్లు సైతం గురువారం లాభాల్లో స్థిరపడ్డాయి. నేడు ఆసియా పసిఫిక్‌ సూచీలు ప్రతికూలంగా ట్రేడవుతున్నాయి. బ్యారెల్‌ బ్రెంట్‌ చమురు ధర గురువారం స్వల్పంగా తగ్గి 82.96 డాలర్లకు చేరింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబరు త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ 7.6 శాతం వృద్ధిని నమోదు చేసింది. తయారీ, గనులు, సేవల రంగం మెరుగ్గా రాణించడంతో ఇది సాధ్యమైందని ప్రభుత్వం వెల్లడించింది. మరోవైపు విదేశీ సంస్థాగత మదుపర్లు (FII) గురువారం రూ.8,147 కోట్లు విలువ చేసే భారత ఈక్విటీలను కొనుగోలు చేశారు. దేశీయ మదుపర్లు (DII) రూ.780 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు.

గమనించాల్సిన స్టాక్స్‌..

  • అల్ట్రాటెక్‌ సిమెంట్‌, కేశోరామ్‌ ఇండస్ట్రీస్‌: బి.కె.బిర్లా గ్రూపు ప్రధాన సంస్థ కేశోరామ్‌ ఇండస్ట్రీస్‌కు చెందిన సిమెంట్‌ వ్యాపారాన్ని ఆదిత్య బిర్లా గ్రూపు సంస్థ అల్ట్రాటెక్‌ సిమెంట్‌ కొనుగోలు చేయనుంది. షేర్ల బదిలీ (స్వాప్‌) రూపేణా ఈ కొనుగోలు లావాదేవీ జరగనుందని ఎక్స్ఛేంజీలకు ఇచ్చిన సమాచారంలో కంపెనీ తెలిపింది.
  • ఫ్లెయిర్‌ రైటింగ్‌ ఇండస్ట్రీస్‌: ఇటీవలే ఐపీఓకి వచ్చిన ఫ్లెయిర్‌ రైటింగ్‌ ఇండస్ట్రీస్‌ షేర్లు నేడు స్టాక్‌ ఎక్స్చేంజీల్లో లిస్ట్‌ కానున్నాయి. రూ.304 ఇష్యూ ధర వద్ద ఐపీఓకి వచ్చింది. 49.28 రెట్ల స్పందన రావడం గమనార్హం.
  • జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌: ‘ఎస్‌ఏఐసీ మోటార్‌ ఆఫ్‌ చైనా’తో వ్యూహాత్మక జాయింట్‌ వెంచర్‌ ఏర్పాటు చేయడం ద్వారా జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌ ఆటోమొబైల్‌ రంగంలోకి ప్రవేశించింది. జాయింట్ వెంచర్‌లో ఈ గ్రూప్‌నకు 35 శాతం వాటా ఉండనుంది.
  • రక్షణ రంగంలోని స్టాక్స్‌: ప్రభుత్వం రూ.2.23 లక్షల కోట్లు విలువ చేసే రక్షణ రంగ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపినట్లు సమాచారం.
  • వర్ల్‌పూల్‌: అప్పుల భారం తగ్గించుకోవడానికి ‘వర్ల్‌పూల్‌ ఆఫ్‌ ఇండియా’లో 24 శాతం వాటాను విక్రయించే యోచనలో ఉన్నట్లు అమెరికాలో ఈ కంపెనీ మాతృసంస్థ ప్రకటించింది.
  • పీవీఆర్‌ ఐనాక్స్‌: దేశీయంగా అతి పెద్ద మల్టీప్లెక్స్‌ ఆపరేటర్‌గా కొనసాగుతున్న పీవీఆర్‌ ఐనాక్స్‌ వచ్చే ఆర్థిక సంవత్సరం (2024-25)లో మరో 150 కొత్త తెరలను ప్రారంభించాలనుకుంటోంది. ఇందుకోసం రూ.500 కోట్ల పెట్టుబడులు పెడతామని కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సంజీవ్‌ కుమార్‌ బిజిలి వెల్లడించారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు