Stock Market: సూచీల్లో ‘బడ్జెట్‌’ అప్రమత్తత.. నిఫ్టీ @ 17,590

Stock Market: కేంద్ర ప్రభుత్వం బుధవారం బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో స్టాక్‌ మార్కెట్‌ సూచీల్లో నేడు అప్రమత్తత కొనసాగుతోంది

Published : 31 Jan 2023 09:41 IST

ముంబయి: అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాల మధ్య దేశీయ స్టాక్‌ మార్కెట్‌ (Stock Market) సూచీలు మంగళవారం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. తొలుత ఫ్లాట్‌గా ట్రేడింగ్‌ ప్రారంభించిన మార్కెట్లు (Stock Market) కాసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. ఉదయం 9:28 గంటల సమయంలో సెన్సెక్స్‌ (Sensex) 191 పాయింట్ల నష్టంతో 59,304 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ (Nifty) 53 పాయింట్లు నష్టపోయి 17,595 వద్ద కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 81.64 వద్ద ప్రారంభమైంది. సెన్సెక్స్‌ (Sensex)30 సూచీలో ఎంఅండ్‌ఎం, పవర్‌గ్రిడ్‌, ఎస్‌బీఐ, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, భారతీ ఎయిర్‌టెల్‌, రిలయన్స్‌, మారుతీ షేర్లు లాభాల్లో ఉన్నాయి. టెక్‌ మహీంద్రా, టీసీఎస్‌, ఎల్‌అండ్‌టీ, సన్‌ఫార్మా, ఇన్ఫోసిస్‌, నెస్లే ఇండియా, హెచ్‌సీఎల్‌ టెక్‌ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

అమెరికా మార్కెట్లు సోమవారం నష్టాలతో ముగిశాయి. ఆసియా- పసిఫిక్‌ సూచీలు నేడు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. ఈరోజు నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాల్లో కేంద్రం ఆర్థిక సర్వే నివేదికను ప్రవేశపెట్టనుంది. రేపు బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో నేడు సూచీలు అప్రమత్తంగా వ్యవహరించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేశారు. మరోవైపు అదానీ గ్రూప్‌ షేర్లపైనా మదుపర్లు దృష్టి సారించనున్నారు. నేటితో అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ ఎఫ్‌పీఓ ముగియనుంది. ఐఎంఎఫ్‌ ఈ ఏడాది భారత వృద్ధి రేటు అంచనాలను 6.8 శాతం వద్ద, 2023- 2024లో 6.1 శాతం వద్ద స్థిరంగా కొనసాగించింది. చమురు ధరలు సోమవారం 2 శాతం కుంగాయి. బ్రెంట్‌ ఫ్యూచర్స్‌ పీపా ధర 84.90 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. సోమవారం విదేశీ మదుపర్లు ఏకంగా రూ. 6,792.80 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో దేశీయ మదుపర్లు రూ. 5,512.63 కోట్ల విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఈరోజు ఫలితాలు ప్రకటించనున్న ప్రముఖ కంపెనీలు: కోల్‌ ఇండియా, ఐఓసీ, పవర్‌గ్రిడ్‌, సన్‌ ఫార్మా, యూపీఎల్‌, ఏసీసీ, రైల్‌టెల్‌, శ్రీరామ్‌ ఫైనాన్స్‌, గోద్రేజ్‌ కన్జూమర్‌ ప్రోడక్ట్స్‌, పీజీహెచ్‌హెచ్‌, ఎమ్‌ఓఐఎల్‌, ఎన్‌ఐఐటీ, ధనలక్ష్మీ బ్యాంక్‌, కేపీఐటీ టెక్నాలజీస్‌, జిందాల్‌ స్టీల్‌ అండ్‌ పవర్‌, జేఎస్‌డబ్ల్యూ హోల్డింగ్స్‌, స్పందన స్ఫూర్తి ఫైనాన్షియల్‌, స్టార్‌ హెల్త్‌, సెంచురీ టెక్స్‌టైల్స్‌, చోళమండలం ఇన్వెస్ట్‌మెంట్‌, సిగ్నిటీ, ఎడెల్‌వీజ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, కేఈసీ ఇంటర్నేషనల్‌, నెక్ట్స్‌డిజిటల్‌, ఓరియెంట్‌ సిమెంట్‌, ఎస్‌ఎంసీ గ్లోబల్‌ సెక్యూరిటీస్‌

గమనించాల్సిన స్టాక్స్‌..

లారస్‌ ల్యాబ్స్‌: ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికి ఏకీకృత ఖాతాల ప్రకారం రూ.1,545 కోట్ల ఆదాయాన్ని, రూ.203 కోట్ల నికరలాభాన్ని నమోదు చేసింది. త్రైమాసిక ఈపీఎస్‌  రూ.3.7గా ఉంది. 2021-22 ఇదేకాల ఆదాయం  రూ.1028 కోట్లతో పోలిస్తే 50%, నికరలాభం రూ.154 కోట్లతో పోలిస్తే 32% పెరిగాయి.

టెక్‌ మహీంద్రా: డిసెంబరు త్రైమాసికంలో టెక్‌ మహీంద్రా ఏకీకృత నికర లాభం 5.3 శాతం తగ్గి రూ.1,297 కోట్లకు పరిమితమైంది. 2021-22 ఇదే కాల లాభం రూ.1,378.20 కోట్లు కావడం గమనార్హం ఇదే సమయంలో కార్యకలాపాల ఆదాయం రూ.11,451 కోట్ల నుంచి 20 శాతం పెరిగి రూ.13,734.60 కోట్లకు చేరింది.

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌: పీఎన్‌బీ డిసెంబరు త్రైమాసికంలో రూ.629 కోట్ల స్టాండలోన్‌ నికర లాభాన్ని నమోదు చేసింది. 2021-22 ఇదే త్రైమాసికంలో బ్యాంక్‌ ఆర్జించిన నికర లాభం రూ.1,127 కోట్లతో పోలిస్తే ఇది 44 శాతం తక్కువ. మొత్తం ఆదాయం రూ.22,026 కోట్ల నుంచి రూ.25,722 కోట్లకు పెరిగింది.

ఎల్‌అండ్‌టీ: లార్సన్‌ అండ్‌ టుబ్రో (ఎల్‌అండ్‌టీ) డిసెంబరు త్రైమాసికంలో రూ.2,552.92 కోట్ల ఏకీకృత లాభాన్ని నమోదు చేసింది. 2021-22 ఇదే కాల లాభం రూ.2,054.74 కోట్లతో పోలిస్తే ఇది 24 శాతం అధికం. కార్యకలాపాల ఏకీకృత ఆదాయం రూ.39,562.92 కోట్ల నుంచి 17 శాతం పెరిగి రూ.46,389.72 కోట్లకు చేరింది.

బీపీసీఎల్‌: భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (బీపీసీఎల్‌) డిసెంబరు త్రైమాసికంలో రూ.1,747.01 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. 2021-22 కాల లాభం రూ.2,758.89 కోట్లతో పోలిస్తే ఇది 36.67% తక్కువ. ఆదాయం రూ.1,17,497.69 కోట్ల నుంచి 13.48% పెరిగి రూ.1,33,347.51 కోట్లకు చేరింది.

గెయిల్‌ ఇండియా: గెయిల్‌ డిసెంబరు త్రైమాసికంలో రూ.397.59 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. 2021-22 ఇదే త్రైమాసిక లాభం రూ.3,800.09 కోట్లతో పోలిస్తే ఇది 90 శాతం తక్కువ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని