Stock market: కొనసాగిన సూచీల నష్టాలు

వరుసగా మూడో రోజూ సూచీల నష్టాలు కొనసాగాయి. లోక్‌సభ ఎన్నికల ఫలితాలకు మరో వారమే గడువు ఉండటంతో, విద్యుత్, చమురు, యంత్ర పరికరాల షేర్లలో మదుపర్లు లాభాల స్వీకరణకు దిగారు.

Published : 29 May 2024 03:25 IST

వరుసగా మూడో రోజూ సూచీల నష్టాలు కొనసాగాయి. లోక్‌సభ ఎన్నికల ఫలితాలకు మరో వారమే గడువు ఉండటంతో, విద్యుత్, చమురు, యంత్ర పరికరాల షేర్లలో మదుపర్లు లాభాల స్వీకరణకు దిగారు. ముఖ్యంగా చిన్న, మధ్య స్థాయి షేర్లు అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్నాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 5 పైసలు తగ్గి 83.18 వద్ద ముగిసింది. బ్యారెల్‌ ముడిచమురు 0.13% లాభంతో 83.21 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

  • సెన్సెక్స్‌ ఉదయం 75,585.40 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. రోజంతా ఒడుదొడుకుల మధ్యే కదలాడిన సూచీ, ఇంట్రాడేలో 75,083.22 వద్ద కనిష్ఠానికి పడిపోయింది. చివరకు 220.05 పాయింట్ల నష్టంతో 75,170.45 వద్ద ముగిసింది. నిఫ్టీ 44.30 పాయింట్లు తగ్గి 22,888.15 దగ్గర స్థిరపడింది.
  • సెన్సెక్స్‌ 30 షేర్లలో 20 నీరసించాయి. పవర్‌గ్రిడ్‌ 1.64%, ఎన్‌టీపీసీ 1.16%, టాటా మోటార్స్‌ 1.12%, టెక్‌ మహీంద్రా 0.97%, భారతీ ఎయిర్‌టెల్‌ 0.95%, రిలయన్స్‌ 0.72% నష్టపోయాయి. ఏషియన్‌ పెయింట్స్‌ 1.30%, విప్రో 0.76%, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ 0.57% లాభపడ్డాయి. 
  • నొవెలిస్‌ రూ.7,900 కోట్ల ఐపీఓ: హిందాల్కో ఇండస్ట్రీస్‌కు చెందిన అమెరికా సంస్థ నొవెలిస్‌ ఐపీఓ ద్వారా 945 మిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.7,900 కోట్ల) వరకు సమీకరించడానికి సన్నాహాలు చేస్తోంది. కంపెనీ విలువను 12.6 బిలియన్‌ డాలర్లుగా లెక్కకట్టారు. ప్రతిపాదిత ఇష్యూలో భాగంగా నొవెలిస్‌ వాటాదార్లు ఏవీ మినరల్స్‌ (నెదర్లాండ్స్‌) ఎన్‌వీ 4.5 కోట్ల షేర్లను విక్రయించనుంది. ఐపీఓ ద్వారా కంపెనీకి ఎటువంటి నిధులు రావు. ఒక్కో షేరు ధర 18-21 డాలర్ల మధ్య ఉండే అవకాశం ఉంది. కంపెనీ షేర్లు న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీలో నమోదుకానున్నాయి. 
  • బొగ్గు నుంచి రసాయనాల వ్యాపారం కోసం అనుబంధ సంస్థ భారత్‌ కోల్‌ గ్యాసిఫికేషన్‌ అండ్‌ కెమికల్స్‌ను ఏర్పాటు చేసినట్లు కోల్‌ ఇండియా ప్రకటించింది. ఇందులో కోల్‌ ఇండియాకు 51%, భెల్‌కు 49% వాటాలున్నాయి. 
  • రుణదాతల కోసం ఎస్క్రో ఖాతాలో వేసిన    రూ.200 కోట్లను బదిలీ చేసేందుకు ఎన్‌సీఎల్‌ఏటీలో దాఖలు చేసిన పిటిషన్‌ను జలాన్‌ కల్‌రాక్‌ కన్సార్షియం వెనక్కి తీసుకుంది. ఈ కన్సార్షియంకు ఉపశమనం ఇచ్చేందుకు ఎన్‌సీఎల్‌ఏటీ నిరాకరించడమే ఇందుకు కారణం. 
  • జర్మనీ బ్యాంక్‌ కామర్జ్‌బ్యాంక్, ట్రేడింగ్‌ ప్లాట్‌ఫామ్‌ మురెక్స్‌లకు అధునాతన వ్యవస్థలను అందించేందుకు భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు ఇన్ఫోసిస్‌ ప్రకటించింది. 
  • వచ్చే కొన్నేళ్లలో ప్రస్తుత ఆసుపత్రుల్లో సామర్థ్యాల విస్తరణ కోసం రూ.1,300 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టనున్నట్లు ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌ తెలిపింది. పడకల సంఖ్యను 2,200కు పెంచాలని భావిస్తోంది. 
  • బహిరంగ మార్కెట్‌ లావాదేవీల ద్వారా ఐనాక్స్‌ విండ్‌ ఎనర్జీలో 4.6% వాటాను రూ.904 కోట్లకు ఐనాక్స్‌ విండ్‌ ప్రమోటర్‌ విక్రయించారు.
  • ఐటీసీ హోటల్‌ వ్యాపార విభజనకు సీసీఐ అనుమతి: ఐటీసీ హోటల్‌ వ్యాపారాన్ని ప్రత్యేక సంస్థగా విభజించే ప్రణాళికకు కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) ఆమోదం తెలిపింది. విభజన తర్వాత ఐటీసీ హోటల్స్‌ షేర్లు విడిగా స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో నమోదవుతాయి. విభజన అనంతరం ఐటీసీ హోటల్స్‌లో 40% వాటా ఐటీసీకి, మిగతా 60% వాటా కంపెనీ వాటాదార్లకు ఉంటుంది. ఐటీసీ నుంచి హోటల్స్‌ వ్యాపారాన్ని విడదీసి ఐటీసీ హోటల్స్‌గా ఏర్పాటు చేయడం వల్ల మైనారిటీ వాటాదార్లు లబ్ధి పొందే అవకాశం ఉందని, వారి వాటా విలువ పెరిగి.. మంచి ప్రతిఫలాలు వస్తాయని నాలుగు ప్రాక్సీ అడ్వైజరీ కంపెనీలు వెల్లడించాయి. 
  • 9 మంది సీజీఎంలకు ఎస్‌బీఐ పదోన్నతి: 9 మంది చీఫ్‌ జనరల్‌ మేనేజర్ల (సీజీఎం)కు డిప్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌లు (డీఎండీలు)గా పదోన్నతి కల్పించినట్లు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) తెలిపింది. మే 28 నుంచి ఈ పదోన్నతులు అమల్లోకి వచ్చాయి. పదోన్నతులు పొందిన వారిలో శివ ఓం దీక్షిత్, క్షితిజ్‌ మోహన్, సతీశ్‌ రావు నగేశ్, వీరేంద్ర బన్సల్, అశోక్‌ కుమార్‌ శర్మ, జీఎస్‌ రానా, రవి రంజన్, ప్రేమ్‌ అనూప్‌ సిన్హా, నవీన్‌ చంద్ర ఝా ఉన్నారు. ప్రస్తుతం దేశంలో 22 మంది డీఎండీలు ఉండగా, తాజా పదోన్నతులతో ఈ సంఖ్య 31కు పెరిగింది. 

నేటి బోర్డు సమావేశాలు

టాటా స్టీల్, హెరిటేజ్‌ ఫుడ్స్, రామ్‌కీ ఇన్‌ఫ్రా, జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, కేఎన్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్, కమిన్స్‌ ఇండియా, ఎస్‌జేవీఎన్, ఇప్కా ల్యాబ్స్, ఇమామీ, బాటా, ఆధార్‌ హౌసింగ్‌ ఫైనాన్స్, దీపక్‌ ఫెర్టిలైజర్స్


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని