Stock market: 4 రోజుల్లో రూ.5.12 లక్షల కోట్ల నష్టం

వరుసగా నాలుగో రోజూ మదుపర్ల లాభాల స్వీకరణ వల్ల సూచీలు నష్టపోయాయి. అంతర్జాతీయ సంకేతాలు బలహీనంగా ఉండటానికి తోడు, లోక్‌సభ ఎన్నికల ఫలితాలు సమీపిస్తుండటంతో మదుపర్లు అమ్మకాలకే మొగ్గుచూపారు.

Updated : 30 May 2024 03:47 IST

రుసగా నాలుగో రోజూ మదుపర్ల లాభాల స్వీకరణ వల్ల సూచీలు నష్టపోయాయి. అంతర్జాతీయ సంకేతాలు బలహీనంగా ఉండటానికి తోడు, లోక్‌సభ ఎన్నికల ఫలితాలు సమీపిస్తుండటంతో మదుపర్లు అమ్మకాలకే మొగ్గుచూపారు. ఫలితంగా సెన్సెక్స్, నిఫ్టీ దాదాపు 1% వరకు నష్టపోయాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 22 పైసలు తగ్గి 83.40 వద్ద ముగిసింది. బ్యారెల్‌ ముడిచమురు 0.88% లాభంతో 84.94 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఆసియా మార్కెట్లలో షాంఘై మినహా మిగతావి నష్టపోయాయి. ఐరోపా సూచీలు మిశ్రమంగా ట్రేడయ్యాయి.

వరుస నష్టాల నేపథ్యంలో మదుపర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలోని నమోదిత సంస్థల మొత్తం మార్కెట్‌ విలువ గత నాలుగు ట్రేడింగ్‌ రోజుల్లో రూ.5.12 లక్షల కోట్లు తగ్గి రూ.415.09 లక్షల కోట్ల (4.98 లక్షల కోట్ల డాలర్లు)కు చేరింది. 

సెన్సెక్స్‌ ఉదయం 74,826.94 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమైంది. అమ్మకాలు స్థిరంగా కొనసాగడంతో ఏదశలోనూ కోలుకోలేకపోయిన సూచీ, 74,454.55 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. చివరకు 667.55 పాయింట్ల నష్టంతో 74,502.90 వద్ద ముగిసింది. నిఫ్టీ 183.45 పాయింట్లు కోల్పోయి 22,704.70 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 22,685.45- 22,825.50 పాయింట్ల మధ్య కదలాడింది.

  • బలమైన త్రైమాసిక ఫలితాలు ప్రకటించడంతో ప్రభుత్వరంగ ఎన్‌బీసీసీ షేరు 2.49% లాభపడి రూ.142.25 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఈ షేరు రూ.145.85 వద్ద గరిష్ఠాన్ని తాకింది. 2024లో ఇప్పటివరకు షేరు దాదాపు 72% దూసుకెళ్లింది. గత ఏడాదికాలంలో షేరు 233.33% లాభాలను మదుపర్లకు అందించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 2న ఎన్‌బీసీసీ షేరు రూ.176.50 వద్ద 52 వారాల గరిష్ఠాన్ని నమోదుచేసింది.
  • అనుబంధ సంస్థ నొవెలిస్‌ అమెరికాలో రూ.7900 కోట్ల విలువైన ఐపీఓకు వెళ్తుండటంతో, హిందాల్కో షేరు 3.64% రాణించి రూ.705.35 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఈ షేరు రూ.713.40 వద్ద రికార్డు గరిష్ఠాన్ని తాకింది.
  • సెన్సెక్స్‌ 30 షేర్లలో 24 నష్టాలు నమోదు చేశాయి. టెక్‌ మహీంద్రా 2.35%, ఐసీఐసీఐ బ్యాంక్‌ 2.19%, యాక్సిస్‌ బ్యాంక్‌ 1.92%, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ 1.89%, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 1.48%, అల్ట్రాటెక్‌ 1.44%, విప్రో 1.12%, రిలయన్స్‌ 1.02%, ఇన్ఫోసిస్‌ 1% డీలాపడ్డాయి. పవర్‌గ్రిడ్, సన్‌ఫార్మా, నెస్లే, ఎయిర్‌టెల్‌ 1.52% వరకు లాభపడ్డాయి. రంగాల వారీ సూచీల్లో బ్యాంకింగ్‌ 1.37%, ఆర్థిక సేవలు 1.32%, చమురు-గ్యాస్‌ 0.95%, స్థిరాస్తి 0.88%, సేవలు 0.60% నీరసించాయి. ఆరోగ్య సంరక్షణ, పరిశ్రమలు, టెలికాం, యంత్ర పరికరాలు, లోహ, విద్యుత్‌ మెరిశాయి. బీఎస్‌ఈలో 2207 షేర్లు నష్టాల్లో ముగియగా, 1623 స్క్రిప్‌లు లాభపడ్డాయి. 99 షేర్లలో ఎటువంటి మార్పు లేదు.
  • స్పెషాలిటీ రసాయనాల కంపెనీ క్రోనాక్స్‌ ల్యాబ్‌ సైన్సెస్‌ ఐపీఓ జూన్‌ 3న ప్రారంభమై 5న ముగియనుంది. ఇందుకు ధరల శ్రేణిగా రూ.129-136 నిర్ణయించారు. గరిష్ఠ ధర వద్ద కంపెనీ రూ.130.15 కోట్లు సమీకరించనుంది. యాంకర్‌ మదుపర్లు మే 31న బిడ్‌లు దాఖలు చేసుకోవచ్చు. రిటైల్‌ మదుపర్లు కనీసం 110 షేర్లకు దరఖాస్తు చేసుకోవాలి. 
  • ఈ నెల 30న జరగాల్సిన బోర్డు సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు పీటీసీ ఇండియా తెలిపింది. అనుబంధ సంస్థ పీటీసీ ఇండియా ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ (పీఎఫ్‌ఎస్‌) ఆర్థిక ఫలితాలు సకాలంలో లభించకపోవడమే ఇందుకు కారణమని వెల్లడించింది. 
  • అధునాతన అంబులెన్స్‌లు, రైల్వే సీటింగ్‌ వ్యవస్థల తయారీ ప్లాంట్‌ను మధ్యప్రదేశ్‌లోని పీతంపూర్‌లో ఏర్పాటు చేయనున్నట్లు పినాకిల్‌ ఇండస్ట్రీస్‌ ప్రకటించింది. వచ్చే ఏడాది మార్చికి ఈ ప్లాంట్‌ కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉంది. 
  • బెంగళూరులో ఫిజిటల్‌ ఇన్నోవేషన్‌ కేంద్రాన్ని డెలాయిట్‌ ప్రారంభించింది. వ్యాపార సంస్థలకు డొమైన్‌ ఆధారిత సొల్యూషన్‌లను ఈ కేంద్రం అందించనుంది. తద్వారా ఖర్చులు తగ్గి, వాటి సామర్థ్యాలు పెరుగుతాయి.
  • ఐకాన్స్‌ విండ్‌లో 4.6% వాటా విక్రయం ద్వారా రూ.900 కోట్లు సమీకరించినట్లు ఐనాక్స్‌ విండ్‌ ఎనర్జీ తెలిపింది. తద్వారా రుణ భారాన్ని తగ్గించుకోనున్నట్లు పేర్కొంది.
  • విమాన ఇంజిన్లు లీజుకు ఇచ్చే సంస్థ ఇంజిన్‌ లీజ్‌ ఫైనాన్స్‌ బీవీ, దేశీయ విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌పై దివాలా పిటిషన్‌ దాఖలు చేసింది. దాదాపు 12 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.100 కోట్లు) బకాయిలు చెల్లించడం లేదని ఎన్‌సీఎల్‌టీ వద్ద దాఖలు చేసిన దావాలో పేర్కొంది. స్పైస్‌జెట్‌కు 8 ఇంజిన్లను లీజుకు ఇచ్చింది. వడ్డీ, అద్దెలు కలిపి బకాయిలు 16 మి.డాలర్లకు చేరాయి.
  • పవర్‌మెక్‌ ప్రాజెక్ట్స్‌కు రూ.563 కోట్ల ఆర్డర్‌ లభించింది. ఒక అణు విద్యుత్తు ప్లాంటు నిర్మాణం నిమిత్తం బీహెచ్‌ఈఎల్‌ ఈ ఆర్డర్‌ ఇచ్చింది. కర్ణాటకలో ఉత్తర కన్నడ జిల్లాలో కైగా అణు విద్యుత్తు ప్రాజెక్టులో ఈ ప్లాంటు నిర్మాంచాలి. 

నేటి బోర్డు సమావేశాలు: అపోలో హాస్పిటల్స్, సువెన్‌ ఫార్మా, ముత్తూట్‌ ఫైనాన్స్, భారత్‌ డైనమిక్స్, గాడ్‌ఫ్రే ఫిలిప్స్, నేషనల్‌ ఫెర్టిలైజర్స్, పీసీ జువెలర్, కిరి ఇండస్ట్రీస్, ఇమామీ రియాల్టీ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని