Stock market: 22,500 దిగువకు నిఫ్టీ

లోహ, మన్నికైన వినిమయ వస్తువులు, ఐటీ షేర్లకు అమ్మకాలు వెల్లువెత్తడంతో వరుసగా అయిదో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ నష్టపోయాయి.

Published : 31 May 2024 03:53 IST

సమీక్ష

లోహ, మన్నికైన వినిమయ వస్తువులు, ఐటీ షేర్లకు అమ్మకాలు వెల్లువెత్తడంతో వరుసగా అయిదో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ నష్టపోయాయి. మే డెరివేటివ్‌ కాంట్రాక్టుల గడువు ముగింపుతో పాటు సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు గడువు సమీపిస్తుండటం ప్రతికూల ప్రభావం చూపింది. దీంతో సెన్సెక్స్‌ 74,000 పాయింట్ల దిగువకు చేరగా, నిఫ్టీ 22,500 పాయింట్ల స్థాయిని కోల్పోయింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి 11 పైసలు బలపడి 83.29 వద్ద ముగిసింది. బ్యారెల్‌ ముడిచమురు 0.41% నష్టంతో 83.19 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. 

 • మదుపర్ల సంపదగా పరిగణించే, బీఎస్‌ఈలోని నమోదిత సంస్థల మొత్తం మార్కెట్‌ విలువ గత 5 ట్రేడింగ్‌ రోజుల్లో దాదాపు రూ.10 లక్షల కోట్లు ఆవిరై రూ.410.36 లక్షల కోట్లకు పరిమితమైంది. ఇదే సమయంలో సెన్సెక్స్‌ 1,532 పాయింట్లు, నిఫ్టీ 479 పాయింట్లు నష్టపోయాయి. గురువారం ఒక్కరోజే దాదాపు రూ.4.88 లక్షల కోట్ల సంపదను మదుపర్లు కోల్పోయారు.
 • సెన్సెక్స్‌ ఉదయం 74,365.88 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమైంది. రోజంతా బలహీనంగానే కదలాడిన సూచీ, ఒకదశలో 73,668.73 పాయింట్లకు పడిపోయింది. చివరకు 617.30 పాయింట్లు కోల్పోయి 73,885.60 వద్ద ముగిసింది. నిఫ్టీ 216.05 పాయింట్లు నష్టపోయి 22,488.65 దగ్గర స్థిరపడింది.  
 • సెన్సెక్స్‌ 30 షేర్లలో 23 కుదేలయ్యాయి. టాటా స్టీల్‌ 5.74%, టెక్‌ మహీంద్రా 3.54%, పవర్‌గ్రిడ్‌  3.48%, టైటన్‌ 3.17%, విప్రో 3.09%, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ 2.91%, బజాజ్‌ ఫైనాన్స్‌ 2.86%, నెస్లే  2.55%, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ 2.12%, టాటా మోటార్స్‌ 2.07% నష్టపోయాయి. ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్‌ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎస్‌బీఐ        1.14% వరకు లాభపడ్డాయి.  
 • పేటీఎంలో వాటా కొనుగోలుకు అదానీ గ్రూప్‌ చర్చలు జరుపుతోందంటూ వచ్చినవి నిరాధార వార్తలని ఇరు సంస్థలూ ఖండించినా కూడా, పేటీఎం మాతృసంస్థ వన్‌97 కమ్యూనికేషన్స్‌ షేరు రెండో రోజూ దూసుకెళ్లింది. గురువారం బీఎస్‌ఈలో 5% లాభపడి రూ.377.50 వద్ద అప్పర్‌ సర్క్యూట్‌ను తాకి, అక్కడే ముగిసింది.
 • ఆఫిస్‌ స్పేస్‌ సొల్యూషన్స్‌ షేరు ఇష్యూ ధర రూ.383తో పోలిస్తే బీఎస్‌ఈలో 12.86% లాభంతో రూ.432.25 వద్ద ప్రారంభమైంది. ఇంట్రాడేలో రూ.451.45 వద్ద గరిష్ఠాన్ని తాకి, చివరకు 9.43% లాభంతో రూ.419.10 వద్ద ముగిసింది. 
 • ఎన్‌ఎస్‌ఈ విద్యుత్‌ వాహన సూచీ: విద్యుత్‌ వాహన (ఈవీ) వ్యవస్థలో భాగంగా ఉన్న కంపెనీల పనితీరును గమనించేందుకు ఈవీ, కొత్త తరం వాహన సూచీని నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ (ఎన్‌ఎస్‌ఈ) అనుబంధ సంస్థ ఎన్‌ఎస్‌ఈ ఇండీసెస్‌ గురువారం తీసుకొచ్చింది. దేశంలో ఇదే మొదటి ఈవీ సూచీ.  
 • ఇంటర్నెట్‌ ఆధారిత ట్రేడింగ్‌ కోసం దరఖాస్తు చేసుకునే స్టాక్‌ బ్రోకర్‌లకు స్టాక్‌ ఎక్స్ఛేంజీలు అనుమతులు మంజూరు చేసే సమయాన్ని 7 రోజులకు తగ్గించినట్లు సెబీ తెలిపింది. ప్రస్తుతం ఇది 30 రోజలుగా ఉంది. వ్యాపారాన్ని సులభతరం చేసే ప్రక్రియలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. 
 • హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిలా ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌లో 11% వాటా కొనుగోలు చేయాలన్న దక్షిణ కొరియా సంస్థ షిన్‌హాన్‌ బ్యాంక్‌ ప్రతిపాదనకు కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) ఆమోదం తెలిపింది. 1996 నుంచి భారత్‌లో షిన్‌హాన్‌ బ్యాంక్‌ కార్యకలాపాలు సాగిస్తోంది.
 • ఎయిర్‌టెల్‌ బిజినెస్‌ సీఈఓగా శరత్‌ సిన్హాను నియమించినట్లు భారతీ ఎయిర్‌టెల్‌ వెల్లడించింది. జూన్‌ 3 నుంచి ఈ నియామకం అమల్లోకి రానుంది. భారతీ ఎయిర్‌టెల్‌ సీఈఓ, ఎండీ గోపాల్‌ విత్తల్‌ కింద ఆయన పనిచేస్తారు. ఎయిర్‌టెల్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డులో భాగంగా ఉండనున్నారు.
 • మహీంద్రా లాజిస్టిక్స్‌తో సంయుక్త సంస్థను ఏర్పాటు చేయడం ద్వారా దేశీయ విపణిలోకి జపాన్‌ సంస్థ సీనో హోల్డింగ్స్‌ అడుగుపెట్టింది. వచ్చే అయిదేళ్లలో రూ.1000 కోట్ల వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలని కంపెనీ భావిస్తోంది.
 • మార్చి త్రైమాసికం, 2023-24 ఆర్థిక సంవత్సరం ఫలితాలను ప్రకటించేందుకు మరింత సమయం పడుతుందని జెట్‌ ఎయిర్‌వేస్‌ తెలిపింది. త్వరలోనే ఇందుకోసం పర్యవేక్షణ కమిటీ భేటీ కానుందని వెల్లడించింది.
 • బెంగళూరులో అతిపెద్ద ఉద్యోగుల క్యాంపస్‌ను ష్నైడర్‌ ఎలక్ట్రిక్‌ ప్రారంభించింది. రూ.200 కోట్లతో ఏర్పాటు చేసిన ఈ క్యాంపస్‌లో 8000 మంది ఉద్యోగులు పనిచేసేందుకు వీలుంది. 
 • ప్రిఫరెన్షియల్‌ ఇష్యూ ద్వారా రూ.3,200 కోట్ల వరకు సమీకరించేందుకు ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ బోర్డు ఆమోదం తెలిపింది. 
 • బహిరంగ మార్కెట్‌ లావాదేవీల ద్వారా కేఫిన్‌ టెక్నాలజీస్‌లో 5.8% వాటాను రూ.712 కోట్లకు ప్రమోటర్‌ సంస్థ జనరల్‌ అట్లాంటిక్‌ విక్రయించింది. దీంతో కంపెనీలో జనరల్‌ అట్లాంటిక్‌ వాటా     38.03% నుంచి 32.23 శాతానికి తగ్గింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని