Nithin Kamath: పక్షవాతానికి గురైన జెరోదా సీఈఓ.. బ్రేక్‌ తీసుకోవాలన్న అష్నీర్‌

Nithin Kamath: తాను పాక్షిక పక్షవాతానికి గురైనట్లు జెరోదా సీఈఓ నితిన్‌ కామత్‌ వెల్లడించారు. ప్రస్తుతం తాను కోలుకుంటున్నట్లు తెలిపారు.

Updated : 27 Feb 2024 16:17 IST

దిల్లీ: ప్రముఖ స్టాక్‌ బ్రోకరేజ్‌ సంస్థ జెరోదా (Zerodha) సహ వ్యవస్థాపకుడు, కంపెనీ సీఈఓ నితిన్‌ కామత్‌ (Nithin Kamath) అనారోగ్యానికి గురయ్యారు. కొద్ది వారాల క్రితం తనకు పాక్షిక పక్షవాతం వచ్చినట్లు సోమవారం ఆయన సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు. విరామం తీసుకోవాలని నితిన్‌ను కోరుతూ పలువురు వ్యాపార వేత్తలు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేశారు.

‘‘దాదాపు ఆరు వారాల క్రితం అనూహ్యంగా నేను స్వల్ప పక్షవాతానికి గురయ్యాను. మా నాన్న మరణం, నిద్రలేమి, తీవ్ర మానసిక అలసట, డీహైడ్రేషన్‌, పనిఒత్తిడి.. వీటిల్లో ఏదైనా నా అనారోగ్యానికి కారణం కావొచ్చు. దీనివల్ల నా ముఖం వంకర తిరిగి చదవడం, రాయడం వంటివి కూడా చేయలేకపోయా. ఇప్పుడు కాస్త నయమైంది. పూర్తిగా కోలుకోవడానికి 3 నుంచి 6 నెలలు పడుతుంది. ఆరోగ్యం, ఫిట్‌నెస్‌ గురించి ఎక్కువ శ్రద్ధ తీసుకునే నాకు ఇలా ఎలా జరిగిందని ఆశ్చర్యపోయా. పని ఒత్తిడిని ఎప్పుడు తగ్గించుకోవాలో తెలుసుకోవాలని వైద్యులు చెప్పారు. కాస్త అనారోగ్యంగా ఉన్నా ట్రెడ్‌మిల్‌పై రన్నింగ్‌ చేయగలుగుతున్నా’’ అని 44 ఏళ్ల నితిన్‌ కామత్‌ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. ఆసుపత్రి బెడ్‌పై ఉన్న ఫొటోను షేర్‌ చేశారు.

ఆయన ఆరోగ్యం గురించి తెలియగానే ప్రముఖ వ్యాపారవేత్త అష్నీర్‌ గ్రోవర్‌ స్పందించారు. ‘‘డ్యూడ్‌.. కాస్త జాగ్రత్తగా ఉండండి. నాకు తెలిసి మీ తండ్రి మరణమే మీ ఆరోగ్యంపై ఎక్కువ ప్రభావం చూపించిఉంటుంది. మా నాన్న చనిపోయినప్పుడు కూడా నాకు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. కాస్త బ్రేక్‌ తీసుకోండి’’ అని సూచించారు. ‘‘మీ మానసిక సామర్థ్యం, శారీరక దృఢత్వం వల్ల త్వరగా కోలుకుంటారు’’ అంటూ కిరణ్‌ మజుందార్‌షా పేర్కొన్నారు. వ్యాపార రంగానికి చెందిన పలువురు ప్రముఖులు కూడా నితిన్‌ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు