Sundar Pichai: ‘3 ఇడియట్స్‌’ సీన్‌తో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లకు సుందర్‌ పిచాయ్‌ సలహా..

Sundar Pichai: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ సాంకేతికత వినియోగం పెరుగుతున్న తరుణంలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లకు గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ సలహా అందించారు.

Updated : 18 May 2024 16:42 IST

Sundar Pichai | ఇంటర్నెట్‌డెస్క్‌: ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) సాంకేతికత వినియోగం నానాటికీ పెరుగుతోంది. ఈ క్రమంలోనే అభ్యర్థుల్లో ఉద్యోగాలపై ఆందోళన నెలకొంది. దీంతో ఉద్యోగులకు సూచనలు అందించారు గూగుల్‌(Google) సీఈఓ సుందర్‌ పిచాయ్‌ (Sundar Pichai). ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన రోట్‌ లెర్నింగ్‌ గురించి మాట్లాడారు. అలానే తనకు ఇష్టమైన భారతీయ వంటకాల గురించి పంచుకున్నారు.

టాప్‌ టెక్‌ సంస్థలైన FAANG (ఫేస్‌బుక్, యాపిల్, అమెజాన్, నెట్‌ఫ్లిక్స్, గూగుల్) సంస్థల్లో ఇంటర్వ్యూల్లో విజయం సాధించడమెలాగో యువకులకు సలహా ఇవ్వాలని ఇంటర్వ్యూయర్‌ పిచాయ్‌ని కోరారు. దీంతో ‘‘రోట్‌ లెర్నింగ్‌(బట్టీ పట్టి చదవడం)’’.. అనే అంశాన్ని పిచాయ్‌ ప్రస్తావించారు. విషయాన్ని లోతుగా అర్థం చేసుకోవడం ద్వారా నిజమైన విజయం వస్తుందని తాను బలంగా నమ్ముతానన్నారు. అదే పద్ధతినే ఇప్పటి సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు పాటించాలన్నారు. ఏదైనా అంశాన్ని తెలుసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని వివరించేందుకు ‘‘3 ఇడియట్స్‌’’లోని ఓ సన్నివేశాన్ని గుర్తుచేశారు. అందులో మోటార్‌ ఎలా పనిచేస్తుందో నిర్వచించమని ఓ విద్యార్థిని అడగ్గా.. కంఠస్థం చేసిన డెఫినేషన్‌ చెప్పకుండా సాధారణ పదాలతో యంత్రం అంటే ఏమిటో వివరిస్తాడు. విషయాన్ని గ్రహించడమంటే ఇదే అని అన్నారు.

బెంబేలెత్తిస్తున్న ‘ఎస్‌బీఐ’ సందేశం

అవంటే నాకిష్టం

‘‘సాంకేతికతను లోతుగా అర్థం చేసుకోవాలి. అలా చేస్తేనే మీరు పరివర్తన చెందగలరు. ఏదైనా సాధించగలం అని నేను నమ్ముతాను’’ అని పిచాయ్‌ అన్నారు. ఇక ఇష్టమైన భారతీయ వంటకం గురించి అడగ్గా.. ప్రాంతాన్ని బట్టి తనకు వంటకాలు నచ్చుతాయన్నారు. ‘‘బెంగళూరులో ఉన్నప్పుడు నేను దోశ బాగా తినేవాడిని. అది నాకు చాలా ఇష్టమైన ఫుడ్‌. దిల్లీలో అయితే చోలే బటూరె. ఇక ముంబయిలో అయితే పావ్‌ భాజీ’’ అని చెప్పుకొచ్చారు. ఇదే ఇంటర్వ్యూలో ఏఐ సాంకేతికత, స్టార్టప్‌ల గురించి కూడా ఆయన ప్రస్తావించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని