Sunpharma: సన్‌ఫార్మా డివిడెండు 500%

సన్‌ఫార్మా, జనవరి- మార్చి త్రైమాసికానికి ఏకీకృత ప్రాతిపదికన రూ.2,654.58 కోట్ల నికర లాభాన్ని, రూ.11,982.90 కోట్ల ఆదాయాన్ని ప్రకటించింది. 2022-23 ఇదే కాలంలో లాభం రూ.1,984.47 కోట్లు, కార్యకలాపాల ద్వారా ఆదాయం రూ.10,930.67 కోట్లుగా నమోదయ్యాయి.

Published : 23 May 2024 02:04 IST

దిల్లీ: సన్‌ఫార్మా, జనవరి- మార్చి త్రైమాసికానికి ఏకీకృత ప్రాతిపదికన రూ.2,654.58 కోట్ల నికర లాభాన్ని, రూ.11,982.90 కోట్ల ఆదాయాన్ని ప్రకటించింది. 2022-23 ఇదే కాలంలో లాభం రూ.1,984.47 కోట్లు, కార్యకలాపాల ద్వారా ఆదాయం రూ.10,930.67 కోట్లుగా నమోదయ్యాయి. ఫార్ములేషన్‌ అమ్మకాలు భారత్‌లో రూ.3,707.80 కోట్లు, అమెరికాలో 476 మిలియన్‌ డాలర్లుగా (సుమారు రూ.3,964 కోట్లు) నమోదయ్యాయి. వివాల్డిస్‌ హెల్త్‌ అండ్‌ ఫుడ్స్‌లో 60% వాటా కొనుగోలు కారణంగా 2023 డిసెంబరు త్రైమాసికం, 2023-24 ఆర్థిక సంవత్సర ఫలితాలను గతంతో పోల్చిచూడలేమని సన్‌ఫార్మా తెలిపింది. వివాల్డిస్‌లో వాటా కొనుగోలు ప్రక్రియ 2023 జూన్‌  త్రైమాసికంలో పూర్తయ్యింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి రూ.1 ముఖ విలువ గల ఒక్కో షేరుపై రూ.5 (500%) తుది డివిడెండును డైరెక్టర్ల బోర్డు సిఫారసు చేసింది. ఇప్పటికే రూ.8.5 మధ్యంతర డివిడెండును కంపెనీ చెల్లించింది. దీంతో మొత్తం డివిడెండు రూ.13.50కు చేరింది. 2022-23లో చెల్లించిన రూ.11.50 కంటే ఇది ఎక్కువ. 

ఛైర్మన్‌గా దిలీప్‌ సంఘ్వీ..: ప్రస్తుతం మేనేజింగ్‌ డైరెక్టరుగా ఉన్న దిలీప్‌ సంఘ్వీని బోర్డు ఛైర్మన్‌గా నియమించే ప్రతిపాదనకు  డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది. ఆయన నియామకం తక్షణమే అమల్లోకి రానుంది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి (2023-24) సన్‌ఫార్మా ఏకీకృత నికర లాభం రూ.9,576.38 కోట్లు కాగా.. 2022-23లో రూ.8,473.58 కోట్లుగా ఉంది. కార్యకలాపాల ఆదాయం రూ.43,885.68 కోట్ల నుంచి రూ.48,496.85 కోట్లకు పెరిగింది. ఫార్ములేషన్‌ విక్రయాలు భారత్‌లో రూ.14,889.30 కోట్లు, అమెరికాలో 1,854 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ.15400 కోట్లు)గా నమోదయ్యాయి. ‘2023-24 ఆర్థిక సంవత్సరంలో మా రెండు వ్యాపారాల వార్షిక విక్రయాలు 100 కోట్ల డాలర్ల మైలురాయిని అధిగమించాయి. కీలక విపణుల్లో ఈ ఘనత సాధించడం, కొన్నేళ్లుగా మేం చేస్తున్న కృషికి దక్కిన ఫలితానికి నిదర్శనమ’ని సంఘ్వీ తెలిపారు. స్పెషాలిటీ పోర్ట్‌ఫోలియోను అభివృద్ధి చేసుకోవడాన్ని కొనసాగించడంతో పాటు వ్యాపారాల విస్తరణకు మరిన్ని పెట్టుబడులు పెడతామని ఆయన పేర్కొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని