Adani group- Sebi: అదానీ గ్రూప్‌పై దర్యాప్తునకు సెబీకి 3 నెలల గడువు

Adani-Hindenburg: అదానీ- హిండెన్‌ బర్గ్‌ అంశంపై దర్యాప్తునకు సెబీకి సుప్రీంకోర్టు మరో మూడు నెల గడువు ఇచ్చింది. సెబీ కోరిన ఆరు నెలల గడువుకు నిరాకరించింది.

Published : 17 May 2023 18:32 IST

దిల్లీ: అదానీ గ్రూప్‌ (Adani group) వ్యవహారంలో దర్యాప్తునకు సెబీకి (SEBI) సుప్రీంకోర్టు (Supreme court) మరో మూడు నెలల గడువు ఇచ్చింది. అదానీ గ్రూప్‌- హిండెన్‌బర్గ్‌ (Adani-Hindenburg) వివాదానికి సంబంధించి ఆగస్టు 14 నాటికి రిపోర్ట్‌ సమర్పించాలని ఆదేశించింది. దర్యాప్తు పూర్తి చేయడానికి వాస్తవానికి సెబీ ఆరు నెలల గడువు కోరినప్పటికీ.. మూడు నెలలు మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది.

తమ గ్రూప్‌ కంపెనీల షేర్ల ధరలను పెంచేందుకు అవకతవకలకు పాల్పడిందని, నియంత్రణ వెల్లడి నిబంధనలను ఉల్లంఘించిందంటూ అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్‌ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో పలు పిటిషన్లు దాఖలు కావడంతో దర్యాప్తు చేయాలని మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీని మార్చి 2న  సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆ గడువు మే 2తో ముగియగా.. దర్యాప్తు గడువును ఆరు నెలల పాటు పొడిగించాలని కోరుతూ సెబీ పిటిషన్‌ దాఖలు చేసింది.

దీనిపై బుధవారం విచారణ చేపట్టిన జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ పీఎస్‌ నరసింహ, జస్టిస్‌ జేబీ పర్దీవాలాతో కూడిన ధర్మాసనం ఆరు నెలల గడువు ఇచ్చేందుకు నిరాకరించింది. ఇప్పటికే రెండు నెలలు గడువు ఇచ్చామని.. ‘నిరవధిక పొడిగింపు’ ఇవ్వలేమని పేర్కొంది. మరో మూడు నెలల గడువు ఇచ్చామని, మొత్తంగా ఐదు నెలలు అవుతుందని తెలిపింది. అప్పటికి ఏదైనా సరైన కారణం ఉంటే అప్పుడు దర్యాప్తు పొడిగింపు అంశాన్ని పరిశీలిస్తామని బెంచ్‌ పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు