T+0 Settlement: 28 నుంచి టి+0 సెటిల్‌మెంట్‌.. తొలుత ఈ 25 షేర్లకే

T+0 settlement: టి+0 ట్రేడ్‌ సెటిల్‌మెంట్‌ను బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ గురువారం నుంచి అమల్లోకి తీసుకురానున్నాయి. ప్రయోగాత్మకంగా పరీక్షించనున్న దీని బీటా వర్షన్‌ను తొలుత 25 షేర్లకు వర్తింపజేయనుంది.

Updated : 27 Mar 2024 15:17 IST

దిల్లీ: స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో షేర్లు అమ్మినా, కొనుగోలు చేసినా అదే రోజు సెటిల్‌మెంట్‌ చేసే ప్రక్రియను సెబీ వేగవంతం చేస్తోంది. గురువారం నుంచి ఐచ్ఛిక ప్రాతిపదికన టి+0 సెటిల్‌మెంట్‌ (T+0 settlement) బీటా వర్షన్‌ను ఆవిష్కరించనుంది. ప్రయోగాత్మకంగా తొలుత కేవలం 25 షేర్లకు, పరిమిత బ్రోకర్లకు మాత్రమే దీన్ని వర్తింపజేయనుంది.

ప్రస్తుతం మనం స్టాక్‌ మార్కెట్లో ఏదైనా షేర్లు కొనుగోలు చేస్తే టి+1 రోజున అంటే ట్రేడ్‌ చేసిన తదుపరి రోజున సెటిల్‌మెంట్‌ జరుగుతోంది. అయితే టి+0తో ట్రేడ్‌ జరిగిన రోజే సెటిల్‌మెంట్‌ పూర్తవుతుంది. దీని బీటా వర్షన్‌ను మూడు, ఆరు నెలల తర్వాత సమీక్షించనుంది. అన్ని సజావుగా జరిగితే విస్తృత స్థాయిలో టి+0 (T+0 settlement) అమల్లోకి వస్తుంది.

25 షేర్లు ఇవే..

బజాజ్‌ ఆటో, వేదాంత, హిందాల్కో ఇండస్ట్రీస్‌, ఎస్‌బీఐ, ట్రెంట్‌, టాటా కమ్యూనికేషన్స్‌, నెస్లే ఇండియా, సిప్లా, ఎంఆర్‌ఎఫ్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, బీపీసీఎల్‌, ఓఎన్‌జీసీ, ఎన్‌ఎండీసీ, అంబుజా సిమెంట్స్‌, ఇండియన్‌ హోటల్స్‌, ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌, ఎల్‌టీఐమైండ్‌ట్రీ, పెట్రోనెట్‌ ఎల్‌ఎన్‌జీ, సంవర్ధన మదర్‌సన్‌ ఇంటర్నేషనల్‌, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, దివీస్‌ లేబోరేటరీస్‌, బిర్లా సాఫ్ట్‌, కోఫోర్జ్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, అశోక్‌ లేల్యాండ్‌

టి+0 సెటిల్‌మెంట్‌ వల్ల బ్రోకర్ల సొంత నిధులను వాడాల్సిన అవసరం పెద్దగా ఉండకపోవచ్చు. తద్వారా మొత్తం మీద వ్యాపార వ్యయాలు తగ్గుతాయి. ప్రస్తుతం ఎవరైనా క్లయింటు షేర్లను విక్రయిస్తే.. తక్షణం అందుకు సంబంధించిన మొత్తం ట్రేడింగ్‌ ఖాతాలో పడిపోతోంది. ఆ మొత్తంతో షేర్ల కొనుగోళ్లు చేయడానికి వీలవుతుంది. సాయంత్రం 4:30 గంటలకల్లా బ్రోకర్లకు నిధులు జమవుతాయి. తక్షణ సెటిల్‌మెంట్‌ వల్ల మార్కెట్లో ద్రవ్యలభ్యత పెరుగుతుంది. అదే సమయంలో భారత స్టాక్‌ మార్కెట్ల సామర్థ్యం, పారదర్శకత మెరుగవుతుంది.

టి+5 నుంచి టి+0 దాకా

అప్పటి దాకా ఉన్న టి+5 సెటిల్‌మెంట్‌ను ఏప్రిల్‌ 2002లో టి+3కి సెబీ మార్చగలిగింది. ఆ తర్వాత సంవత్సరమే టి+2కు సవరించింది. 2021లో టి+1ను దశలవారీగా అమలు చేయడం ప్రారంభించింది. తుది దశను జనవరి 2023కు పూర్తి చేసింది. అక్టోబరు 1, 2023 నుంచి టి+1 సెటిల్‌మెంట్‌ను అన్ని స్క్రిప్‌లకు అమలు చేయనున్నట్లు సెబీ ప్రకటించింది. ప్రస్తుతం చాలా వరకు దేశాల్లో రెండు రోజుల్లో సెటిల్‌మెంట్‌ జరుగుతోంది. తక్షణ సెటిల్‌మెంట్‌ భారత్‌లో వస్తే.. చైనా తర్వాత ఆ ఘనత సాధించిన దేశం మనదే అవుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని