Onion: లక్ష టన్నుల ఉల్లి నిల్వ లక్ష్యం

కొరత ఏర్పడినప్పుడల్లా ధరలు పెరుగుతున్నందున, దేశీయంగా లక్ష టన్నుల మేర ఉల్లిపాయలను అదనంగా నిల్వ ఉంచేందుకు రేడియేషన్‌ ప్రక్రియ నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.

Published : 24 May 2024 03:06 IST

రేడియేషన్‌తో సాధించేందుకు ప్రభుత్వ కసరత్తు

దిల్లీ: కొరత ఏర్పడినప్పుడల్లా ధరలు పెరుగుతున్నందున, దేశీయంగా లక్ష టన్నుల మేర ఉల్లిపాయలను అదనంగా నిల్వ ఉంచేందుకు రేడియేషన్‌ ప్రక్రియ నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఉల్లిపాయలకు కొరత ఏర్పడనుందనే సమాచారంతోనే, ఒక్కసారిగా ధరలను పెంచేస్తున్నారు. వంటల్లోకి తప్పనిసరి కావడంతో, ఉల్లి ఘాటు ప్రతి కుటుంబానికి తగులుతోంది. రాజకీయంగా ఇది ప్రతికూల ప్రభావం చూపుతున్నందున, ప్రభుత్వం ఉల్లి నిల్వల పెంపుపై దృష్టి సారించింది. 2023-24లో ఉల్లి ఉత్పత్తి 16% తగ్గి, 25.47 మిలియన్‌ టన్నులకు పరిమితం అయ్యే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఉల్లి ఉత్పత్తిలో ప్రధాన రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లలో దిగుబడి తగ్గడం ఇందుకు కారణంగా చెబుతున్నారు. సరఫరా అవరోధాలతో తరచు ధరల్లో ఒడుదొడుకులు ఏర్పడుతున్నాయి. వీటిని నియంత్రించడంలో భాగంగా, ఉల్లిపాయల  జీవితకాలాన్ని పెంచేందుకు రేడియేషన్‌ సాంకేతికత వాడాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు వినియోగదారు వ్యవహారాల శాఖ కార్యదర్శి నిధి ఖరే తెలిపారు. ‘ముఖ్య వినియోగ ప్రాంతాల చుట్టూ 50 ఇర్రేడియేషన్‌ కేంద్రాలను మేం గుర్తిస్తున్నాం. ఇది విజయవంతమైతే ఈ ఏడాది 1 లక్ష టన్నుల వరకు  ఉల్లిపాయలను అదనంగా నిల్వ చేయగలుగుతాం’ అని ఖరే తెలిపారు. సోనెపట్, థానే, నాసిక్, ముంబయి లాంటి కీలక ప్రాంతాల చుట్టూ ఇర్రేడియేషన్‌ కేంద్రాలను గుర్తించే బాధ్యతను నాఫెడ్, ఎన్‌సీసీఎఫ్‌కు మంత్రిత్వ శాఖ అప్పగించిందని పేర్కొన్నారు. గతేడాది మహారాష్ట్రలో 1,200 టన్నుల ఉల్లి నిల్వలపై రేడియేషన్‌ ప్రాసెసింగ్‌కు ప్రయత్నించారు. ఉల్లి నిల్వలను అవసరమైన ప్రాంతాలకు వేగంగా రవాణా చేసేందుకు, ప్రధాన రైల్వే హబ్‌ల వద్ద ఉష్ణోగ్రత నియంత్రిత నిల్వ కేంద్రాల ఏర్పాటు అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తోందని ఖరే తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని