టెలికాం టారిఫ్‌లు మన దగ్గరే తక్కువ: ఎయిర్‌టెల్ సీఈఓ

దేశంలోనే టెలికాం ఛార్జీలు తక్కువగా ఉన్నాయని ఎయిర్‌టెల్‌ సీఈఓ అన్నారు. టారిఫ్ రిపేర్‌ అవసరం అని చెప్పారు.

Published : 15 May 2024 20:05 IST

Airtel | దిల్లీ: ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే దేశీయ టెలికాం మార్కెట్‌లోనే టారిఫ్‌లు బాగా తక్కువని భారతీ ఎయిర్‌టెల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ గోపాల్‌ విత్తల్‌ అన్నారు. పెట్టిన పెట్టుబడికి ప్రతిఫలం పెరగాలంటే ‘టారిఫ్‌ రిపేర్‌’ అవసరమన్నారు. పరోక్షంగా ధరల పెంపు చేపట్టబోతున్నట్లు సంకేతాలిచ్చారు. క్యూ4 ఎర్నింగ్‌ కాల్‌ సందర్భంగా ఆయన ఈమేరకు మాట్లాడారు.

పెట్టుబడికి తగిన ప్రతిఫలం పెరగాలంటే టారిఫ్‌లు పెరగాల్సిన అవసరం ఉందని విత్తల్‌ చెప్పారు. ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలోనే అతితక్కువ ధరలు ఉన్నాయన్నారు. 5జీ కోసం వెచ్చించిన మొత్తానికి ప్రతిఫలం తక్కువగానే ఉందన్నారు. అయితే, దీన్ని మొత్తం వ్యాపారంలో భాగంగానే చూస్తున్నామని చెప్పారు. ఇటీవల వొడాఫోన్‌ ఐడియా చేపట్టిన ఫాలో ఆన్‌ పబ్లిక్‌ ఆఫర్‌ గురించి మాట్లాడారు. నిధుల సమీకరణ స్వాగతించదగ్గ పరిణామమని, భవిష్యత్‌లో ఆ సంస్థకు అంతా మంచి జరగాలని ఆకాంక్షించారు. ముగ్గురు ప్రైవేటు ఆపరేటర్ల ద్వారా భారత్‌కు మెరుగైన సేవలందుతాయని చెప్పారు.

భారతీ ఎయిర్‌టెల్‌ జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.2,072 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని మంగళవారం ప్రకటించింది. 2022-23 ఇదే కాలానికి లాభం రూ.3,005.60 కోట్లతో పోలిస్తే, ఇది 31% తక్కువ. నైజీరియా కరెన్సీ అయిన నైరా విలువ తగ్గడం వల్ల, తమకు విదేశీ మారక ద్రవ్య రూపేణా రూ.2,544.40 కోట్ల మేర నష్టం వచ్చిందని.. లాభంలో క్షీణతకు ఇదే ప్రధాన కారణమని ఎయిర్‌టెల్‌ తెలిపింది. కార్యకలాపాల ఆదాయం రూ.36,009 కోట్ల నుంచి 4.4% పెరిగి రూ.37,599.10 కోట్లుగా నమోదైంది. ఒక్కో వినియోగదారుడిపై కంపెనీ సగటు ఆర్జన (ఆర్పు) రూ.193 నుంచి 8% పెరిగి రూ.209కు చేరింది. దేశీయ పరిశ్రమలోనే ఇది అధికమని భారతీ ఎయిర్‌టెల్‌ మేనేజింగ్‌ డైరెక్టరు గోపాల్‌ విత్తల్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు