Tata Comm: రూ.486 కోట్లతో ‘స్విచ్‌’ను కొనుగోలు చేసిన టాటా కామ్‌!

టాటా కమ్యూనికేషన్స్‌ అమెరికాకు చెందిన స్విచ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ను కొనుగోలు చేసింది.

Published : 22 Dec 2022 18:45 IST

దిల్లీ: న్యూయార్క్‌ కేంద్రంగా పనిచేస్తున్న లైవ్‌ వీడియో ప్రొడక్షన్‌ కంపెనీ ‘ది స్విచ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ (The Switch Enterprises)’ను టాటా కమ్యూనికేషన్స్‌ (Tata Communications) కొనుగోలు చేయనుంది. అనుబంధ సంస్థ టాటా కమ్యూనికేషన్స్‌ (నెదర్లాండ్స్‌) బి.వి ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేయనుంది. ఈ కొనుగోలు విలువ రూ.486 కోట్లు. పూర్తిగా నగదు రూపంలో చెల్లింపులు చేసేలా ‘టాటా కామ్‌ (Tata Communications)’ ఒప్పందం ఖరారు చేసుకుంది.

తాజా ఒప్పందంతో స్విచ్‌ ఎంటర్‌ప్రజెస్‌కు చెందిన కెనడా, అమెరికా, యూకేలోని అనుబంధ సంస్థల ఆస్తులు సైతం టాటా కమ్యూనికేషన్స్‌ వశం కానున్నాయి. అంతర్జాతీయంగా టాటా కమ్యూనికేషన్స్‌కు  విస్తారమైన నెట్‌వర్క్‌ ఉంది. ఉత్తర అమెరికాలో స్విచ్‌ కార్యకలాపాలు బలంగా కొనసాగుతున్నాయి. ఈ రెండూ కలిస్తే గ్లోబల్‌ మీడియా వ్యవస్థలో బలమైన సంస్థ అవతరిస్తుందని టాటా కమ్యూనికేషన్స్‌ చీఫ్‌ స్ట్రాటజీ ఆఫీసర్‌ ట్రై ఫామ్ తెలిపారు. ఐరోపా, ఉత్తర అమెరికాలో తమ ‘వీడియో కనెక్ట్‌’ వ్యాపారం మరింత విస్తరిస్తుందన్నారు. అలాగే వివిధ కంపెనీలకు వినూత్న డిజిటల్‌ కంటెంట్‌ పద్ధతులను అందుబాటులో తీసుకొస్తామని తెలిపారు.


ఎస్క్రో ఖాతాలో జియో రూ.3,720 కోట్లు జమ

‘రిలయన్స్‌ ఇన్‌ఫ్రాటెల్‌’ మొబైల్‌ టవర్‌, ఫైబర్‌ ఆస్తుల కొనుగోలుకు కావాల్సిన రూ.3,720 కోట్లను జియో అనుబంధ సంస్థ ‘రిలయన్స్‌ ప్రాజెక్ట్స్‌ అండ్‌ ప్రాపర్టీ మేనేజ్‌మెంట్‌’ ఎస్‌బీఐ ఎస్క్రో ఖాతాలో జమ చేసింది. రిలయన్స్‌ ఇన్‌ఫ్రాటెల్‌ కొనుగోలుకు ఎన్‌సీఎల్‌టీ గత నవంబరులో జియోకు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.

అనిల్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ అప్పుల ఊబిలో కూరుకుపోయిన విషయం తెలిసిందే. దీని అనుబంధ సంస్థ ఇన్‌ఫ్రాటెల్‌ టవర్లు, ఫైబర్‌ ఆస్తులను కొనుగోలు చేసేందుకు 2019లో అనిల్‌ అంబానీ సోదరుడు ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని జియో రూ.3,720 కోట్లతో వేసిన బిడ్‌ విజయవంతమైంది. దీంతో ఆ మొత్తాన్ని ఎస్‌బీఐ ఎస్క్రో ఖాతాలో జమ చేయాలని ఎన్‌సీఎల్‌టీ ఆదేశించింది. వీటిని ‘కమిటీ ఆఫ్‌ క్రెడిటార్స్‌’ రుణ దాతలకు పంచనుంది. ఈ ప్రక్రియ పూర్తైతే.. 43,540 మొబైల్‌ టవర్లు, 1.78 లక్షల రూట్‌ కిలోమీటర్ల ఫైబర్‌ ఆస్తులు జియో కిందకు రానున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని