Tata Motors: టాటా మోటార్స్‌ పెట్టుబడులు రూ.43,000 కోట్లు!

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తమ పెట్టుబడుల ప్రణాళికను టాటా మోటార్స్‌ గ్రూప్‌ మరింత పెంచుకుంది.

Published : 20 May 2024 01:47 IST

కొత్త ఉత్పత్తులు, సాంకేతికతలపై..
2024-25కు ప్రణాళికలు

దిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తమ పెట్టుబడుల ప్రణాళికను టాటా మోటార్స్‌ గ్రూప్‌ మరింత పెంచుకుంది. బ్రిటిష్‌ అనుబంధ సంస్థ జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ (జేఎల్‌ఆర్‌)తో పాటు టాటా మోటార్స్‌ బ్రాండ్‌పై కొత్త ఉత్పత్తులు, సాంకేతికతల ఆవిష్కరణ కోసం 2024-25లో రూ.43,000 కోట్ల పెట్టుబడులు పెడతామని గ్రూప్‌ ప్రకటించింది.

2023-24లో ప్రణాళికల కంటే అధికంగా..

జేఎల్‌ఆర్‌కు రూ.30,000 కోట్ల (3 బిలియన్‌ పౌండ్ల) పెట్టుబడులు సమకూరుస్తామని, మరో రూ.8,000 కోట్లు టాటా మోటార్స్‌కు (మొత్తం రూ.38,000 కోట్లు) కేటాయిస్తామని టాటా మోటార్స్‌ గ్రూప్‌ గత ఆర్థిక సంవత్సరంలో తన ప్రణాళికను ప్రకటించింది. అయితే జేఎల్‌ఆర్‌కు 3.3 బిలియన్‌ పౌండ్లు (రూ.33,000 కోట్ల కంటే ఎక్కువగా), టాటా మోటార్స్‌కు రూ.8,200 కోట్లు సమకూర్చినట్లు (మొత్తం రూ.41,200 కోట్లు) సంస్థ చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ (సీఎఫ్‌ఓ) పీబీ బాలాజీ, ఆర్థిక ఫలితాల అనంతర ఎర్నింగ్స్‌ సమావేశంలో వెల్లడించారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి

ఈ ఆర్థిక సంవత్సరానికి వస్తే జేఎల్‌ఆర్‌కు పెట్టుబడులు మరో 6% పెంచి, 3.5 బిలియన్‌ పౌండ్లు (సుమారు రూ.35,000 కోట్లు) కేటాయిస్తున్నట్లు బాలాజీ తెలిపారు. కొత్త వాహనాల ఆవిష్కరణ.. ప్రణాళిక ప్రకారం జరిగేందుకే ఇంత మొత్తం కేటాయిస్తున్నట్లు వివరించారు. టాటా మోటార్స్‌కు సుమారు రూ.8,000 కోట్లు సమకూరుస్తామని పేర్కొన్నారు. అంటే మొత్తం రూ.43,000 కోట్ల మేర ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడులు పెడతామని చెప్పారు. 

రేంజ్‌ రోవర్‌ బీఈవీ ప్రత్యేకత ఇదీ

‘రేంజ్‌ రోవర్‌ బీఈవీని.. బ్యాటరీ విద్యుత్తు వాహనంగా విక్రయించం. దాన్ని రేంజ్‌ రోవర్‌గా మాత్రమే అమ్ముతాం. బీఈవీ ఇంజిన్‌ కలిగిన రేంజ్‌ రోవర్‌ ఇది’ అని రిచర్డ్‌ తెలిపారు.‘రేంజ్‌ రోవర్‌ బ్రాండ్‌కు తగిన విధంగా అధిక శక్తి కలిగి, నిశ్శబ్దంగా - ప్రశాంతంగా ప్రయాణించేందుకు అనువైన వాహనం ఇది. అందువల్ల రేంజ్‌ రోవర్‌లో హైఎండ్‌ మోడల్‌గా’ అభివర్ణించారు. రేంజ్‌ రోవర్, రేంజ్‌ రోవర్‌ స్పోర్ట్‌లో పలు ఆవిష్కరణలు చోటుచేసుకున్నాయని, ఈ ఏడాదిలో డిఫెండర్‌ ఆక్టాను విడుదల చేస్తామని రిచర్డ్‌ పేర్కొన్నారు. 


జేఎల్‌ఆర్‌ కొత్త మోడళ్లు  2025-26లో 

వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి తమ కొత్త మోడళ్లు మార్కెట్లోకి వస్తాయని జేఎల్‌ఆర్‌ సీఎఫ్‌ఓ రిచర్డ్‌ పేర్కొన్నారు. రేంజ్‌ రోవర్‌ బీఈవీ తో పాటు మరికొన్ని మోడళ్లు విడుదల చేస్తామని తెలిపారు. ప్రస్తుతం తక్కువ సంఖ్యలో అమ్ముడవుతున్న మోడళ్ల స్థానంలో కొత్త మోడళ్లు ప్రవేశ పెడతామని వివరించారు.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని