Tata group: మరో ఐఫోన్ల ప్లాంట్‌కు టాటాలు రెడీ.. 50 వేల మందికి ఉపాధి!

Tata  group- iphone: టాటా గ్రూప్‌ మరో అతిపెద్ద ఐఫోన్‌ ప్లాంట్‌ను నెలకొల్పేందుకు సిద్ధమవుతోంది. దీనిద్వారా 50 వేల మందికి ఉపాధి లభించనుంది.

Updated : 08 Dec 2023 15:17 IST

Tata group | ఇంటర్నెట్ డెస్క్‌: ఐఫోన్ల (iphones) తయారీకి విస్ట్రాన్‌ ప్లాంట్‌ను కొనుగోలు చేసిన టాటా గ్రూప్‌ (tata group) ఇప్పుడు మరో ప్లాంట్‌ నెలకొల్పేందుకు సిద్ధమవుతోంది. కర్ణాటకలోని ఈ ప్లాంట్‌ కొనుగోలు ద్వారా ఐఫోన్లు తయారుచేసే తొలి భారత కంపెనీగా అవతరించిన టాటా గ్రూప్‌.. దేశంలోనే అతిపెద్ద ప్లాంట్‌ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. భారత్‌లో తన వ్యాపారాన్ని మరింత విస్తరించాలన్న యాపిల్‌ లక్ష్యానికి అనుగుణంగా టాటా గ్రూప్‌ ఈ అడుగులు వేస్తోంది. తమిళనాడులోని హోసూరులో ప్రతిపాదిత కొత్త ఫ్యాక్టరీ నెలకొల్పాలని భావిస్తున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు వెల్లడించారు.

రెండేళ్లలోపే కొత్త ప్లాంట్‌ ఏర్పాటు చేయాలని టాటా గ్రూప్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కర్ణాటకలో ఉన్న ప్లాంట్‌ కంటే పెద్ద ప్లాంట్‌ను నెలకొల్పి, తద్వారా సుమారు 50 వేల మందికి ఉపాధి కల్పించాలని టాటా గ్రూప్‌ లక్ష్యంగా పెట్టుకుందని సమాచారం. ఇందులో 20 అసెంబ్లీ లైన్స్‌ ఉంటాయని తెలుస్తోంది. 12-18 నెలల్లోపే కొత్త ప్లాంట్‌లో కార్యకలాపాలు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిసింది. చైనా నుంచి తన అసెంబ్లింగ్‌, విడిభాగాల తయారీని ఇతర దేశాలకు విస్తరించాలని భావిస్తున్న యాపిల్‌.. ఇందుకోసం భారత్‌, థాయ్‌లాండ్‌, మలేసియా దేశాల్లో ఉన్న భాగస్వాములతో కలిసి సప్లయ్‌ను పెంచాలని భావిస్తోంది. ఈ ప్రక్రియలో భాగంగా టాటా కొత్త ప్లాంట్‌ను నెలకొల్పాలనుకుంటోంది. అయితే, దీనిపై అటు యాపిల్‌ గానీ, ఇటు టాటా ప్రతినిధి గానీ స్పందించలేదు. 

RBI: ఐదోసారీ వడ్డీరేట్లు యథాతథం.. వృద్ధిరేటు అంచనాల పెంపు

ప్రస్తుతం హోసూరులో ఐఫోన్‌ మెటల్ కేసింగ్‌ల తయారీ ప్లాంట్‌ సైతం టాటాల చేతిలోనే ఉంది. ఇక్కడా ఉత్పత్తిని పెంచేందుకు నియామకాలు చేపడుతోంది. కేవలం యాపిల్‌ ఫోన్ల అసెంబ్లింగ్‌కు మాత్రమే పరిమితం కాకుండా యాపిల్‌ ఉత్పత్తులతో కూడిన 100 రిటైల్‌ స్టోర్లు ఏర్పాటు చేయాలని కూడా టాటా గ్రూప్‌ చూస్తోంది. తన వంతుగా యాపిల్‌ ఇప్పటికే దేశంలో రెండు అతిపెద్ద రిటైల్‌ స్టోర్లు ప్రారంభించిన సంగతి తెలిసిందే. మరో మూడింటిని నెలకొల్పాలని చూస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని