Tata Tech Listing: టాటా టెక్‌ బంపర్‌ లిస్టింగ్‌.. ఒక్కో లాట్‌పై రూ.21 వేల లాభం

Tata Tech Listing: టాటా టెక్‌ ఐపీఓ లిస్టింగ్‌ అంచనాలకు మించిన లాభాన్నించ్చింది. ఇష్యూ ధరతో పోలిస్తే 140 శాతం లాభంతో షేర్లు స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో నమోదయ్యాయి.

Updated : 30 Nov 2023 14:17 IST

Tata Tech Listing | ముంబయి: మదుపరుల నుంచి అనూహ్య స్పందనతో రికార్డు సృష్టించిన టాటా టెక్‌ ఐపీఓ షేర్లు నేడు స్టాక్ ఎక్స్చేంజీల్లో లిస్టయ్యాయి (Tata Tech Listing). అందరూ ఊహించినట్లుగానే బంపర్‌ లిస్టింగ్‌ నమోదు చేసింది. ఇష్యూ ధరతో పోలిస్తే ఏకంగా 140 శాతం లాభంతో షేర్లు ట్రేడింగ్‌ మొదలుపెట్టాయి.

టాటా టెక్ ఐపీఓ (Tata Tech IPO) ఇష్యూ ధర రూ.500 కాగా బీఎస్‌ఈలో షేరు ఈ రోజు రూ.1,200 దగ్గర లిస్టయ్యింది. ఒక్కో షేరుపై లిస్టింగ్‌లోనే రూ.700 లాభం రావడం విశేషం. ఈ లెక్కన ఐపీఓలో షేర్లు అలాట్‌ అయినవారు ఒక్కో లాట్‌ (30 షేర్లు)పై రూ.15 వేలు పెట్టుబడి పెట్టగా.. లిస్టింగ్‌ ధర వద్ద రూ.21 వేల లాభాన్ని ఆర్జించినట్లయింది. తర్వాత ఈ షేరు బీఎస్‌ఈలో రూ.1,400 దగ్గర ఇంట్రాడే గరిష్ఠాన్ని నమోదు చేసింది. తర్వాత కొంచెం దిగొచ్చి ఉదయం 10:37 సమయంలో రూ.1,303.80 దగ్గర ట్రేడవుతోంది.

టాటా గ్రూప్‌ నుంచి రెండు దశాబ్దాల తర్వాత వచ్చిన టాటా టెక్‌ ఐపీఓకు (Tata Tech IPO) ఊహించని రీతిలో స్పందన లభించిన విషయం తెలిసిందే. రూ.3042 కోట్ల సమీకరించేందుకు వచ్చిన ఈ ఐపీఓకు భారీ స్థాయిలో సబ్‌స్క్రిప్షన్‌ వచ్చింది. మొత్తం 4.5 కోట్ల షేర్లు సబ్‌స్క్రిప్షన్‌కు ఉంచగా.. చివరి రోజు పూర్తయ్యే సరికి 69.4 రెట్ల స్పందన లభించింది. మొత్తం 312.42 కోట్ల షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. ఇష్యూ ధర రూ.500 దగ్గర లెక్కిస్తే ఈ మొత్తం రూ.1.56 లక్షల కోట్లతో సమానం.

టాటా టెక్‌కు 18 అంతర్జాతీయ డెలివరీ కేంద్రాలున్నాయి. దాదాపు 11 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇంజినీరింగ్‌, పరిశోధన-అభివృద్ధి (ఈఆర్‌అండ్‌డీ) సేవలు, డిజిటల్‌ ఎంటర్‌ప్రైజ్‌ సర్వీసెస్‌ (డీఈఎస్‌), ఎడ్యుకేషన్‌ ఆఫరింగ్స్‌, వాల్యూ యాడెడ్‌ రీసెల్లింగ్‌ అండ్‌ ఐప్రోడక్ట్స్‌ ఆఫరింగ్స్‌ విభాగాల్లో వ్యాపారాలున్నాయి. టాటా మోటార్స్‌, జాగ్వార్‌ ల్యాండ్‌రోవర్‌ సహా టాటా గ్రూప్‌లోని ఇతర సంస్థలకు ఇది ప్రధానంగా సేవలందిస్తోంది.

గాంధార్‌ ఆయిల్‌ సైతం..

ఈ రోజు గాంధార్‌ ఆయిల్‌ రిఫైనరీ (ఇండియా) షేర్లు సైతం స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో లిస్టయ్యాయి. ఇష్యూ ధర రూ.169తో పోలిస్తే బీఎస్‌ఈలో 75 శాతం లాభంతో రూ.295.40 వద్ద, ఎన్‌ఎస్‌ఈలో రూ.298 దగ్గర ట్రేడింగ్‌ మొదలుపెట్టాయి. ఐపీఓలో షేర్లు అలాట్‌ అయినవారు 88 షేర్ల (ఒక లాట్‌)కు రూ.14,872 పెట్టుబడి పెట్టారు. వీరు ఒక్కో లాట్‌పై లిస్టింగ్‌ దగ్గర (బీఎస్‌ఈలో) రూ.11,123 లాభాన్ని ఆర్జించారు.

నవంబర్‌ 24న పూర్తయిన గాంధార్‌ ఆయిల్‌ ఐపీఓకు 64.07 రెట్ల స్పందన లభించిన విషయం తెలిసిందే. 2.12 కోట్ల షేర్లు ఐపీఓలో సబ్‌స్క్రిప్షన్‌కు ఉంచగా.. 136.1 కోట్ల షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. క్యూఐబీలో 129 రెట్లు, ఎన్‌ఐఐల నుంచి 62.23 రెట్లు, రిటైల్‌ మదుపర్ల నుంచి 28.95 రెట్ల స్పందన లభించింది. రూ.500.69 కోట్ల సమీకరణకు లక్ష్యంతో వచ్చిన ఈ ఇష్యూకు, రూ.23,000 కోట్లకు పైగా బిడ్లు వచ్చాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని