fixed deposit: పన్ను ఆదా ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు.. కాలపరిమితి 5 ఏళ్ల నుంచి 3 ఏళ్లకు?

fixed deposits: పన్ను ఆదా సదుపాయం అందించే ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల కాల పరిమితిని 5 ఏళ్ల నుంచి 3 ఏళ్లకు తగ్గించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.

Published : 11 Jun 2024 14:54 IST

Fixed deposits | ఇంటర్నెట్‌ డెస్క్‌: సురక్షిత పెట్టుబడి పథకాల్లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ (FD) ఒకటి. స్టాక్‌ మార్కెట్‌, మ్యూచువల్‌ ఫండ్స్‌ వంటి నష్ట భయంతో కూడుకున్న పథకాల జోలికి వెళ్లలేని వారు వీటిపైనే ప్రధానంగా ఆధారపడుతుంటారు. పన్ను ఆదా చేసేందుకు కొందరు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను ఆశ్రయిస్తుంటారు. వీటికి ఐదేళ్ల లాక్‌- ఇన్‌ పీరియడ్‌ ఉంటుంది. దీన్ని మూడేళ్లకు తగ్గించాలని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సహా పలు ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.

రుణాలతో పోలిస్తే డిపాజిట్లు ఆశించిన మేర పెరగకపోవడం పట్ల బ్యాంకులు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. ఈ లోటును పూరించడానికి సర్టిఫికెట్స్‌ ఆఫ్‌ డిపాజిట్లపై ఆధారపడాల్సి వస్తోందని, ఇది తమకు భారంగా మారుతున్నట్లు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో డిపాజిట్లు తగ్గుముఖం పట్టడంపై బ్యాంకులు ప్రభుత్వ ఉన్నతాధికారులకు తాజాగా విజ్ఞాపనను సమర్పించాయి. అందులో ప్రస్తుతం ట్యాక్స్‌ సేవింగ్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లకు నిర్దేశించిన కాలపరిమితిని మూడేళ్లకు తగ్గించాలని కోరినట్లు బ్యాంక్‌ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఒకరు ఓ ఆంగ్ల పత్రికకు తెలియజేశారు. 2023-24లో బ్యాంకుల్లో డిపాజిట్లు 12.9 శాతంగా ఉండగా.. రుణాలు 16.3 శాతం మేర వృద్ధి చెందడం గమనార్హం.

సంప్రదాయ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ పథకాలతో పోలిస్తే ఈక్విటీలు, మ్యూచువల్‌ ఫండ్స్‌, ట్యాక్స్‌ సేవింగ్‌ ఈక్విటీ లింక్డ్‌ సేవింగ్స్‌ స్కీమ్‌ వంటివి మెరుగైన రాబడి అందిస్తున్నాయని, దీంతో మదుపర్లు వాటి వైపు మొగ్గుచూపుతున్నారని బ్యాంకింగ్‌ వర్గాలు చెబుతున్నాయి. పన్ను ఆదా పథకాలు అన్నింటికీ ఐదేళ్ల లాక్‌- ఇన్‌ పీరియడ్‌ ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా బ్యాంకులు ప్రస్తావించాయి. ఈ క్రమంలో ఎఫ్‌డీల లాక్‌- ఇన్‌ పీరియడ్‌ను మూడేళ్లకు తగ్గించడం ద్వారా నిధుల కొరత సమస్య అధిగమించడం వీలవుతుందని బ్యాంకులు భావిస్తున్నాయి. దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని