TCS Q4 results: టీసీఎస్‌ లాభం ₹12,434 కోట్లు.. వారికి డబుల్‌ డిజిట్‌ ఇంక్రిమెంట్‌

దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. క్యూ4లో రూ.12,434 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది.

Updated : 12 Apr 2024 18:27 IST

TCS Result | ముంబయి: దేశంలో త్రైమాసిక ఫలితాల సీజన్‌ ప్రారంభమైంది. దేశీయ అతిపెద్ద ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (TCS) గత ఆర్థిక సంవత్సరం (2023-24) చివరి త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో 9.1 శాతం వృద్ధితో రూ.12,434 కోట్ల నికర లాభాన్ని కంపెనీ నమోదు చేసింది. గతేడాది ఇదే సమయంలో నికరలాభం రూ.11,392 కోట్లుగా ఉంది. మొత్తం ఆర్థిక సంవత్సరంలో రూ.45,908 కోట్ల నికర లాభాన్ని ఆర్జించినట్లు ఎక్స్ఛేంజీకిచ్చిన సమాచారంలో టీసీఎస్‌ తెలిపింది.

మార్చి త్రైమాసికంలో ఆదాయం రూ.61,237 కోట్లుగా కంపెనీ ప్రకటించింది. గతేడాది నమోదైన రూ.59,162 కోట్లతో పోలిస్తే 3.5 శాతం వృద్ధి నమోదైంది. ఆపరేటింగ్‌ ప్రాఫిట్‌ మార్జిన్‌ 1.50 శాతం పెరిగి 26 శాతంగా నమోదైనట్లు తెలిపింది. పూర్తి సంవత్సరానికి ఒక్కో షేరుపై రూ.28 చొప్పున డివిడెండ్‌ను కంపెనీ ప్రకటించింది. సమీక్షా త్రైమాసికంలో 13.2 బిలియన్‌ విలువైన ఆర్డర్లు దక్కించుకున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో టీసీఎస్‌ షేరు 0.45 శాతం లాభంతో 4000.30 వద్ద ముగిసింది.

  • వారికి డబుల్ ఇంక్రిమెంట్‌: ఫలితాల సందర్భంగా ఇంక్రిమెంట్స్‌ గురించి చీఫ్‌ హెచ్‌ఆర్‌ ఆఫీసర్‌ మిలింద్‌ లక్కడ్‌ కీలక ప్రకటన చేశారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో మెరుగైన పనితీరు కనబరిచిన వారికి డబుల్‌ డిజిట్‌ ఇంక్రిమెంట్‌ ఉంటుందని చెప్పారు. వలసల రేటు 12.5 శాతానికి తగ్గిందని పేర్కొన్నారు.
  • తగ్గిన ఉద్యోగుల సంఖ్య: మార్చితో ముగిసిన త్రైమాసికంలో టీసీఎస్‌లో ఉద్యోగుల సంఖ్య 1759 తగ్గింది. పూర్తి ఆర్థిక సంవత్సరంలో 13,249 మేర క్షీణించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగుల సంఖ్య 22,600 పెరగడం గమనార్హం. తాజా గణాంకాల ప్రకారం మార్చి 31 నాటికి టీసీఎస్‌లో 6.01 లక్షల మంది పని చేస్తున్నారు. ఇందులో 35.6 శాతం మహిళలు కాగా.. 152 దేశాలకు చెందినవారు ఉన్నారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని